Air pollution | ముప్పు నుంచి విముక్తి

  • కాలుష్య కోరల నుంచి బ‌య‌ట‌ప‌డిన ఢిల్లీ వాసులు
  • ఢిల్లీలో భారీగా తగ్గిన ఏక్యూఐ

Air pollution | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : దేశ రాజధాని ఢిల్లీ అన‌గానే మొద‌టగా గుర్తొచ్చేది అక్క‌డి కాలుష్య‌మే. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న ఢిల్లీ ప్ర‌జ‌లు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. స్వ‌చ్ఛ‌మైన గాలి కోసం త‌ల్ల‌డిల్లిన ఆ ప్రాంత ప్ర‌జ‌లు చాలా రోజుల త‌ర్వాత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్ని రోజులు ముక్కులు మూసుకొని ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌జ‌లు.. ఇప్పుడిప్పుడే హాయిగా గాలిని పీల్చుకుంటున్నారు. ముక్కుకు మాస్కులు వేసుకోకుండా బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఉంచి బ‌య‌ట ప‌డ్డారు. గాలి కాలుష్యంతో చాలామంది ఆస్ప‌త్రుల పాల‌య్యారు. చలికాలం ప్రారంభం నుండి ఢిల్లీ వాసులు ఊపిరితిత్తుల వ్యాధులు, కళ్ల మంటలు, అలర్జీలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. గత మూడు నెలలుగా ఢిల్లీలో దట్టమైన పొగమంచు, కాలుష్యం వల్ల విజబులిటి గణనీయంగా పడిపోయింది. వాహనదారులు పట్టపగలే లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆకాశం క్లియర్ కావడంతో విజబులిటి బులిటి స్పష్టంగా కనిపిస్తోంది. భవనాలు, రోడ్లు స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రయాణాలకు ఆటంకాలు తొలగిపోయాయి. ముఖ్యంగా విమాన, రైలు సర్వీసుల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గాయి.

గత మూడున్నర నెలలుగా కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయిన దేశ రాజధాని ఢిల్లీకి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. నగరంలో అకస్మాత్తుగా కురిసిన వర్షాలు, పెరిగిన గాలి వేగం కారణంగా వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్య కారకాలు కొట్టుకుపోయాయి. దీనివల్ల నగరవాసులకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం ల‌భించింది. ప్రకృతి సహకారంతో కాలుష్య దుప్పటి తొలగిపోవడంతో హస్తిన వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, తాజా వర్షాలు ఇచ్చినంత ఫలితాన్ని ఏవీ ఇవ్వలేకపోయాయి. ఇప్పుడు గాలి నాణ్యత మెరుగుపడటంతో పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో మళ్ళీ సందడి కనిపిస్తోంది.

ఈ వారంలోనే ఒకానొక దశలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అత్యంత ప్రమాదకరమైన 440 పాయింట్లకు చేరుకుని ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ప్రస్తుతం సగటు AQI 150 పాయింట్లకు పడిపోయింది. కాలుష్య స్థాయి ‘తీవ్రం’ నుండి ‘మధ్యస్థం’ కేటగిరీకి మారడం గత వంద రోజుల్లో ఇదే మొదటిసారి. ఇది పర్యావరణపరంగా, ప్రజారోగ్య పరంగా ఒక శుభపరిణామం.

రాబోయే రోజుల్లో గాలి వేగం తగ్గితే మళ్ళీ కాలుష్యం పెరిగే అవకాశం ఉంద‌ని పర్యావరణ నిపుణులు అంటున్నారు. కాబట్టి, వాహనాల కాలుష్యం తగ్గించడం, నిర్మాణ పనుల విషయంలో నిబంధనలు పాటించడం వంటి చర్యలు కొనసాగించాల్సి ఉంది. ఏది ఏమైనా, మూడు నెలల తర్వాత ఢిల్లీ ఆకాశం నీలంగా మారడం నగరవాసులకు ఒక పెద్ద ఊరట.

Leave a Reply