Nalgonda | విహారయాత్ర పేరుతో….

Nalgonda | విహారయాత్ర పేరుతో….
- 8 మంది ఉపాధ్యాయుల్లో 7గురు ఉపాధ్యాయులు విహారయాత్రకు
- కాంట్రాక్టు టీచర్‌కు పాఠశాల అప్పగింత
Nalgonda | ఉమ్మడి నల్లగొండ, ఆంధ్రప్రభ : విహారయాత్రల పేరుతో పాఠశాల విద్యార్థులతో ఏడుగురు ఉపాధ్యాయులు పాఠశాలకు డుమ్మా కొట్టడంతో కాంట్రాక్టు టీచర్, సీఆర్పీలు నామమాత్రంగా పాఠశాలను తెరిచి ఉంచిన ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు ఉన్నత పాఠశాలలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తీదేడు పాఠశాలలో మొత్తం 96 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 40 మందికి పైగా విద్యార్థులతో 26 జనవరి నాడు ఏడుగురు ఉపాధ్యాయులు విహారయాత్రకు వెళ్లారు.
నిబంధనల ప్రకారం 100 కిలోమీటర్ల లోపు దూరం లో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులు ఒక్కో విద్యార్థి నుండి 4 వేల రూపాయలను వసూలు చేసి అరకు, తిరుపతి, బోర్ర గుహలు, అన్నవరం, సింహాచలం తదితర దూర ప్రాంతాలకు విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళ్లారు. పాఠశాలలో మొత్తం తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉండగా వీరిలో ఒకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు.

మిగిలిన 8 మంది ఉపాధ్యాయులలో ఏడుగురు ఉపాధ్యాయులు (హెడ్మాస్టర్ తో సహా) విహారయాత్రకు వెళ్లారు. పాఠశాలలో ఉన్న బయోసైన్స్ టీచర్ కి పాఠశాల బాధ్యతలను అప్పగించి వెళ్ళగా ఆ ఉపాధ్యాయుడు కూడా సెలవు పెట్టి వెళ్లడంతో పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి క్రాఫ్ట్ టీచర్ తో పాటు సిఆర్పి నామమాత్రంగా పాఠశాలను తెరిచి నడుపుతున్నారు.
పాఠశాలకు వస్తున్న 25 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా తూతూ మంత్రంగా పాఠశాలను తెరిచి ఉంచుతున్నారు. మిగిలిన ఒకే ఒక్క టీచర్ పాఠశాలకు రాకుండా సెలవు పెడితే ఆయనకు సెలవు ఎలా మంజూరు చేశారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆయన సెలవు చీటీని ఎవరికి అందించారు, ఆయనకు సెలవును ఎవరు మంజూరు చేశారు అన్నది విచారణలో తేడాల్సి ఉంది.
డిఇఓ నుండి అనుమతి తీసుకోలేదు.
విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్తే కచ్చితంగా సదరు పాఠశాల ఉపాధ్యాయుడు డిఇఓ నుండి అనుమతి తీసుకోవాలి. కానీ తీదేడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాల విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళుతున్నట్లు ఎలాంటి అనుమతి తీసుకోలేదని సమాచారం. ఒకవేళ డిఇఓ అనుమతి ఇచ్చినట్లయితే ఏడుగురు ఉపాధ్యాయులు విహారయాత్రకు వెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై పలుమార్లు డీఈవోతో వివరణ కోసం ప్రయత్నించగా ఆయన పూర్తి వివరాలు వెల్లడించలేదు.
డిఈఓకు ఫిర్యాదు అందజేత : ధరణి పతి రమణారావు.
విహారయాత్రల పేరుతో మూకుమ్మడిగా పాఠశాలకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తీదేడు గ్రామ మాజీ ఉపసర్పంచ్ ధరణి పతి రమణారావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈవో కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.
