హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రజా స్వామ్యబద్ధంగా పనిచేయాలని, లేకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను అవమానించలేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ… సభ ప్రతి ఒక్కరిదని… ‘మీ’ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని చెప్పారు. ‘మీ ఒక్కరిది’ అనే పదం కూడా అన్ పార్లమెంటరీ కాదన్నారు. కాంగ్రెస్ సభ్యులు ఎందుకు నిరసన వ్యక్తం చేశారో… సభను స్పీకర్ ఎందుకు వాయిదా వేశారో అర్థం కావడం లేదని చెప్పారు. స్పీకర్ ను అవమానించేలా జగదీశ్ రెడ్డి మాట్లాడలేదన్నారు. స్పీకర్ ను కలిశామని, రికార్డులు తీయాలని అడిగామని చెప్పారు. 15 నిమిషాలు అయినా వీడియో రికార్డును స్పీకర్ తెప్పించలేదని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా బ్లాక్ చేశారని మండిపడ్డారు.
అందరికి సమాన హక్కులు..
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ… సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారని, సభలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. తాము స్పీకర్‌ని అమానించలేదన్నారు. నిన్న రేవంత్ రెడ్డి.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను డైవర్ట్ చెయ్యడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారన్నారు.