AP | విగ్రహావిష్కరణ..

AP | విగ్రహావిష్కరణ..
- గుంటూరు మెడికల్ కాలేజీలో సుశ్రుత మహర్షి విగ్రహం
AP | గుంటూరు మెడికల్, ఆంధ్రప్రభ : గుంటూరు మెడికల్ కాలేజీ (GMC) ప్రాంగణంలో శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుత మహర్షి విగ్రహాన్ని శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు.

శస్త్ర చికిత్సలకు ఆద్యుడు సుశ్రుత మహర్షి : కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని
భారతదేశంలో పలు శస్త్రచికిత్స విధానాలకు సుశ్రుత మహర్షి ఆద్యుడు అని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని విగ్రహం GMCలో ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలిపారు. అలాగే డా. రాజా కరణం గారి సతీమణి డా. నిర్మలా కరణం విగ్రహ ప్రతిష్ఠ, GMC ప్రాంగణంలోని అంపీథియేటర్ ప్రారంభానికి డా. రాజా కరణం గారి పాత్ర ఎంతో ప్రముఖమని అన్నారు. బొంగడాల బీడు ప్రాంతంలో వైద్యరంగానికి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నో సేవా కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న డా. రాజా కరణం గారిని అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ఆయనను మంత్రి సత్కరించారు.
ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం ప్రశంసనీయం : ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లక్షలాది మందికి వైద్యసేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. పుట్టిన గడ్డపై ప్రేమతో ఎంతోమంది ఎన్నారైలు ఆసుపత్రి అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని, అందులో డా. రాజా కరణం గారి పాత్ర విశేషమని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో సుశ్రుత మహర్షి విగ్రహం ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉందని తెలిపారు.
దేశంలోనే రెండో విగ్రహం : డా. రాజా కరణం
సుశ్రుత మహర్షి విగ్రహం భారతదేశంలో రెండోది గుంటూరు మెడికల్ కాలేజీలో ప్రతిష్ఠించడం గర్వంగా ఉందని డా. రాజా కరణం అన్నారు. బిజీ షెడ్యూల్ మధ్య కూడా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేకంగా హాజరుకావడం విశేషమని చెప్పారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ యశస్వి రమణ, కార్పొరేటర్ పోతురాజు సమత, జింకన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
