Camp Office | పోలీసులకు ఎమ్మెల్యే అభినందన

Camp Office | పోలీసులకు ఎమ్మెల్యే అభినందన
Camp Office | అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఈనెల 24వ తేదీన అచ్చంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో పట్టుబడిన నక్సలైట్లను సమర్థవంతంగా అదుపులోకి తీసుకున్న అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు, ఎస్‌ఐ సద్దాం హుస్సేన్ లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ క్యాంప్ కార్యాలయంలో అభినందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ…అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల ప్రాంతంలో ఎటువంటి సంఘవిద్రోహ, అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని స్పష్టం చేశారు.
ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చంపేట ప్రాంతంలో నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ, ఎక్కడైనా అసాంఘిక చర్యలు చోటుచేసుకుంటే వెంటనే స్పందిస్తోందన్నారు. నల్లమల్ల ప్రాంతంలో దోపిడీలు, దౌర్జన్యాలు, సంఘవిద్రోహ కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న అచ్చంపేటను ఎవ్వరూ అశాంతికి గురి చేయొద్దని ఆయన సూచించారు. ఈ విషయంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు.
