AP | జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి నారీ శ‌క్తి కీల‌కం.. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : జిల్లాను అన్ని రంగాల్లో స‌మ‌గ్రాభివృద్ధి దిశ‌గా న‌డిపించే టీం ఎన్‌టీఆర్‌లో నారీశ‌క్తి కీల‌క‌మ‌ని.. పేద‌రిక నిర్మూల‌న‌లోనూ మ‌హిళ‌ల పాత్ర చాలా ముఖ్య‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.జి.ల‌క్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం న‌గ‌రంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సుమారు రెండువేల మందితో పోలీస్ క‌మిష‌న‌రేట్ ఆధ్వ‌ర్యంలో 3కే రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ, పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, డీసీపీలు గౌతమిషాలి, కేజీవీ స‌రిత‌, తిరుమలేశ్వరరెడ్డి, ఏబీటీఎస్ ఉదయరాణి, కృష్ణమూర్తి నాయుడు, వివిధ శాఖ‌ల అధికారులు, క‌ళాశాల‌ల విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థుల డప్పు కళా ప్రదర్శన, చిన్నారుల స్కేటింగ్, మహిళా పోలీస్ (డ్రోన్ పైలెట్స్) డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ… రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క స్వ‌ర్ణాంధ్ర @ 2047 విజ‌న్ డాక్యుమెంట్ ల‌క్ష్యాల సాకారానికి మ‌హిళ‌ల పాత్ర చాలా ముఖ్యమ‌న్నారు. ప‌బ్లిక్‌, ప్రైవేటు, పీపుల్ పార్ట‌న‌ర్‌షిప్ (పీ4) ద్వారా పేద‌రిక నిర్మూల‌నకూ మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం కీల‌క‌మ‌న్నారు. ప్ర‌తి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త ఉండాల‌నేది ముఖ్య‌మంత్రి నినాద‌మ‌ని.. ఆ పారిశ్రామిక‌వేత్త మ‌హిళే కావాల‌ని పేర్కొన్నారు.

పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు మాట్లాడుతూ… మహిళా శక్తి ఎంత గొప్పగా ముందుకు వెళ్తుంద‌నే దానికి గ‌త వారం రోజులుగా జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో వారం రోజులుగా పండ‌గ‌లా మహిళా దినోత్స‌వ వేడుక‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. సమాజాభివృద్ధిలో మ‌హిళ‌ల పాత్ర ఔన్న‌త్యాన్ని గుర్తించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పథంలో నడిపిస్తూ గౌర‌వం క‌ల్పించాల‌నే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ముఖ్యంగా పోలీస్ శాఖ మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు నిరంతరం కృషి చేస్తోంద‌ని.. ముఖ్యమంత్రి శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్‌ను కూడా ఆవిష్క‌రించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.

డీసీపీ గౌత‌మి షాలి మాట్లాడుతూ… ప్ర‌స్తుతం చ‌దువు, ఉద్యోగం.. ఇలా ఎందులోనైనా అంద‌రూ స‌మాన‌మేన‌ని, ప్రతిఒక్కరూ ఎదుటివారితో గౌరవంగా మెలగాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. మహిళలు విద్య‌తో పాటు పెయింటింగ్‌, రీడింగ్ వంటి మంచి అల‌వాట్ల‌కు కూడా చేరువ కావాల‌న్నారు. డీసీపీ కేజీవీ సరిత మాట్లాడుతూ… 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నినాదంగా లింగ స‌మాన‌త్వం కోసం వేగ‌వంత‌మైన కార్యాచ‌ర‌ణ ఉంద‌ని, ఇందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. భ‌ద్ర‌మైన వాతావ‌ర‌ణం ల‌క్ష్యంగా పోలీస్ క‌మిష‌న‌రేట్ భిన్న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా స్టేడియం నుంచి క‌లెక్ట‌ర్ డా.జి.ల‌క్ష్మీశ‌, పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు.. అధికారుల‌తో క‌లిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుండి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లి బెంజ్ సర్కిల్ వద్ద మహిళా పోలీసుల డ్రోన్ షోను తిల‌కించ‌డం జ‌రిగింది. డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, డీఎంహెచ్‌వో డా.ఎం.సుహాసిని, వివిధ శాఖ‌ల అధికారులు, మ‌హిళ‌లు, విద్యార్థినులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *