- కాంగ్రెస్ కు తప్పని ఓటమి
- రెండో ప్రాధాన్యత ఓట్లతో ఫలితం
కరీంనగర్, ఆంధ్రప్రభ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కమలం జోరు కొనసాగింది. ఎంతో ఉత్కంఠ రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి విజయం సాధించారు. చివరి వరకు పోరాడిన కాంగ్రెస్ పార్టీకి నిరాశ తప్పలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లో ఎవరు కోటా ఓటు కు చేరకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఫలితాన్ని తేల్చాయి.
53 మంది ఎలిమినేషన్ తర్వాత కూడా ఫలితం తేలకపోవడంతో మొదటమూడవ స్థానంలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ కు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లతో ఫలితం వచ్చింది.
పట్టబద్రులు 2,52,007 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 27,671 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2,24,336 ఓట్లు చెల్లడంతో అధికారులు 1,12,169 ఓట్లను కోటాగా ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల తో పాటు 53 మంది ఎలిమినేషన్ అనంతరం బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి 78,635 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 73,644, బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 63,404 ఓట్లు సాధించారు.
56 మంది పోటీలో ఉండగా 53 మందికి కలిపి కేవలం 17,244 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. 53 మంది ఎలిమినేషన్ అనంతరం ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించే సమయంలో బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. చివరకు ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లలో సైతం బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి 500 ఓట్లకు పైగా మెజార్టీ సాధించారు. దీంతో ఎన్నికల అధికారి కాసేపట్లో అధికారికంగా అంజిరెడ్డి గెలుపొందారని ప్రకటించనున్నారు.