ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ (Islawat Devan) ఆధ్వర్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల (42percent reservations) ను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కలిసి, మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేశారు.
ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని, బలహీన వర్గాల హక్కుల కోసం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రణాళికలో కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42శాతం రిజర్వేషన్ తెర మీదకు తీసుకువచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పట్టణ మాజీ కౌన్సిలర్లు, బీసీ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘ నాయకులు ఉన్నారు.