Vikarabad | బాలిక దినోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ….

Vikarabad | బాలిక దినోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ….

Vikarabad |వికారాబాద్, ఆంధ్రప్రభ : జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ కొత్తగడి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్ & కాలేజీలో ఈ రోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడిన జిల్లా ఎస్పీ నేటి సమాజంలో బాలికలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతూ ముందంజలో ఉన్నారని, ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి, పట్టుదల ఎంతో అవసరమని పేర్కొన్నారు.“విద్య అనేది మీరు ధరించే అత్యంత శక్తివంతమైన ఆభరణం, ఆయుధం. అది మీ భవిష్యత్తును మార్చడమే కాకుండా సమాజంలో మీకు గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తుంది” అని ఆమె తెలిపారు. ప్రతి బాలిక తనకు తాను ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా అధిగమిస్తూ విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. బాలికలు తమపై తాము నమ్మకం పెంచుకోవాలని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలని సూచించారు.

అదేవిధంగా బాలికల రక్షణ, భద్రత అంశాలపై జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. అన్యాయం జరిగినప్పుడు భయపడి మౌనంగా ఉండటం నేరస్తులకు మరింత ధైర్యాన్ని ఇస్తుందని, కాబట్టి ప్రతి బాలిక తన గళాన్ని విప్పి ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతూ బాలికలు, మహిళల భద్రత కోసం పనిచేస్తున్నాయని తెలిపారు. ఎలాంటి ఆపదలో ఉన్నా లేదా వేధింపులకు గురైన సందర్భాల్లో సంకోచించకుండా వెంటనే 100 డయల్ చేయాలని లేదా షీ టీమ్ వాట్సాప్ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థినులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా షీ టీమ్ అధికారులు మరియు కళాజాత బృందం వారు తమ ఆటపాటలు, ప్రదర్శనల ద్వారా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, మహిళా భద్రతకు సంబంధించిన చట్టాలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలి అనే అంశాలపై విద్యార్థినులకు ఎంతో ఆకట్టుకునే విధంగా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సరోజా, AHTU ఇన్స్పెక్టర్ అన్వార్ పాషా, పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఎం.వి.ఎఫ్ ఫౌండేషన్ అధికారులు, జిల్లా షీ టీమ్ సిబ్బంది, కళాజాత బృందం అధికారులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply