ఉగాది రోజున సాంతింటిలోకి సగర్వంగా!

ఉగాది రోజున సాంతింటిలోకి సగర్వంగా!
గృహ ప్రవేశాలకు సిద్ధంగా జక్కంపూడిలో 2,256 టిడ్కో ఇళ్లు
అన్ని సౌకర్యాలతో ఆహ్లాదకరంగా నివాసాలు
సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులు తమ సొంతింటిలోకి సగర్వంగా అడుగుపెట్టేందుకు వీలుగా జక్కంపూడిలో నిర్మించిన 2,256 టిడ్కో ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ బి.చిన్నోడు తదితరులతో కలిసి జక్కంపూడిలోని టిడ్కో ఇళ్ల ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. నిర్మాణ పనులు పూర్తయిన ఇళ్లలో కల్పించిన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య వ్యవస్థలు, నీటి సరఫరా ఏర్పాట్లు, రహదారులు, పరిసరాల అభివృద్ధి వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం నాణ్యతతో పూర్తయిన తీరును గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌కు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వివరించారు. ఈ గృహ సముదాయంలో సైట్ ఏలో నివసించే ప్రజలకు తాగునీటి సరఫరా అందించేందుకు 5 లక్షల లీటర్ల ఎలివేటెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయిందని, మిగిలిన సైట్లకు సంబంధించిన 14 లక్షల లీటర్ల ట్యాంకు పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ కోసం సీవెజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ)ను కూడా ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు వివరించారు. కాలువలు, డ్రైనేజీ వ్యవస్థలు, విద్యుత్ సదుపాయం, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతోందన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ పేదలకు సొంతింటి కలను నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. లబ్ధిదారులకు సౌకర్యవంతమైన నివాస వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చడంపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు చెప్పారు. జక్కంపూడిలోని సైట్–ఎలో 23 బ్లాకుల్లో నిర్మించిన 1,104 ఇళ్లు, సైట్–డిలోని 24 బ్లాకుల్లో నిర్మించిన 1,152 ఇళ్లు మొత్తం 2,256 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ వివరించారు.

ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ ఇళ్లలో గృహ ప్రవేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే మిగిలిన సైట్–బి, సైట్–సి ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన గృహ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో టిడ్కో, మునిసిపల్ ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


