ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి అంశంపై పట్టు పెంచుకోండి
ఎవరు రెచ్చగొట్టినా అస్సలు రెచ్చిపోవద్దు
ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి
నేనూ సమావేశాలకు వస్తున్నా…
బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంలో అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పనితీరును అసెంబ్లీలో, మండలిలో ఎండగట్టాలన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్షం భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, మండలిలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన అంశంపై దిశా నిర్దేశం చేశారు. తాను కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నట్లు ఈ సందర్భంగా సభ్యులకు తెలిపారు.
రెచ్చగొడితే రెచ్చిపొవద్దు.. ఆలోచించి మాట్లాడండి..
బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని.. ఈ నెల 6వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించి, అందుకు అనువైన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ, తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలను కోరారు.. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి అంశంపై పట్టు పెంచుకోవాలని సూచించారు.. ఇక సభలో ఎవరు రెచ్చగొట్టిన రెచ్చి పోవద్దన్నారు. ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.