Yadagirigutta | నర్సన్న మురిపెం! యాదగిరిగుట్టకు స్వయం ప్రతిపత్తి

ఇకపై టీటీటీ తరహాలో ట్రస్ట్ బోర్డు
ఉగ్ర నారసింహుడికి సరికొత్త వైభవం
ఐఏఎస్​ అధికారికి ఈవోగా బాధ్యతలు
దేవాదాయ కమిషనర్​ నియంత్రణకు చెల్లు
బోర్డుకు చైర్మన్​తో పాటు 10 మంది సభ్యులు
కేబినెట్​కు నోట్​ రూపంలో అందించిన అధికారులు
మూడు రోజులపాటు సంబురంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
లక్ష్మీ సమేతంగా ఊరేగుతున్న ఉగ్రనారసింహుడు
స్వామివారిని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానముల తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ట్రస్ట్‌ బోర్టు ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ మంత్రి మండలి ఆమోదించింది. యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి రానుండడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేవాదాయశాఖ కమిషనర్ నియంత్రణ అనేది ఇకపై ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దేవాలయం ఉండనుంది. యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్‌బోర్డు, పదవీ కాలం, ఉద్యోగ నియామకాలు, నిధులు, బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్‌, ఈఓగా ఏ స్థాయి అధికారి ఉండాలనే వివరాలను కేబినెట్‌కు నోట్‌ రూపంలో అందించారు. దేవాదాయ శాఖ -1987లోని చాప్టర్‌ 14 కింద యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని చేర్చినట్లు తెలిసింది.

అన్ని వివరాలతో కేబినెట్​ నోట్​ రెడీ..

ఈ మేరకు అసెంబ్లీలో చట్ట సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈవోగా ఐఏఎస్‌ అధికారి కానీ, లేకుంటే అదనపు కమిషనర్, ఆపై స్థాయి అధికారిని నియమించాలని కేబినెట్‌కు సమర్పించిన నోట్‌లో పేర్కొన్నారు. ఈ బోర్డుకు చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులను నియమిస్తారు. ఇందులో ఒకరు ఫౌండర్‌ ట్రస్టీగా కాగా మిగిలిన 9 మందిని ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది.

బోర్డులో మెంబర్లుగా వీరు కూడా..

ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా బోర్డులో ఉంటారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆలయ ఈఓ, వైటీడీఏ వీసీ, ఆలయ స్థానాచార్యులు జాబితాలో ఉంటారు. అదే విధంగా ప్రత్యేక ఆహ్వానితులు కూడా బోర్డులో ఉంటారు. బోర్డు పదవీకాలం మూడేళ్లు ఉండాలని కేబినెట్​ నోట్‌లో ప్రతిపాదించారు. వార్షికాదాయం ₹100 కోట్లు దాటే ఏ ఆలయాన్ని అయినా ఇదే తరహాలోకి తీసుకురావాలని ప్రతిపాదనలు చేశారు. కాగా, వేములవాడ దేవస్థానానికి కూడా ఇలాంటి ట్రస్ట్‌బోర్డు వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వవర్గాల అంటున్నాయి.

లక్ష్మీ సమేతంగా ఉగ్రనారసింహుడు..

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారిని సుందరంగా అలంకరించారు. తిరువీధుల్లో భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రధాన పూజారి వివరించారు. రాత్రివేళ ఉగ్ర నరసింహుడు లక్ష్మీసమేతంగా సింహ వాహనంపై ఆసీనులై మాడ వీధుల్లో ఊరేగారు. కాగా, ప్రత్యేక కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు పాల్గొన్నారు.

విశేష ఉత్సవాలు ప్రారంభం..

యాదగిరి లక్ష్మీ నర్సింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ్రోజుల పాటు కొనసాగే విశేష ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఎదుర్కోలు వేడుకతో మొదలవుతాయి. శనివారం రాత్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణం, ఆదివారం రాత్రి దివ్యవిమాన రథోత్సవం నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *