NZB | రెండో రోజూ ప‌సుపు రైతుల ధర్నా.. మద్దతు ధరకు పట్టు

నిజామాబాద్ ప్రతినిధి, మార్చి11(ఆంధ్రప్రభ) : పసుపు పంట‌కు మద్దతు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నామని ఈ నాము ప్రక్రియ వద్దు.. బహిరంగంగానే ధర నిర్ణయించాలంటూ పసుపు రైతులు డిమాండ్ చేశారు. నిన్నటికి నిన్న బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసిన పసుపు రైతులు మంగళవారం మధ్యాహ్నం మార్కెట్ యార్డ్ కార్యాలయం ఎదుట రైతు సంఘాలతో కలిసి పసుపు రైతులు ధర్నా చేపట్టారు. మార్కెట్లో పసుపుకు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పసుపు రైతులు వాపోయారు. మా కష్టాలు అన్నీ ఇన్ని కావని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డులో వ్యాపారులంతా సిండికేట్ అయి మాకు ధర రాకుండా చేస్తున్నారని పసుపు రైతులు ఆరోపించారు.

సాంగ్లీ మార్కెట్ ధర కంటే మాకు ఎందుకు తక్కువ వస్తుందని అధికారులను ప్రశ్నించారు. ఈ ఆన్ లైన్ ప్రక్రియ మాకు వద్దు బహిరంగంగానే ధర నిర్ణయించి, ధర ఎక్కువ వచ్చేలా మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎకరా లక్ష 70వేలకు పెట్టుబడి పెట్టి పసుపును పండిస్తే ధర రాక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వెల్లడించారు. అసలు ఏం జరుగుతుంది, మార్కెట్ యార్డులో జరుగుతున్న తంతుపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ చేపట్టాలని కోరారు.

వెయ్యి రూపాయల బోనస్ ప్రకటించి మంచి ధరను నిర్ణయించి సిండికేట్ వ్యాపారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. పసుపు కొనుగోలుదారుల్లో ఒకరు అన్నీ తానే వ్యవహరించి పసుపు రైతులకు తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంఘాలతో పసుపు రైతులు మార్కెట్ యార్డ్ కార్యాలయం ఎదుట మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్క‌డి నుంచి వెళ్లమంటూ భీష్మించుకొని కూర్చున్నారు. ఇప్పటివరకు పసుపు యార్డుకు 50వేల పసుపు బస్తాలు వచ్చాయి. హోలీ పండుగను పురస్కరించుకొని వరుస సెలవులు రావడంతో పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *