Telugu Cinema | అదే.. వేటూరికి అర్పించే నివాళి..

Telugu Cinema | అదే.. వేటూరికి అర్పించే నివాళి..

Telugu Cinema, మోపిదేవి, ఆంధ్రప్రభ : తెలుగు భాష వ్రాయటం చదవటం తప్పనిసరిగా నేర్పటమే వేటూరికి అర్పించే నివాళి అని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో సుప్రసిద్ధ సినీ పాటల రచయిత స్వర్గీయ వేటూరి సుందర రామమూర్తి 90వ జయంతి వేడుకలు అమెరికా వేటూరి సాహిత్య అభిమాన సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

ముఖ్య అతిధిగా విచ్చేసిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. వేటూరి సినీయేతర సాహిత్య సంపుటాలను వారి స్వగ్రామంలో ఆవిష్కరించే అవకాశం కలగటం తన అదృష్టం అన్నారు. ఆరుద్ర అన్నట్లు తరానికొక్క గొప్ప కవి వేటూరి అని తెలిపారు. వేటూరి పాటల్లోని భావం, అర్ధం నేటి పాటల్లో లేదన్నారు. నేటి పాటల్లో మ్యూజిక్, సౌండ్ మినహా పాట అర్ధం కాదన్నారు. క్లాస్, మాస్ పాటలతో అన్ని వర్గాల వారిని వేటూరి అలరించారని తెలిపారు. నేటితరం పేరెంట్స్ ఇంగ్లీష్ భాష పై మక్కువతో పిల్లలను తెలుగు భాషకు దూరం చేయటం భావ్యం కాదన్నారు. అవసరం కోసం ఆంగ్లం నేర్చుకున్నా.. మాతృ భాష తప్పనిసరిగా నేర్పాలని పిలుపునిచ్చారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు భాషకు ప్రాచీన హోదా వేటూరి కృషితోనే సాధ్యమైందని తెలిపారు. మాతృ భాషను తిరస్కరిస్తే.. మాతృదేవీ తృణీకారం అవుతుందని వేటూరి విశ్వసించే వారని తెలిపారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం జాతీయ పురస్కారం తిప్పి పంపిన వేటూరి సుందర రామమూర్తి పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చిందని తెలిపారు. పీల్చే గాలి తెలుగు, తాగే నీరు తెలుగు, పలికే మాట తెలుగు, బ్రతికే బ్రతుకు తెలుగు అని గుర్తించి ప్రతి ఒక్కరూ గుర్తు ఉంచుకొని తెలుగు భాష పరిరక్షణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. నేటి తరం పిల్లలు తెలుగులో మాట్లాడాలి, తెలుగు నేర్చుకోవాలి అని సూచించారు.

మమ్మీ, డాడి అంటే గొప్ప కాదని, అమ్మ నాన్న అంటేనే గౌరవం ఉంటుందన్నారు. 1999లో పెద్దకళ్ళేపల్లిలో సంగీత సాహిత్య వసంతోత్సవాల నిర్వహణ బాధ్యత తన భుజస్కంథాల పై వేసిన నాటి నుంచి వేటూరితో మొదలైన ప్రయాణం.. వారితో సాన్నిహిత్యం, బాంధవ్యం వారు అందించిన బాంధవ్యం తనకు ఆశీస్సులు అన్నారు. తనను వేటూరి కుటుంబ సభ్యునిలా చూసుకున్నారని స్మరించుకున్నారు. పెద్ద కళ్ళేపల్లి గ్రామానికి ఒకవైపు దుర్గా నాగేశ్వర స్వామి, మరో వైపు వేటూరి సుందర రామమూర్తి ప్రఖ్యాతి తెచ్చారని తెలిపారు. తన అద్భుతమైన సినీ సంగీత సాహిత్యం ద్వారా వేటూరి సుందర రామమూర్తి ప్రజల హృదయాల్లో మహోన్నత వ్యక్తిగా నిలచి చిరంజీవి అయ్యారని తెలిపారు. తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం వేటూరి ఖ్యాతి అజరామరంగా నిలచి ఉంటుందన్నారు.

అమెరికా వేటూరి సాహిత్య అభిమాన వేదిక చైర్మన్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. వేటూరి సినీయేతర సాహిత్యాన్ని వారి స్వగ్రామం పెద్ద కళ్ళేపల్లికి అంకితం ఇవ్వడం తన అదృష్టం అన్నారు. వేటూరి సాహిత్యాన్ని సంపుటాలుగా ముద్రించే క్రమంలో వేటూరి కుమారుడు రవి వేటూరి కుమారుడు రవి ప్రకాష్, శిష్యుడు ఓరుగంటి ధర్మతేజ అందించిన సహకారం మరువలేనిదన్నారు. వందేళ్ళ సినీ చరిత్రలో పండిత కవిగా వేటూరి అందించిన సేవలు మరువలేనివి అన్నారు. సాహిత్యాన్ని ఔపోసన పట్టిన గొప్ప కవి వేటూరి అని తెలిపారు. వేటూరి పాటల్లో భక్తివేటూరి పాటల్లో భక్తి, ప్రబోధం, ప్రళయం, శృంగారం, అలంకారం ఇలా అన్ని రుచుల మేళవింపుగా వేటూరి పాటలు ఉంటాయన్నారు. అద్భుతమైన పద ప్రయోగంతో పాటను పరిపుష్టం చేసిన గొప్ప కవి వేటూరి అని తెలిపారు. సుప్రసిద్ధ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, ప్రముఖ సినీ గీత రచయిత తిపిర్నేని కళ్యాణ్ చక్రవర్తి, అమెరికా నుంచి ప్రముఖ సాహితీవేత్త జీడిగుంట విజయసారధి, విశిష్ట రచయిత ఎర్రాప్రగడ రామకృష్ణ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నుంచి గోళ్ళ నారాయణరావు విచ్చేసి ప్రసంగించారు.

