Prakasham | కళ్లలో కారం కొట్టి.. కత్తితో పొడిచి..

Prakasham | కళ్లలో కారం కొట్టి.. కత్తితో పొడిచి..
- భర్తను దారుణంగా చంపిన భార్య
- వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
- తమ్ముడితో కలిసి భర్తను దారుణంగా చంపిన భార్య
- బాధితుడు అక్కడికక్కడే మృతి
Prakasham | ప్రకాశం, ఆంధ్రప్రభ : మాయమైపోతున్నడమ్మ..మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని ఓ కవి రాసినది నిజమని నిరూపిస్తుంది ఈ సమాజం. కారణాలు ఏమైనా కావచ్చు.. కొందరు మనుషులు మానవత్వం మరిచిపోయి దారుణాలకు ఒడికడుతున్నారు. కొందరు బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, అప్యాయతలు మరిచి పోయి ప్రాణాలను తీస్తున్నారు.
ప్రధానంగా వివాహేతర సంబంధాల కారణంగా మానవత్వం మంట కలిసిపోతోంది. ప్రియుడి మోజులో పడి కొందరు కట్టుకున్న భర్తనే కాటికి పంపుతున్నారు. కొన్ని నిమిషాల సుఖం కోసం నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దారవీడు మండల పరిధిలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా భర్తను తమ్ముడి సాయంతో కళ్లలో కారం కొట్టి ఓ భార్య హత్య చేసిందని డీఎస్పీ నాగరాజు తెలిపారు.
దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను(38)కు సున్నిపెంటకు చెందిన ఝాన్సీకి 17ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. లాలు శ్రీను లారీ డ్రైవర్గా పని చేస్తూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం గంజాయి విక్రయిస్తూ పట్టుబడి ఒంగోలు జైలులో రిమాండ్లో ఉన్నాడు. అప్పటికే నిందితురాలు ఝాన్సీకి తమ్ముడి స్నేహితుడు జమ్మిదోర్నాలకు చెందిన కారు డ్రైవర్ సూర్యనారాయణతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
రిమాండ్లో ఉన్న శ్రీనుని కలిసేందుకు వెళ్లిన భార్యను, ఆమె తమ్ముడిని బయటకు వచ్చి చంపేస్తానంటూ బెదిరించారు. ఈ నేపథ్యంలో తానే అతన్ని చంపాలని నిర్ణయించుకుని గుంటూరుకు చెందిన మరో నలుగురితో రూ. రెండు లక్షలు సుపారీ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు ఝాన్సీ.
ఒంగోలు నుంచి బెయిల్పై వస్తున్న క్రమంలో ముందుగా అనుకున్న ప్రకారం చీమకుర్తి వద్దగానీ, పొదిలి వద్దగానీ చంపాలనుకుంటే కుదరలేదు. చివరకు పెద్దారవీడు అంకాలమ్మ గుడి సమీపంలో మూత్ర విసర్జనకు కారు ఆపాలని కోరారు.
కారులో భార్య ఝాన్సీ, ఆమె తమ్ముడు పథకం ప్రకారం వేచి ఉండగా వెనుక బండిపై వచ్చిన సూర్యనారాయణ, అతని స్నేహితులు మృతుడి కళ్లలో కారం కొట్టగా, కారులో వెంటతెచ్చుకున్న కత్తితో భార్య, ఆమె తమ్ముడు పొడిచారు. దీంతో లాలుశ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు.
