చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
తిరువూరు, ఆధ్రప్రభ : స్థానిక కుమ్మరబజారులో ఈ నెల 6న ఒక నివాసగృహంలో జరిగిన చోరీ సంఘటనలో నిందితుడ్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాజా శ్రీహరిరావు ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో సహా హైదరాబాదు వెళ్ళగా, ఆ ఇంటి తలుపులు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేసినట్లు గుర్తించి 8న ఫిర్యాదు చేశారని సీఐ గిరిబాబు తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన సత్యనారాయణ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించామని, నిందితుడి నుంచి 30 గ్రాముల బంగారం, కేజీన్నర వెండి, రూ.15వేల నగదు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వేసవిలో ఇళ్ళకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ముందుగా పోలీసు స్టేషన్లో సమాచారం ఇస్తే చోరీల నియంత్రణకు తగు నిఘా ఉంచుతామని సీఐ పేర్కొన్నారు.
