Chhattisgarh | 28 ఏళ్ల అజ్ఞాతానికి తెర…

Chhattisgarh | 28 ఏళ్ల అజ్ఞాతానికి తెర…
- లొంగిపోయిన మహిళా మావోయిస్ట్ పుష్ప
- ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల ఎదుట తొమ్మిది మంది కేడర్ లొంగుబాటు
- లొంగిపోయిన వారిలో బెల్లంపల్లికి చెందిన ఆవుల బాలమల్లు
- మొత్తం రూ. 47 లక్షల రివార్డు కలిగిన మావోయిస్టుల లొంగుబాటు
Chhattisgarh | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సుదీర్ఘ కాలం పాటు అజ్ఞాతంలో గడిపిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చందవెల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు కీలక నేత ఆవుల బాలమల్లు అలియాస్ పుష్ప (45) ఎట్టకేలకు ఆయుధాన్ని వీడారు. ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తారి జిల్లాలో శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన తొమ్మిది మంది మావోయిస్టులలో ఈమె కూడా ఉన్నట్లు రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా అధికారికంగా ప్రకటించారు.
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన బాలమల్లు, తన భర్త జాడి వెంకటి అలియాస్ సురేష్‌తో కలిసి 28 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో జాడి వెంకటి మృతి చెందిన విషయం విదితమే. ఆ సమయంలోనే “పుష్పా.. ఇంటికి వచ్చేయ్ బిడ్డా” అంటూ ఆమె తల్లి ఆవుల పోశమ్మ, సోదరులు మీడియా వేదికగా కన్నీటి విజ్ఞప్తి చేశారు.

భర్త ఎన్కౌంటర్ జరిగిన నాలుగు నెలల తర్వాత ఆమె ఆయుధాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావడంతో చంద్రవెల్లిలో ఆమె బందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీలక కేడర్‌తో కలిసి లొంగుబాటు ఛత్తీస్‌గఢ్ పోలీసుల సమాచారం ప్రకారం.. లొంగిపోయిన తొమ్మిది మందిలో ఏడుగురు మహిళా కేడర్లు ఉండగా, అందులో బాలమల్లు అత్యంత కీలకమైన వ్యక్తి.
వీరంతా ఒడిశా మావోయిస్టు కమిటీలోని ధమ్తారి-గరియాబంద్-నువాపాడ డివిజన్ పరిధిలోని నాగరి, సితానది ఏరియా కమిటీలు మరియు మెయిన్పూర్ లోకల్ గెరిల్లా స్క్వాడ్ కు చెందిన వారు. లొంగిపోయిన ఈ తొమ్మిది మందిపై ప్రభుత్వం మొత్తం రూ. 47 లక్షల రివార్డును ప్రకటించింది. ఇందులో ఒక్క బాలమల్లు (డీవీసీఎం హోదా) పైనే రూ. 8 లక్షల రివార్డు ఉండటం గమనార్హం.

CLICK HERE TO READ MORE : Protection | ప్రజల రక్షణ కోసం 24×7 పనిచేస్తాం
