హోలీ రోజున బ్లడ్ మూన్ కనువిందు
ఈస్టర్న్ టైమ్ జోన్‌లో సంపూర్ణ చంద్ర గ్రహణం
అమెరికా, మెక్సికో, కెనెడాలో కనిపించిన గ్రహణం
లైవ్ టెలికాస్ట్ చేసిన నాసా, వెబ్‌సైట్‌లోనూ స్ట్రీమింగ్
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ:
హోలీ పండెగ రోజే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడింది. కన్యారాశిలో ఏర్పడ్డ సంపూర్ణ చంద్రగ్రహణంగా పండితులు చెబుతుండగా.. 2022 తర్వాత ఇలాంటి ఘటన సంభవించడం ఇదే తొలిసారి అని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. కాగా, 14వ తేదీన హోలీ పౌర్ణమి కూడా కావడం దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున 2:26 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమైంది. 3:31 నిమిషాలకు ముగిసింది. సుమారు 65 నిమిషాల పాటు భూమి నీడలోకి చంద్రుడు వెళ్లిపోయాడు. ఈ సమయాన్ని సూతక కాలంగా జ్యోతిష్య పండుతులు పరిగణిస్తున్నారు.
ఆ దేశాల్లోనూ కనిపించిన బ్లడ్ మూన్..
ఇక.. ఈ చంద్ర గ్రహణాన్ని బ్లడ్ మూన్‌గా సైంటిస్టులు పిలుస్తున్నారు. సంపూర్ణ గ్రహణ సమయంలో చందమామ పూర్తిగా ఎరుపు, ఆరెంజ్ మిశ్రమంలోకి మారడం కనిపించింది. ఈ రంగులు మారడం అనేది భూ వాతావరణ స్థితిగతులపై ఆధారపడి ఉంటుందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. కాగా, ఈ గ్రహణం భారత దేశంలో కనిపించలేదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంత దేశాల్లో మాత్రమే కనిపించిందని సైంటిస్టులు తెలిపారు అక్కడి ప్రజలు ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించినట్టు తెలుస్తోంది. అలాగే, యూరప్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. అలస్కా, హవాయ్, కెనడా, మెక్సికో సహా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చంద్ర గ్రహణాన్ని స్పష్టంగా చూశారు. దక్షిణ అమెరికా పరిధిలోని బ్రెజిల్, అర్జెంటీనా, చిలీల్లోనూ కనిపించింది. పశ్చిమ యూరప్ రీజియన్‌లో స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, ఆఫ్రికాలోని కేప్ వెర్డె, మొరాకో, సెనెగల్.. దేశాల్లో చంద్ర గ్రహణం కనువిందు చేసింది.
నాసా లైవ్ స్ట్రీమింగ్..
సూర్యుడు- భూమి-చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంది. భూమి నీడ పడినప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్లిపోతాడు. దీన్ని చంద్ర గ్రహణంగా పిలుస్తారు. భూమి నీడ చంద్రుడిపై కొంతభాగమే పడినప్పుడు అది పాక్షిక చంద్ర గ్రహణం అవుతుంది. చంద్ర గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహణాన్ని నాసా లైవ్‌లో టెలికాస్ట్ చేసింది. అధికారిక వెబ్ సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.