COLOMBO| నేటి నుంచే సూప‌ర్ స‌మ‌రం

COLOMBO| నేటి నుంచే సూప‌ర్ స‌మ‌రం

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్ 8 మ్యాచ్‌లు
  • తొలి మ్యాచ్‌లో కివీస్‌, పాక్ ఢీ
  • రాత్రి 7గంట‌ల‌కు ప్రారంభం
  • కొలొంబో వేదిక‌గా మ్యాచ్‌

COLOMBO| ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచ కప్‌లో ఇన్ని రోజులు కొన్ని మ్యాచులు చ‌ప్ప‌గా సాగాయి. గ్రూప్ ద‌శ‌లో చిన్న జ‌ట్ల‌తో సాగిన మ్యాచులు అంత‌గా మ‌జాను పంచ‌లేదు. అయితే ఇప్ప‌డు చిన్నాచిత‌క జట్లు గ్రూప్ ద‌శ‌లో ఇంటి దారి ప‌ట్టాయి. ఇప్ప‌డు సూప‌ర్ 8లోకి సూప‌ర్ జ‌ట్లు అడుగు పెట్టాయి. ఇక‌నుంచి జ‌రిగే మ్యాచులు అభిమానుల‌కు వినోదం పంచ‌నుంది. పసికూనలు, పస లేని జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా టాప్‌–8 టీమ్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గ్రూప్ 1లో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఉండగా.. గ్రూప్ 2లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పాక్ ఢీ..
నేటి (ఫిబ్రవరి 21) నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. తొలి మ్యాచ్ గ్రూప్ 2లో భాగంగా జరగనుంది. శ్రీలంక వేదికగా పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.

ఆదివారం స‌ఫారీల‌తో భార‌త్ స‌వాల్‌
గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. అదే దూకుడును ఇక్కడ కూడా ప్రదర్శించాలనే పట్టుదల మీద ఉంది. అయితే గ్రూప్ దశలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. నమీబియా, పాకిస్తాన్‌లపై అదరగొట్టిన భారత్.. అమెరికా, నెదర్లాండ్స్ జట్లపై గెలిచేందుకు చెమటోడ్చింది. భారత జట్టు తన తొలి సూపర్ 8 మ్యాచ్‌ను ఆదివారం ఆడనుంది. సౌతాఫ్రికాతో ఢీకొన‌నుంది. సౌతాఫ్రికాతో పోరు కావడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. టీమిండియాను బ్యాటింగ్ విభాగం భయపెడుతుంది. ఈ టోర్నీ ముందు వరకు బాగానే ఆడిన కొంద‌రు దారుణంగా ఆడుతున్నారు. కొంద‌రిపైనే బ్యాటింగ్ ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలు మాత్రమే రాణిస్తున్నారు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. దాంతో అతడు సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో ఆడేది అనుమానంగానే ఉంది. అతడిని పక్కన పెట్టి సంజూ సామ్సన్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడించే అవకాశం లేకపోలేదు.

అహ్మదాబాద్‌లో మ్యాచ్‌.. బ్యాటింగ్ పిచ్ రెడీ
ఇక సౌతాఫ్రికా విషయానికి వస్తే.. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. అయితే అఫ్గానిస్తాన్‌పై రెండు సూపర్ ఓవర్స్ ఆడి మరీ గెలవాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. భారీ పరుగులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక డ్యూ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రెండోసారి బౌలింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎవ‌రెవ‌రు.. ఎప్పుడెప్పుడు?
తొలి మ్యాచ్ న్యూజీలాండ్-పాకిస్తాన్ మధ్య ఈ నెల 21 సాయంత్రం 7 గంటలకు జరగనుంది. రెండో మ్యాచ్ ఈ నెల 22న శ్రీలంక-ఇంగ్లండ్ మధ్య మధ్యాహ్నం 3 గంటలకు , మూడో మ్యాచ్ అదే రోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య సాయంత్రం 7 గంటలకు జరుగుతాయి. అలాగే నాలుగో మ్యాచ్ జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య ఈ నెల 23న సాయంత్రం 7 గంటలకు, ఐదో మ్యాచ్ ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య 24న సాయంత్రం 7 గంటలకు జరుగుతాయి. అలాగే సూపర్ 8లో ఆరో మ్యాచ్ శ్రీలంక-న్యూజీలాండ్ మధ్య ఈ నెల 25న సాయంత్రం 7 గంటలకు, ఏడో మ్యాచ్ వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు, ఎనిమిదో మ్యాచ్ అదేరోజు సాయంత్రం 7 గంటలకు భారత్-జింబాబ్వే మధ్య జరుగుతాయి. 27న ఇంగ్లండ్-న్యూజీలాండ్ మధ్య సాయంత్రం 7 గంటలకుసూపర్ 8 మ్యాచ్ జరుగుతుంది. 28న శ్రీలంక-పాకిస్తాన్ మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. దీంతో సూపర్ 8 దశ పూర్తవుతుంది. అనంతరం రెండు సెమీ పైనల్స్ ఉంటాయి. వాటిలో గెలిచిన రెండు జట్లు వరల్డ్ కప్ ఫైనల్లో తలపడతాయి. ఇందులో విజేతకు ట్రోఫీ దక్కుతుంది.

Leave a Reply