District SP | ముగ్గురు పోలీసుల సస్పెన్షన్

District SP | ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
- ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ
District SP | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ శాఖలో క్రమశిక్షణ లోపాలకు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడింది.
తనకల్లు పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదన్న ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఇక పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు పైనా ఎస్పీ వేటు పడింది. ఆయనపై అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో అంతర్గత విచారణ నిర్వహించారు. విచారణలో పలు అవకతవకలు వెలుగులోకి రావడంతో సీఐపై కూడా కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, బాధ్యత చాలా ముఖ్యమని, ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులు తప్పుదారి పడ్తే ఎలాంటి ఉపేక్ష ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.
