3942wards | సన్నాహాలు ప్రారంభం

3942wards | సన్నాహాలు ప్రారంభం
3942wards పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం ముందడుగు
డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ
3,942కు పెరగనున్న వార్డుల సంఖ్య
పాలకవర్గాల పదవీకాలం ముగింపు ప్రభావం
ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి
3942wards ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలోని డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,206 డివిజన్లు, వార్డులు ఉన్నప్పటికీ, 2011 జనాభా లెక్కల ఆధారంగా వాటిని మళ్లీ విభజించనున్నారు.

పునర్విభజనలో భాగంగా పాత, కొత్త డివిజన్లు, వార్డులకు నాలుగు వైపులా హద్దులను నిర్ణయించిన తరువాత ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ తర్వాత ప్రజల అభిప్రాయాలను సేకరించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేసి తుది ప్రతిపాదనలు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపనున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి డివిజన్లు, వార్డుల సంఖ్య 3,942కు పెరగనుంది. అంటే ప్రస్తుతం ఉన్న సంఖ్యతో పోలిస్తే కొత్తగా 736 డివిజన్లు, వార్డులు చేరనున్నాయి.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది మార్చి 17తో ముగిసింది. అలాగే మరో నగరపాలక సంస్థతో పాటు 12 పురపాలక, నగర పంచాయతీల పదవీకాలం నవంబరులో ముగియనుంది.
ఈ అన్ని సంస్థల్లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా, పాత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తగా ఎన్నికైన ప్రతినిధులు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం పురపాలక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
