Now rold gold : రోల్డ్ గోల్డ్.. క్రష్ Andhra Prabha SPL Story

Now rold gold : రోల్డ్ గోల్డ్.. క్రష్ Andhra Prabha SPL Story
బంగారం ధర తట్టుకోలేక..
ఇమిటేషన్ జ్యూయలరీకి జనం పట్టం
బందరు నగలకు గిరాకీ
విదేశీ వనితల దృష్టి ఇటువైపే
( ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్)
అమెరికా ఏ దేశంతో గొడవ పడుతుందో అర్థం కావటం లేదు. చైనా, రష్యాపై కోపంతో..జగత్తు జగడాలకు ఆజ్యం పోస్తోంది. చమురు వ్యాపారాన్ని కొల్లగొట్టింది. ఇక టెక్నాలజీకి అత్యవసర వెండిపైనా కృత్రిమ కొరత సృష్టించింది. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అర్థం కాని స్థితిలో.. షేర్ మార్కెట్టు వైపు చూడటానికే మదుపర్లు భయపడుతున్నారు. ఇంకేముందీ.. బంగారం కోసం పరుగులు పెడ్తుంటే.. బంగారం ధర గ్రహాంతరాలను తాకింది. పాత మదుపర్లు లాభాలను స్వీకరిస్తుంటే.. అకస్మాత్తుగా బంగారం కొనుగోళ్లను బులియన్ మార్కెట్ నిలిపివేయటంతో గోల్డ్ రన్ రేట్ కూలబడిపోయింది.

ఈ విపత్కర స్థితిలో భారతీయ బులియన్ మార్కెట్ తీవ్ర సంక్షోభంలో విలవిల్లాడుతోంది. ₹ 7.50 లక్షల కోట్ల రోజు వారీ టర్నోవరు కాస్త..₹ 5.7 లక్షల కోట్లకు పడిపోయింది. ఎందుకంటే ఆభరణాల కొనుగోళ్లు తగ్గటమే. మధ్యతరగతి జనం కనీసం చిన్నం బంగారం కొనలేని స్థితిలో.. నవ వధువులు అసలు కంటే.. కొసరు ఆభరణాలకే మక్కువ చూపిస్తున్న తరుణంలో… ఇటీవల ఇండియాలో ఇమిటేషన్ జ్యూయలరీకి (Now rold gold) విపరీత డిమాండు పెరిగింది.

ఒకప్పుడు భారీ స్థాయిలో నగలు ధరిస్తే .. ఇవి ఎక్కడ కొన్నారు? చిలకలపూడి (chilakalapudi) నగలు కాదుగా? అని ఆశ్చర్యంగా ప్రశ్నించిన మిడిల్ క్లాస్ మహిళలు.. ఇప్పుడు బందరు దారి పడుతున్నారు. ఇక్కడ రోల్డ్ గోల్డ్ షాపులు ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి. కేవలం చిలకలపూడిలోనే కాదు.. రాజస్ధాన్, ముంబై, చైన్నె, తిరువనంతపురం నగరాల్లోనూ ఇమిటేషన్ జ్యూయలరీకి యమ గిరాకీ కనిపిస్తోంది. అంతే కాదండీ.. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), థాయిలాండ్ , శ్రీలంక దేశాల వనితలు సైతం భారతీయ ఇమిటేషన్ జ్యూయలరీనే ఇష్టపడుతున్నారు. ఎనీ హౌ.. బంగారం ధరలు విపరీతంగా పెరగటంతో.. ఇమిటేషన్ జ్యూయలరీ ఇండస్ట్రీలో ప్రస్తుతం గోల్డెన్ పిరియడ్ నడుస్తోంది.
Now rold gold : ఇమిటేషన్ జ్యూయలరీ వైపు..

భారతదేశంలో ఈ ఏడాది 2026 ఆరంభంలోనే బంగారం, వెండి ధరలు ఆకాశంలోకి దూసుకు పోవటంతో , మధ్య తరగతి జనం చూపు ఇమిటేషన్ వైపు మళ్లింది. ఈ పరిశ్రమ ప్రస్తుతం రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర ₹1,83,000 మార్కును తాకడంతో, మేలిమి బంగారం ఆభరణాల డిమాండ్ 24% తగ్గగా, మధ్యతరగతి ప్రజలు పెళ్లిళ్లు, శుభకార్యాలకు రోల్డ్ గోల్డ్ ఆభరణాలనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

అసలు బంగారు నగల తరహాలోనే నెక్లెస్‌లు, హారాలు, వడ్డాణాలు, గాజులకు గిరాకీ విపరీతంగా పెరిగింది. బులియన్ మార్కెట్ లోటును ఇమిటేషన్ జ్యూయలరీ భర్తీ చేస్తోంది. 2025-.. 2026 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఇమిటేషన్ జ్యూయలరీ మార్కెట్ టర్నోవరు ₹41,000 కోట్లు రికార్డు కాగా.. ఈ మార్కెట్ ఏటా 10.04% నుండి 11.4% చొప్పున వృద్ధి చెందుతోంది. 2032 నాటికి ఇది $973 కోట్లు (₹ 88000 కోట్లు)కు చేరుతుందని అంచనా.
Now rold gold : పార్కులన్నీ బిజీబిజీ

