జయశంకర్ జిల్లా కోర్టులో ఏసీబీ దాడి

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రూ.5 వేల లంచం స్వీకరిస్తుండగా ముగ్గురు కోర్టు సిబ్బందిని అధికారులు పట్టుకున్నారు. పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), అటెండర్లు పున్నం రజిత, కొమ్ము సునీతలు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
ఘనపూర్ మండలానికి చెందిన సి.హెచ్. గోపాలరావు సివిల్ వివాదానికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ 21, 2025న కోర్టు తీర్పు వెలువడిన అనంతరం సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి రూ.5 వేలు లంచం ఇవ్వాలని కోర్టు సిబ్బంది డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచనల మేరకు లంచం ఇస్తుండగా దాడి నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు ఎల్.రాజు, ఎస్.రాజు, పి.ప్రభాకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
