MLA | కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి

MLA | కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
  • ఎంపీ, అధికారులతో కలసి వివిధ ప్రాంతాల పరిశీలన.

MLA | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అతి సమీపంలో ఉన్న కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఏరియాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేసున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), పర్యాటక, అటవీ, పురావస్తు శాఖల అధికారులతో కలసి ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడులో అటవీశాఖ నగరవనాన్ని, పురావస్తు శాఖ పరిధిలోని కొండపల్లి ఖిల్లాను, ఇబ్రహీంపట్నంలో కృష్ణా గోదావరి నదుల కలయిక అయిన పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మంగళవారం పరిశీలించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ అటవీ పర్యాటకానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మందిని ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.

MLA

విజయవాడ నగరానికి, రాజధాని అమరావతికి దగ్గరగా ఉండడంతో దీని అభివృద్ధి కీలకంగా మారిందన్నారు. పశ్చిమ బైపాస్‌ అందుబాటులోకి రావడంతో అమరావతి నుంచి కూడా ఎక్కువ మంది సందర్శించే అవకాశం ఉందన్నారు. మూలపాడు నుంచి అమరావతికి ఐకానిక్‌ వంతెన నిర్మాణంతో దీనికి మరింత ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. బటర్ ఫ్లై పార్కులో పచ్చని చెట్ల నడుమ, పక్షుల సంచారంతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జిప్ లైన్, ట్రెక్కింగ్ తో ప్రజలు ఇక్కడికి వచ్చి మంచి అనుభూతిని పొందుతున్నారని అన్నారు. అలాగే పిల్లలు ఆడుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారన్నారు.

త్వరలోనే జంగిల్ సఫారీ, బర్డ్‌ వరల్డ్‌, మరిన్ని ట్రెక్కింగ్ పాయింట్స్‌ అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇక్కడ దాదాపు 300 హెక్టార్లలో అటవీశాఖ భూమి ఉందన్నారు. ఇందులో జూ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు వెల్లడించారు. కొండపల్లి ఖిల్లాపై ఉన్న కోటలో చారిత్రక విశేషాలు మాత్రం ఇప్పటికీ పదిలంగా ఉన్నాయన్నారు. అలనాటి ప్రాభవం కళ్లముందు కదలాడుతూనే ఉందన్నారు. తెలుగునాట పేరొందిన చారిత్రక పర్యాటక ప్రాంతాల్లో కొండపల్లి కోట ముందువరుసలో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొండపల్లి ఖిల్లా పూర్తిగా శిథిలావస్థకు చేరగా కూటమి ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి పైగా శ్రమించి కొండపల్లి కోటకు మరమ్మతులు చేసి మళ్లీ ప్రాణం పోశారన్నారు.

హైదరాబాద్‌ గోల్కొండ తరహాలో కోట గోడలపై లేజర్‌ షో, త్రీడీ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ ను పునరుద్ధరణ చేసున్నట్లు పేర్కొన్నారు. రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే పర్యాటకంగా కొండపల్లి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఆదిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. కొండపల్లి నుంచి కాలిబాట అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు. కృష్ణ, గోదావరి నదులు సంగమించే ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి ఎగువ ప్రాంతమైన ‘పవిత్ర సంగమం’ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. గత కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఇక్కడ రివర్‌ ఫ్రంట్‌ ఘాట్లను నిర్మించారన్నారు. అప్పట్లో ఇక్కడ కృష్ణా హారతులు చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చేవారన్నారు.

పర్యాటకుల కోసం బోటింగ్‌ పాయింట్‌ను ఏర్పాటు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి విధ్వంసంతో పాటే పవిత్ర సంగమాన్ని కూడా నిర్వీర్యం చేశారన్నారు. దీనికి కూడా పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధికి విజన్ 2047 డాక్యుమెంట్లో కూడా ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఈ విషయాలు అన్నింటినీ సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), మైలవరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల), వివిధ శాఖల అధికారులు, కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply