4spot dead : దేవుడా.. గావుకేక Andhra Prabha Crime News

4spot dead : దేవుడా.. గావుకేక Andhra Prabha Crime News
నంద్యాల జిల్లాలో మృత్యుకేళి
- ( నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ )
- వేర్వేరు ప్రమాదాల్లో ..
- 4 గురు దుర్మరణం
- .. 11 మందికి తీవ్ర గాయాలు…
- కళ్ల ముందే భార్య ఇద్దరు పిల్లలు దుర్మరణం
- కారు నడిపిన యజమానికి పరిస్థితి విషమం ..
- బేతంచర్లలో కూలీల ఆటో బోల్తా
- డ్రైవర్ మృతి 10 మంది కూలీలకు తీవ్ర గాయాలు
( నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ )
నంద్యాల జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక కు చెందిన ప్రమోద్ కుటుంబం తన సొంత కారులో తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సొంతూరుకు తిరిగి వెళ్తుండగా నంద్యాల జిల్లా డోన్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.డోన్ సమీపంలోని జగదుర్తి గ్రామం వద్ద కారు ముందున్న క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. కారులోని కుటుంబ సభ్యులు ఎగిరి క్రింద పడ్డారు. ఈ ఘటనలో ప్రమోద్ భార్య సురేఖ , కుమారుడు నిహాన్ , కుమార్తె ఆదుర్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రమోద్ సీట్ బెల్ట్ ధరించడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కర్నూల్ ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వేగం అధికంగా ఉండటమా? లేక రహదారి పరిస్థితుల కారణమా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ దుర్ఘటనలపై నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు డోన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పొట్టకూటికి వెళ్తుంటే ..
పొట్టకూటికి బయలు దేరిన వ్యవసాయ కూలీల ఆటో బేతంచెర్ల సమీపంలో బోల్తాపడి డ్రైవర్ మధు మృతిచెందాడు. 10 మంది కూలీలకు తీవ్రంగా గాయపడ్డారు. బేతంచెర్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు బేతంచెర్ల నుంచి హుసేనాపురానికి కూలి పనులకు ప్రతిరోజు ఆటోలో వెళ్తుంటారు. శుక్రవారం ఈ ఆటో సీతారాంపురం మెట్ట వద్ద మలుపులో లారీని, తప్పించకపోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మధు పదిమంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మధు మృతి చెందాడు.
మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దిగ్భ్రాంతి
నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్రేన్ ను కారు ఢీకొట్టి ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందడం అత్యంత దురదృష్టకరం, విచారకరం అన్నారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై జిల్లా అధికారులను మంత్తరి ఆరా తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడికి మెరుగైన వైద్యసాయం అందించాలని మంత్రి ఆదేశించారు. తరుచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న క్రమంలో, ప్రయాణాల వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