భారత దేశంలో ఇమిటేషన్ జ్యూయలరీ పార్కులు బిజీబిజీగా మారాయి. దాదాపు పదిలక్షల మంది రోల్డ్ గోల్డ్ కార్మికులు క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నారు. ఒకవైపు మెషినరీ, మరో వైపు మానవ నైపుణ్యంతో.. అసలు బంగారు నగల్ని మరిపిస్తూ.. నగలను ఉత్పత్పి చేయటమే కాదు.. విదేశాలకూ ఎగుమతికి డిమాండును తీర్చుతున్నారు. గుజరాత్ లోని రాజ్ కోట్, సూరత్, అహ్మదాబాద్ రాజ్ కోట్ లో మెషిన్ మేడ్ జ్యూయలరీ, పాలిషింగ్ హబ్, మహారాష్ట్రలోని ముంబై (జవేరీ బజార్, మలాడ్), మోడరన్ డిజైన్లు, గ్లోబల్ ఎగుమతులు జరుగుతుంటే, రాజస్థాన్ లో జైపూర్ కుందన్ , యూపీలో మొరాదాబాద్, సంభాల్ , పశ్చిమ బెంగాల్ కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం (బందరు) , తమిళనాడులోని కోయంబత్తూర్, చెన్నై, తెలంగాణలోని హైదరాబాద్ (లాడ్ బజార్ ) లో ఇమిటేషన్ జ్యూయలరీకి మంచి పేరుంది.

భారతదేశంలో సుమారు 660కి పైగా ప్రముఖ ఎగుమతి/తయారీ సంస్థలు ఉండగా గుజరాత్‌లోని రాజ్ కోట్ లోనే సుమారు 700 పైగా చిన్న తయారీ యూనిట్లు ఉన్నాయి. ముంబైలోని జవేరీ బజార్ ప్రాంతంలోనే 1000కి పైగా హోల్ సేల్ , తయారీసంస్థలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా రోల్డ్ గోల్డ్ కార్మికులు ప్రత్యక్షంగా పని చేస్తున్నారు. భారతదేశం నుండి ఇమిటేషన్ జ్యూయలరీ అమెరికా, బ్రిటన్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతోంది.
Now rold gold : ఈ నగలు కారు చౌక

ఇమిటేషన్ జ్యూయలరీ తయారీ విధానం, ఉపయోగించే ముడి సరుకులు , డిజైన్ల ప్రాముఖ్యతను బట్టి ఈ నగలు ధరలు అందుబాటులో ఉంటాయి. 2026లో బంగారం ధరలు భారీగా పెరగడంతో, నాణ్యమైన ఇమిటేషన్ ఆభరణాల ధరల్లో కూడా కొంత పెరుగుదల కనిపిస్తోంది. ధారణ రోజువారీ వినియోగం నుంచి పార్టీ వేర్ వరకు వివిధ రకాల ఆభరణాల ధరల్ని పరిశీలిద్దాం. చిన్న స్టడ్స్ లేదా జుంకీలు చెవి రింగులు ₹50 నుంచి ₹2,500 వరకు ఉంటాయి. నెక్లెస్‌లు (Necklaces) ₹300 నుంచి ₹2,000 మధ్య లభిస్తాయి. డిజైన్ , మెటీరియల్‌ను బట్టి గాజుల (Bangles) సెట్ ₹200 నుండి ₹1,500 వరకు ఉంటుంది. 1-గ్రామ్ బంగారం ఆభరణాలు కాస్త ప్రీమియం రకానికి చెందినవి. వీటి సెట్లు ₹5,000 నుండి ₹10,000 పైగా ఉంటాయి.

పెళ్లిళ్లల్లో వధువుల అలంకరణకు (Bridal Jewellery) ప్రత్యేకంగా రూపొందించిన భారీ ఆభరణాల సెట్లు వివిధ ధరలలో అందుబాటులో ఉన్నాయి. అలాయ్ (Alloy) లేదా ఇత్తడితో చేసిన సాధారణ పెళ్లి సెట్లు ₹1,500 నుండి ₹5,000 మధ్య లభిస్తాయి. కుందన్, మ్యాట్ ఫినిష్ లేదా గుట్టపూసల డిజైన్లు ₹5,000 నుంచి ₹15,000 వరకు ఉంటాయి. హై-క్వాలిటీ పోల్కీ (Polki), మోయిసానైట్ (Moissanite) లేదా జడవూ వర్క్ ఉన్న ప్రీమియం బ్రైడల్ సెట్లు ₹20,000 నుంచి ₹60,000 వరకు, కొన్ని సందర్భాల్లో లక్ష రూపాయల వరకు కూడా ఉండవచ్చు.
Now rold gold : బందరు నగలే వేరబ్బా

