Srikakulam | రాజ్యాంగం హక్కులను నిలబెట్టాలి

Srikakulam | రాజ్యాంగం హక్కులను నిలబెట్టాలి
- దేశం విశ్వ గురువుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది
- ఢిల్లీ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రామ్మోహన్ నాయుడు
Srikakulam | శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ బ్యూరో) : భారతదేశ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం న్యూ ఢిల్లీ లోని తన నివాసంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్ జవాన్ల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
మన రాజ్యాంగం అమలులోకి వచ్చి.. భారత ప్రజాస్వామ్య బలాన్ని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్మరింపజేసే ముఖ్యమైన రోజు ఇది అని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ నేపధ్యంలో దేశ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న సైనిక బలగాలు, భద్రతా దళాలు, సాంకేతిక రంగం, వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల్లో కష్టపడుతున్న ప్రతి ఒక్క భారతీయునికి కృతజ్ఞతలు తెలియజేశారు.
పౌర విమానయాన రంగం దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి, దేశాన్ని ప్రపంచంతో అనుసంధానించడానికి కీలకమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. విమానయాన రంగాన్ని మరింత ప్రజాహితంగా, అందరికీ అందుబాటులో ఉండేలా, సురక్షితంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం కొత్త దశలోకి అడుగుపెడుతోందని.. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ, వికసిస్తూ, విశ్వగురువుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడు తన తన బాధ్యతను గుర్తించి, రాజ్యాంగం అందించిన హక్కులతో పాటు కర్తవ్యాలను కూడా నిలబెట్టేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
