Pakisthan | దిగొచ్చిన పీసీబీ

దిగొచ్చిన పీసీబీ
- టీ20 ప్రపంచకప్‌కు జట్టు ప్రకటన
- సల్మాన్ అలీ అఘా సారథ్యంలో బరిలోకి దిగనున్న పాకిస్థాన్
- జట్టులోకి తిరిగి వచ్చిన బాబర్ ఆజం, షహీన్ అఫ్రిది
- పేసర్ హరీస్ రవూఫ్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లపై వేటు
Pakisthan | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఐసీసీ దెబ్బకు పాక్ దెబ్బకు దిగొచ్చింది. వరల్డ్ కప్ ఆడకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పాక్ వెంటనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం జట్టును ప్రకటించింది. ఇవాళ 15 మంది సభ్యులతో కూడిన జట్టును అధికారికంగా ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా సారథ్యంలో పాక్ జట్టు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీని బహిష్కరిస్తుందన్న ఊహాగానాలకు తెరపడింది.

ఇటీవల బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకోవడంతో, ఆ దేశానికి మద్దతుగా పాకిస్థాన్ కూడా అదే బాటలో పయనిస్తుందని ప్రచారం జరిగింది. అయితే, టోర్నీ నుంచి వైదొలిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పీసీబీ వారి జట్టును ప్రకటించింది. ఆకిబ్ జావెద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ఆధ్వర్యంలో సమతూకంతో కూడిన, దూకుడైన జట్టును ఎంపిక చేసింది.
బాబర్, షహీన్‌లకు చోటు
స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షహీన్ షా అఫ్రిది తిరిగి జట్టులోకి వచ్చారు. ఇటీవలి టీ20 సిరీస్‌లకు దూరమైన ఈ ఇద్దరు సీనియర్లు జట్టుకు ఎంతో స్థిరత్వాన్ని తీసుకువస్తారని భావిస్తున్నారు. బాబర్ రాకతో బ్యాటింగ్ లైనప్ బలోపేతం కానుండగా, షహీన్, నసీమ్ షా పేస్ దళాన్ని ముందుండి నడిపించనున్నారు. అయితే, స్టార్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్‌పై సెలక్టర్లు వేటు వేశారు. 2025 ఆసియా కప్‌లో ఫామ్ కోల్పోవడం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడిని పక్కనపెట్టినట్లు తెలిసింది. అలాగే, సీనియర్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు కూడా జట్టులో చోటు దక్కలేదు.
పాకిస్థాన్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ తారిఖ్.