బందరు చిలకలపూడి రోల్డ్ గోల్డ్ నగలు ఫ్యామస్ . పేద, మధ్యతరగతి వర్గాలే కాదు.. సంపన్న మహిళలు సైతం చిలకలపూడి నగలంటే మహా మక్కువ చూపిస్తారు. తమ పిల్లలు భరతనాట్యం చేస్తే.. కావాల్సిన ఆభరణాలన్నీ ఇక్కడే కొంటారు. సినీ ఫీల్డ్ మొత్తం బందరు నగలతో గోల్డ్ ట్రజరరీ సీన్లు చూపిస్తారు. నిజానికి 40 ఏళ్ల కిందట చిలకపూడి నగల వ్యాపారులు గ్రామాల్లోకి వచ్చి వాయిదా నగలుగా విక్రయించే స్థితి. ఇప్పుడు.. వివిధ దేశాల వనితలు సైతం చిలకల పూడి నగల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ పెళ్లి సెట్లు అతి తక్కువగా ₹1,000 నుంచి ₹3,500 కే లభిస్తాయి, ఇవి అసలు బంగారు నగలంటే నమ్మక తప్పదు. కానీ ఇక్కడి వ్యాపారులు అసలు మోసం చేయరు. మైక్రో ప్లేటింగ్ లేదా 1-గ్రామ్ గోల్డ్ ఫినిష్ ఆభరణాల ధర కాస్త ఎక్కువే. అమెరికన్ డైమండ్స్ (CZ), కుందన్ లేదా సెమీ-ప్రిషియస్ రాళ్లు వాడితే ధర పెరుగుతుంది. భారీగా ఉండే హారాలు, వడ్డాణాలకు కి ఎక్కువ మెటీరియల్ పడుతుంది కాబట్టి ధర ఎక్కువగా ఉంటుంది.
Now rold gold : చిలకలపూడి కిటకిట

2026 జనవరిలో బంగారం ధరలు చారిత్రక గరిష్టాలను తాకిన నేపథ్యంలో, మచిలీపట్నం (బందరు) రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు అనూహ్యమైన డిమాండ్ పెరిగింది. పసిడి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో, వినియోగదారులు ప్రత్యామ్నాయంగా “చిలకలపూడి బంగారం” వైపు మొగ్గు చూపుతున్నారు. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ₹1,83,000 మార్కును తాకడంతో, మధ్యతరగతి , పేద వర్గాల ప్రజలు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బందరు రోల్డ్ గోల్డ్ ఆభరణాలనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

మేలిమి బంగారు నగల తరహాలోనే ఉండే నెక్లెస్‌లు, హారాలు, వడ్డాణాలు , గాజులకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బందరులో తయారయ్యే బ్రైడల్ సెట్స్ (Bridal Sets) కు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కస్టమర్లు తరలివస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో సుమారు 250కి పైగా తయారీ యూనిట్లు, 260కి పైగా రిటైల్ షాపులు ఉన్నాయి. ఈ పరిశ్రమ సుమారు 30,000 మంది కళాకారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పిస్తోంది. కోవిడ్ రాకకు పూర్వం ఈ పరిశ్రమ వార్షిక టర్నోవరు సుమారు ₹150 – ₹200 కోట్లుగా ఉండేది. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో టర్నోవరు ₹90 కోట్లకు పడిపోయింది. 2025 ద్వితీయార్థం నుంచి బంగారం ధరలు పెరగడంతో ఈ పరిశ్రమ మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం టర్నోవరు ₹120 – ₹150 కోట్ల దిశగా సాగుతోందని అంచనా.
Now rold gold : అయినా సరే

రోల్డ్ గోల్డ్ తయారీలో వాడే రాగి (Copper) రసాయనాల ధరలు పెరగడం వల్ల తయారీ వ్యయం కూడా కొంత పెరిగింది. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న ఇమిటేషన్ జ్యువెలరీ ఆన్‌లైన్ మార్కెట్లలో లభిస్తుండటం బందరు వ్యాపారులకు కొంత సవాలుగా మారింది. సౌదీ అరేబియా, థాయిలాండ్ లంక దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరిగేవి. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ఇమిటేషన్ జ్యూయలరీ పార్కుల పోటీ పెరిగింది. కానీ చిలకలపూడి నగలకు గిరాకీ మాత్రం తగ్గలేదు. కొంటే బందరు నగలనే కొనాలి, ధరిస్తే చిలకలపూడి వడ్డాణమే కావాలి, అని మధ్యతరగతి వధువులు ముచ్చట పడుతుంటారు. ఏది ఏమైనా బంగారం ధరల పెరుగుదలతో బందరు రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు ఒక “గోల్డెన్ పీరియడ్” ను తీసుకువచ్చిందని భావించాల్సిందే.
ALSO READ : @ 1000 videos వెయ్యి పడగల రాణి Andhara prabha Insight Story
