వాజేడు, మార్చి 12 (ఆంధ్రప్రభ) : మురుమూరు ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని మురుమూరు గ్రామంలో ఏఎస్పీ ఏటూరు నాగారం శివమ్ ఉపాధ్యాయ వాజేడు ఎస్సై సిఆర్పిఎఫ్ జవాన్లతో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ గ్రామస్థులతో మాట్లాడుతూ… ఎవరు కూడా మావోయిస్టులకు సహకరించవద్దన్నారు. వారి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకి అందించాలని చెప్పారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడొద్దని గంజా, గుట్కా, గుడుంబాలకు దూరంగా ఉండాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడుతూ… యువత అతివేగంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని సుచించారు. ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయొద్దన్నారు. చదువుపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, స్కూల్ డ్రాప్ అవుట్ లు ఉండొద్దని సూచించారు. ప్రస్తుత సమయంలో చాలా మంది సులభంగా డబ్బులు సంపాదించాలని ఆన్ లైన్ మోసాలకు గురవుతున్నారన్నారు. కావున ఎవరు కూడా వాటికి గురి కావొద్దని, ఒకవేళ అయినా వెంటనే 1930 కి కాల్ చేస్తే మీ కోల్పోయిన డబ్బులు తిరిగి పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఎస్సై రాజ్ కుమార్, సివిల్ సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.