Parliament | టీడీపీ బలం, బలగం కార్యకర్తలే….

Parliament | టీడీపీ బలం, బలగం కార్యకర్తలే….

  • టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్
  • గ్రామ స్థాయి కార్యకర్త పొలిట్‌బ్యూరో వరకు ఎదగాలని ఆకాంక్ష
  • పార్టీ పదవులకు టర్మ్ లిమిట్ ఉండాలని ప్రతిపాదన
  • పెన్షన్లకే ఏటా రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి

Parliament | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నూతనంగా నియమితులైన 25 పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు రావాలని, గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షుడు పొలిట్‌బ్యూరో స్థాయి వరకు ఎదిగేలా సంస్కరణలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అని, వారి త్యాగాల పునాదులపైనే తెలుగుదేశం పార్టీ నిలబడి ఉందని స్పష్టం చేశారు.

దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలమైన కార్యకర్తల వ్యవస్థ ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతమని లోకేశ్ అన్నారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే టీడీపీ అని లోకేశ్ గుర్తుచేశారు. 1983లోనే రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు వంటివి ఎన్టీఆర్ తెచ్చారన్నారు.

చంద్రబాబు ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని లోకేశ్ తెలిపారు. 1995లో ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారని, కానీ నేడు సైబరాబాద్ వల్లే లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని లోకేశ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకు రూ.6 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. ఒక్క పెన్షన్లకే ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని లోకేశ్ సూచించారు. పార్టీలో అంతర్గత సంస్కరణల ఆవశ్యకతను లోకేశ్ నొక్కిచెప్పారు. పార్టీలో ప్రతి పదవికి టర్మ్ లిమిట్ ఉండాలన్నారు. మహానాడులో తీర్మానించిన ఆరు శాసనాలను పార్టీ నాయకులు తప్పనిసరిగా పాటించాలని లోకేశ్ ఆదేశించారు. కార్యకర్తలకే పెద్దపీట వేయాలని, యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించాలని, సామాజిక న్యాయం పాటించాలని, మహిళలను గౌరవించాలని సూచించారు.

Leave a Reply