Vijayawada | కేశఖండన శాల ఆకస్మిక తనిఖీ..

Vijayawada | కేశఖండన శాల ఆకస్మిక తనిఖీ..
- భక్తుల సౌకర్యాలపై దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వరు బుల్లిబాబు ఆరా
Vijayawada | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కేశఖండన శాలను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వరు బుల్లిబాబు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు జారీ చేస్తున్న టిక్కెట్ల విధానం, కేశఖండన శాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు.

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చిన భక్తులతో అవ్వరు బుల్లిబాబు మాట్లాడి వారి సూచనలు, సలహాలను స్వీకరించారు. భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. కేశఖండన శాల పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆలయ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని సౌకర్యాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
