Collector | ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ శాఖలు సేవలను అందించాలి..

Collector | ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ శాఖలు సేవలను అందించాలి..

Collector | కర్నూలు, ఆంధ్ర‌ప్ర‌భ‌: ప్రజలు సంతృప్తి చెందేలా ఆయా ప్రభుత్వ శాఖలు సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి సేకరిస్తున్న ఫీడ్ బ్యాక్ సానుకూలంగా వచ్చే విధంగా ఆయా శాఖలు మంచి సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు.


ఈ అంశంలో జిల్లా ర్యాంక్ ముందు స్థానంలో ఉండాలని కలెక్టర్ సూచించారు. రేషన్ కు సంబంధించి రేషన్ సరుకులు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, అలాగే సరుకుల నాణ్యత బాగుండేలా చూడాలని డీఎస్ఓను ఆదేశించారు. దీపం కు సంబంధించి గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రవర్తన మర్యాదగా ఉండాలని, బిల్లు మొత్తం కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఎస్వో ను ఆదేశించారు. విద్యుత్ సేవలకు సంబంధించి విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండి, విద్యుత్ సరఫరా లో లోపాలు లేకుండా చూడాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ ని ఆదేశించారు.


పాఠశాల విద్యకు సంబంధించి పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో హాజరయ్యేలా చూడాలని, పిల్లలకు అర్థమయ్యేలా విద్యాబోధన ఉండాలని కలెక్టర్ డిఇఓ ను ఆదేశించారు.. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వడ్డించాలని, రుచి, నాణ్యత బాగుండాలని, వేరు శనగ చిక్కి కూడా నాణ్యతగా ఉండేలా చూడాలని కలెక్టర్ డిఇఓ ను ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ల ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని,కచ్చితంగా హాజరు నమోదు చేయాలని కలెక్టర్ జడ్పీ సీఈవో ను ఆదేశించారు.. ప్రజలకు మంచి సేవలు అందించి రిజిస్ట్రేషన్ శాఖ కు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ జిల్లా రిజిస్ట్రార్ ను ఆదేశించారు..


ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాసర రెడ్డి, డీఎస్వో రాజా రఘువీర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ ప్రదీప్ కుమార్, డిఇఓ సుధాకర్, సమగ్ర శిక్ష ఏపీసీ లోకరాజు, జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply