6accused | విచారణలో సంచలన నిజాలు బహిర్గతం

6accused | విచారణలో సంచలన నిజాలు బహిర్గతం
6accused | విదేశీ హ్యాండ్లర్ల కుట్రలపై కీలక సమాచారం
సోషల్ మీడియా ద్వారా జిహాద్ ప్రేరేపణ
గోప్య గ్రూపుల్లో ప్రమాదకర శిక్షణ వీడియోలు
ఎన్‌ఐఏ దర్యాప్తు దిశగా కీలక అడుగులు
6accused | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విజయవాడ ఉగ్రవాద మూలాల కేసులో అరెస్టైన నిందితులు విచారణలో కీలక, సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చినట్లు సమాచారం. విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు భారత్‌లో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా పని చేశామని వారు అంగీకరించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, తమ ఉద్దేశాన్ని సూచించేలా ‘చూపుడు వేలు’ చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. యువతను జిహాద్ వైపు మళ్లించేందుకు విదేశీ హ్యాండ్లర్లు పరోక్ష, రహస్య మార్గాల్లో నిధులు అందజేసేవారని విచారణలో బయటపడింది.
ప్రస్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం కస్టడీలో ఉన్న ఆరుగురు నిందితులను నాలుగో రోజైన ఆదివారం కూడా సుదీర్ఘంగా, తీవ్రంగా ప్రశ్నించారు. ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్, రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన జిషాన్ అబ్దుల్ మజీద్, బిహార్‌కు చెందిన షాద్ మాన్ దిల్ ఖుష్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిర్ ఆసిఫ్ అలీ, మహారాష్ట్రకు చెందిన షారుఖ్ ఖాన్, షేక్ ఫయాజ్ ఉర్ రెహ్మాన్‌లను సుమారు ఎనిమిది గంటల పాటు విచారించారు.
నిధుల మూలాలపై ప్రశ్నించగా నిందితులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయినట్లు తెలుస్తోంది. విదేశీ హ్యాండ్లర్లు తమకు ప్రత్యక్షంగా పరిచయం లేరని, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ గ్రూపుల ద్వారా వచ్చిన సూచనల మేరకే కార్యకలాపాలు నిర్వహించామని వారు తెలిపినట్లు సమాచారం. విదేశాల్లోని కొన్ని మదర్సాల్లో యువకులకు జిహాదీ శిక్షణ ఇస్తున్నారని, అలాంటి శిక్షణ కోసం భారత్ నుంచి యువతను సిద్ధం చేసి పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లకు పంపాలని విదేశీ హ్యాండ్లర్లు ఆదేశించేవారని విచారణలో వెల్లడైనట్లు చెబుతున్నారు.
అలాగే ‘బెనెక్స్ కామ్’ పేరుతో నిర్వహించిన గోప్య గ్రూప్‌లో పేలుడు పదార్థాల తయారీ, ఐఈడీల వినియోగం, ఆయుధాలపై శిక్షణకు సంబంధించిన వీడియోలు, పీడీఎఫ్ పత్రాలను షేర్ చేసినట్లు తెలిసింది. ఈ గ్రూప్‌కు ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ అడ్మిన్‌గా వ్యవహరించగా, మిగతా నిందితులు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో అరెస్టైన ఆరుగురు నిందితుల కస్టడీ సోమవారంతో ముగియనుండగా, ఇప్పటికే మరో ఐదుగురి కస్టడీ పూర్తైంది. విచారణలో లభించిన ఆధారాల మేరకు తదుపరి దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టనుంది. విదేశీ హ్యాండ్లర్ల నెట్‌వర్క్‌ను బహిర్గతం, అరికట్టే దిశగా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.
