భయభ్రాంతులకు గురవుతున్న యజమాని…
కొల్చారం, మార్చి 3 (ఆంధ్రప్రభ) : మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని నాయినీజలాల్ పూర్ గ్రామంలో ఓ కోళ్ల ఫారంలో 3000కోళ్లు మృతిచెందాయి. కోళ్ల ఫారం యజమాని సతీష్ గౌడ్ ఆవేదన చెందుతున్నాడు. శనివారం పదుల సంఖ్యలో మొదలైన కోళ్ల మృత్యువాత ఆదివారం నాటికి ఆ సంఖ్య 100 సంఖ్యలోకి చేరింది. సోమవారం ఉదయం వరకు సుమారు 3000 కోళ్లు మృతిచెందడంతో లక్షల రూపాయల వరకు నష్టపోయామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందించి తగిన చర్యలు చేపట్టాలని పౌల్ట్రీఫామ్ యజమాని సతీష్ గౌడ్ కోరారు.
పశుసంవర్ధక శాఖ అధికారులు, కోడి పిల్లలను పంపిణీ చేసిన సూపర్ వైజర్లు వచ్చి కోళ్ల శాంపిల్స్ తీసుకుంటున్నారు.. కోళ్లు చనిపోవడానికి కారణం మాత్రం తెలియడం లేదు. పౌల్ట్రీ ఫార్మ్ యజమాని బర్డ్ ఫ్లూ వచ్చిందేమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. మృతిచెందిన కోళ్లను ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లి అడవిలో గొయ్యితీసి పాతి పెట్టడం జరిగిందని సతీష్ గౌడ్ తెలిపారు. ఈ విషయం కోసం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్యను వివరణ కోరగా జిల్లాలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కు సంబంధించినటువంటి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