వేటూరికి ఘననివాళి..
ముందుగా అతిధులు వేటూరి సుందరరామమూర్తి, వేటూరి ప్రభాకరశాస్త్రి, సుసర్ల దక్షిణామూర్తి, పింగళి వెంకయ్య విగ్రహాలకు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.

వేటూరి సాహిత్యానికి పల్లకీ సేవ..
ఈ సందర్భంగా వేటూరి రచించిన సినీయేతర సాహిత్యం మానస వీణా మధు గీతం, ఝమ్మంది నాదం, నవమి నాటి వెన్నెల, ఎడారిలో కోయిల, దొరకునా ఎటువంటి సేవ గ్రంధాలకు పెద్దకళ్లేపల్లి పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానంలో వేటూరి సాహిత్య గ్రంధాలకు స్వామి సన్నిధిలో ఉంచి పూజలు జరిపించారు. అనంతరం వేదిక పై ఆవిష్కరించి, పెదకళ్లేపల్లి గ్రామ ప్రజలకు అంకితం చేశారు.

వేటూరి సాహిత్యం అంకితం..
ఈ సందర్భంగా వేటూరి సాహితీ మహోత్సవం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యవేక్షణలో శోభాయమానంగా జరిగింది. అమెరికా వేటూరి సాహిత్య అభిమాన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఆరు సంపుటాల వేటూరి సినీయేతర సాహిత్యం అంకితోత్సవం ఘనంగా జరిగాయి. గాయకులు చెన్నై రాము, తెనాలి షాయద్, విజయవాడ జై ప్రభు, తెనాలి మల్లిక, ఒంగోలు శైలజ అద్భుతమైన వేటూరి పాటలు ఆలపించి స్వగ్రామ ప్రజలను పరవశింపచేశారు.

డిప్యూటీ కమిషనరుకు సత్కారం..
వేటూరి సాహితీ ఉత్సవానికి సహకరించిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, తోటకూర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. అతిధులను తోటకూర ప్రసాద్ సత్కరించి వేటూరి సాహిత్య సంపుటాలను బహుకరించారు.

ప్రతి లైబ్రరీకి వేటూరి సాహిత్యం..
రాష్ట్రంలోని ప్రతి లైబ్రరీకి వేటూరి సాహిత్య సంపుటాలను అందచేస్తామని తోటకూర ప్రసాద్ తెలిపారు. ముందుగా పెదకళ్లేపల్లి లైబ్రరీకి గ్రామ సర్పంచ్ అరజా సంధ్యారాణి చేతులమీదుగా వేటూరి సాహిత్య సంపుటాలను బహుకరించారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరజా సంధ్యారాణి, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరనాధ్, ఎంపీడీఓ జంగం స్వర్ణభారతి, ఇంచార్జి ఎంపీపీ నడకుదుటి జనని కుమారి, టీడీపీ మండల అధ్యక్షులు నడకుదుటి జనార్ధనరావు, వైస్ ఎంపీపీ కడవకొల్లు సీతా రామాంజనేయులు, భావదేవరపల్లి సర్పంచ్ మండలి ఉదయ భాస్కర్, ఎంపీటీసీ అరజా ఆశాదేవి, పీఏసీఎస్ చైర్మన్లు పూషడపు రత్నగోపాల్, అరజా రాధిక, గ్రామ ప్రముఖులు అరజా కిరణ్ కాంత్, ఏఎంసీ డైరెక్టర్ మెరకనపల్లి నరేష్, టీడీపీ, జనసేన గ్రామ అధ్యక్షులు అరజా వేణుగోపాల్, కేతరాజు శ్రీనివాసరావు, నీటి సంఘ అధ్యక్షులు గొర్రెపాటి దుర్గా నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొర్రెపాటి రమేష్ చంద్రబాబు, నాయకులు తోట కృష్ణాంజనేయులు, గోళ్ళ శ్రీనివాసరావు, బాదర్ల లోలాక్షుడు, మాజీ ఎంపీటీసీ అర్జా సాంబశివరావు, చోడగం రాధాకృష్ణ, కోసూరు చింతామణి, గంధం కృష్ణయ్య, కాలారి రామారావు, నియోజకవర్గ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply