Temple | కాలం మరిచిన ఆలయానికి మళ్లీ కళ…

Temple | కాలం మరిచిన ఆలయానికి మళ్లీ కళ…
Temple | రాయపోల్, ఆంధ్రప్రభ : దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లి గ్రామ శివారులో పంట పొలాల మధ్య ఉన్న 13వ శతాబ్దం నాటి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం మళ్లీ కళను సంతరించుకుంది. ఒకప్పుడు నిత్య పూజలతో సందడిగా ఉండిన ఈ ప్రాచీన ఆలయం, కాలక్రమేణా చెట్ల పొదలు, పిచ్చి మొక్కల మధ్య కనుమరుగైపోయింది. గ్రామానికి చెందిన ఓ పూజారి 2006 వరకూ ఆలయంలో పూజలు నిర్వహించగా, అతడు మరణించడంతో దేవాలయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.
ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలుగా ఎవరి చూపు లేకుండా మూలకు పడిన ఈ ఆలయం, కాలం మరిచిన చరిత్రగా మారింది. అయితే ఇటీవల గ్రామ యువత స్వచ్ఛందంగా ముందుకు రావడంతో పరిస్థితి మారింది. ఆలయం చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి, చెత్తను శుభ్రపరచి ఆలయ ప్రాంగణానికి మళ్లీ రూపు తీసుకొచ్చారు.

గర్భగుడి, రాతి నిర్మాణాలు వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు మళ్లీ భక్తుల రాక కోసం ఎదురుచూస్తోంది. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని పరిరక్షించి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు, యువత సంబంధిత అధికారులను కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లభిస్తే ఈ ఆలయం మరోసారి గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందనే ఆశ వ్యక్తమవుతోంది.
