Medaram | సమన్వయంతో సమిష్టిగా సక్సెస్ చేద్దాం

Medaram | సమన్వయంతో సమిష్టిగా సక్సెస్ చేద్దాం
- జనజాతరను సంఘటితంగా విజయవంతం చేద్దాం
- గతంలో సమస్యలు సృష్టించిన
- వారిని డ్యూటీలోకి తీసుకోవద్దు
- మేడారం వెళ్ళే దారిలో బస్సులను నిలుపొద్దు
- బస్సులు చెడిపోతే వెంటనే మరమ్మత్తులు చేయాలి
- డ్రైవర్లు మద్యం మత్తులో ఉండకుండా చూడండి
- ట్రాఫిక్ జామ్ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలి
- వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
Medaram | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : ప్రతి రెండేళ్లకోకసారి జరిగే మేడారం మహా జాతరను సక్సెస్ చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా జన జాతరకు తరలివచ్చే భక్తులను సకాలంలో సురక్షితంగా గమ్యస్థానం చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. గత మేడారం మహా జాతరలో తలెత్తిన సమస్యలను, ఇబ్బందులను గుర్తించి, ఆ పొరబాట్లు ఈ మారు జరుగకుండా ఉండేందుకు కుస్తీలు పడుతున్నారు.
ప్రతి మేడారం శ్రీ సమ్మక్క,సారాలమ్మ జాతరకు జనాన్ని తరలించే ఆర్టీసీ బస్సుల రాకపోకలను క్రమబద్ధీకరించే పనిలో పోలీసులు,ఆర్టీసీ అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. గత జాతరల అనుభవాలను,పొరబాట్లు, తప్పిదాలపై కూలంకషంగా చర్చించారు. మేడారం జాతరలో ప్రధాన పాత్రను పోషించే ఆర్టీసీ అధికారులకు పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ మార్గ నిర్ధేశ్యం చేశారు.
ఆర్టీసీ,పోలీసుల జాయింట్ మీటింగ్

మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పోలీస్, ఆర్టీసీ అధికారులతో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సమావేశంలో ముందుగా గత జాతర సందర్బంగా తలెత్తిన ట్రాఫిక్ సమస్యలు,ప్రాంతాలు, కారణాల తో పాటు, పోలీస్,ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్బంగా మేడారం జాతరలో ఆర్టీసీ శాఖ చేసిన ఏర్పాట్లపై ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ భాను,పోలీస్ కమిషనర్, పోలీస్ ఆఫీసర్స్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మేడారం తరలి వస్తున్న భక్తుల రద్దీని గమనిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. మేడారంకు వెళ్లే మార్గంలో ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ బస్సులను నిలిపి, ప్రయాణికులకు టికెట్లు జారీ చేయద్దని సూచించారు.
గతంలో సమస్యలు సృష్టించిన డ్రైవర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లోకి తీసుకోవద్దని తెగేసి చెప్పారు. విధి నిర్వహణలో ఉండే డ్రైవర్లు మద్యం మత్తులో ఉండి, బస్సులు నడుపకుండా చూసుకొనేందుకై తప్పనిసరిగా డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని సూచించారు.ఏదో కారణాలతో ఒక వేళ బస్సులు బ్రేక్ డౌన్ అయితే రోడ్డుపై నిలిచిన పోయిన బస్ లను తక్షణమే మరమ్మత్తు చేసే విధంగా మెకానిక్ లను అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.
మేడారం జాతర వెళ్లే దారిలో మెకానిక్ క్యాంప్ లను ఏర్పాటు చేయాలన్నారు. బస్సులను రోడ్ల ఇరువైపుల నిలుపకుండా చర్యలు తీసుకోవాలన్నారు.బస్టాండ్ నుండి బయలుదేరే బస్సులు ఎక్కడ అగకుండా మేడారం బస్టాండ్ లో మాత్రమే బస్సులు ఆపాలని డ్రైవర్లకు ఆదేశాలివ్వాలని పురామయించారు.జాతరకు తరలివచ్చే భక్తులు కాలకృత్యాలు తీర్చుకొవడానికో, వెంట ఉన్నతినుబండారాలు తినేందుకో ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులు నిలుపొద్దన్నారు.
బస్టాండ్ లోనే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొనే బయలుదేరే విధంగా ఆర్టీసీ అధికారులు విస్తృతం ప్రచారం చేయాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని బాల సముద్రం నుండి జాతరకు వెళ్లే బస్సులకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా నగరంలో ఏదైనా ట్రాఫిక్ అంతరాయం కలిగితే జాతరకు వెళ్లే బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల నుండి తరలించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ట్రాఫిక్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దార కవిత, ఆర్టీసీ, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ఏసీపీలు సత్యనారాయణ, జితేందర్ రెడ్డి, జానీ నర్సింహులు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్.యం భాను కిరణ్, మహేష్, డిపో మేనేజర్లు రవి చందర్, అర్పిత, ధరమ్ సింగ్, ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్లు సీతా రెడ్డి, పిట్టల వెంకన్న, కోడూరు సుజాత ఇతర పోలీస్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
