2025 Rewind | Fatal year | తొక్కిసలాటల్లో..
- అటు చావు కేకలు.. ఇటు రాజకీయ కేరింతలు
- ఔను.. ఇది ఫేటల్ ఇయర్ గురూ..
ఆంధ్రప్రభ : 2025 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. దేశమంతా కొత్త సంవత్సర వేడుకలకు, ఆనందోత్సాహాలకు సిద్ధమవుతున్న ఈ సమయంలో, గడిచిన ఈ ఏడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మాత్రం ఎన్నో కుటుంబాలను చీకటిలోకి నెట్టేశాయి.. ఈ సంవత్సరం ఆరంభం నుంచే దేశంలోని పలు ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలు చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి..
తమ ఇష్టదైవాన్ని దర్శించుకోవాలని ఆశించిన భక్తులు, అభిమాన ప్లేయర్‌ను ఒకసారి కళ్లారా చూడాలని ఉరకలేసిన యువత, అభిమాన నాయకుడిని చూడాలని ఆశపడిన ప్రజలు… వీరంతా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తారని ఆశించిన కుటుంబాలకు ఈ ఏడాది తీరని విషాదాన్ని మిగిల్చింది.
పండుగలు, ఉత్సవాలు, క్రీడా వేడుకలు, రాజకీయ సభలు వంటి జనసందోహం ఉండే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడం… ఎందరో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నాయి.
దేవుడిని దర్శించడానికి వెళ్లిన వారు, నేరుగా ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. అయితే, ఒక ప్రాంతంలో జరిగిన విషాదం మరువకముందే మరో ప్రాంతంలో అలాంటి ఘటన మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూ కలకలం రేపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో జరిగిన తొక్కిసలాట ఘటనలు.., వందలాది కుటుంబాలలో ఎప్పటికీ మరచిపోలేని విషాదాన్ని మిగిల్చాయి..
2025 Rewind సంవత్సరం ఆరంభంలోనే…
సంవత్సరం ప్రారంభంలోనే జనవరి 6న తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం వేలాది మంది భక్తులు గుమిగూడారు. టికెట్ల పంపిణీ కేంద్రాల వద్ద క్యూలైన్లలో జరిగిన భారీ తొక్కిసలాటలో పరుల సంఖ్యలో భక్తులు గాయపడగా… 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం భక్తులను కలచివేసింది.

ఆ తర్వాత జనవరి 29న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మౌనీ అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు చేరుకున్నారు. ఈ భారీ జనసందోహాన్ని అదుపు చేయడంలో అధికారులు విఫలం కావడం వల్ల జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా మరణించారు.

ఫిబ్రవరి 15న మహా కుంభమేళా నుంచి తిరిగి వెళ్లేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రైళ్ల కోసం వేయిట్ చేస్తు ఉన్న ప్రయాణికుల మధ్య… రద్దీ పెరగడంతో జరిగిన మరో తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు ఢిల్లీ అధికారులు వివరించారు.

మే 3న గోవాలోని శిర్గావ్ గ్రామంలోని శ్రీ లైరాయ్ దేవీ ఆలయ వార్షిక ఉత్సవానికి గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న ‘నిప్పులపై నడిచే’ ఆచారం ఉంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ కావడం వల్ల భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు నార్త్ గోవా పోలీసులు వెల్లడించారు.

ఐపీఎల్ 2025 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి కైవసం చేసుకుంది. ట్రోఫీ అందుకున్న తర్వాత ఆ జట్టు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ విషాదంగా మారిన సంగతి తెలిసిందే., జూన్ 4న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన RCB ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో లక్షలాది మంది అభిమానులు భారీగా చేరిన అభిమానుల రద్దీ కారణంగా ప్రవేశ ద్వారం వద్ద ఏర్పడ్డ కోలాహలం 11 మంది ప్రాణాలు తీసింది.

2025 Rewind కరూరు రాజకీయ సభలో ఘోర విషాదం
ఈ సంవత్సరంలో అత్యంత ఘోరమైన ఘటన సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూరు జిల్లాలో చోటుచేసుకుంది. తమిళగ రాష్ట్ర పార్టీ సమావేశానికి అధ్యక్షుడు విజయ్ హాజరు కాగా, పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ రాజకీయ సభలో ఒక్కసారిగా నియంత్రణ తప్పి జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 41 మంది మృతిచెందడందేశవ్యాప్తంగా విషాదానికి కారణమైంది. ఈ ఘటన రాజకీయ సభల నిర్వహణలో భద్రతా ప్రమాణాలను మరోసారి చర్చనీయాంశం చేసింది.
నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి ఏకాదశి ఉత్సవం సందర్భంగా అధిక రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించారు. ఆలయ సామర్థ్యం దాదాపు 3 వేల మంది అయితే.. 25 వేల మందికిపైగా భక్తులు తరలి వచ్చారు. క్యూలైన్‌లో భక్తులు విపరీతంగా ఉండడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీనికి తోడు మెట్ల మార్గంలో ఉన్న రెయిలింగ్ ఊడిపడింది. దీంతో భక్తులు మెట్లపై ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందారు.
మునపటి ఏడాది చేదు జ్ఞాపకం.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ టికెట్ల కోసం జరిగిన తోపులాటలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన రేవతి అనే మహిళ కుటుంబంలో జరిగిన విషాదం అత్యంత దయనీయం. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడటమే కాకుండా, ఏడాది గడిచినా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. తన తల్లి మరణించిన విషయం ఇప్పటికి కూడా తెలియని దుస్థితిలో ఉన్నాడు శ్రీతేజ్.

అయితే, ఈ ప్రాణనష్టాలకి బాధ్యులెవరు అనే ప్రశ్న లేవనెత్తాలి.. పండుగలు, ఉత్సవాలు, క్రీడా వేడుకలు, రాజకీయ సభలు వంటి జనసందోహం ఉండే ప్రాంతాల్లో రద్దీని సరిగా అంచనా వేయలేని, అత్యవసర మార్గాలను సిద్ధం చేయలేని నిర్వాహకులదేనా?
లేక, ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఆవేశంతో, నియంత్రణను కోల్పోయి, భద్రతా సిబ్బంది సూచనలను పాటించకుండా తోటివారిని తోసుకుంటూ ముందుకు దూకే ప్రజలదా… ? లేక, గత విషాదాల నుంచి పాఠం నేర్చుకోకుండా, ప్రజల భద్రతకు కనీస వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వాలదా.. ? ఈ దురదృష్టకర సంఘటనలు… నిర్లక్ష్యం, ఓవర్ ఎగ్జైట్మెంట్, వ్యవస్థాగత వైఫల్యాల ఫలితంగానే జరిగిందని చెప్పవచ్చు, అందుకే ఈ విషాదానికి వ్యవస్థలోని ప్రతి అంచునూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది…
అయితే, గడిచిన 2025 సంవత్సరంలో చోటుచేసుకున్న వరుస విషాదకర ఘటనలు, ముఖ్యంగా తొక్కిసలాటల వల్ల ఏర్పడిన చేదు జ్ఞాపకాలు మన హృదయాలలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. అయితే, ఆ భయంకర అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ.. రాబోయే 2026 సంవత్సరం మనందరి జీవితాల్లో శాంతి, స్థిరత్వం, ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
2025లో జరిగిన విషాదాలు పునరావృతం కాకుండా… ప్రతి ఒక్కరూ సురక్షితంగా, సంతోషంగా తమ జీవిత గమ్యాలను చేరుకోవాలని ఆశిద్దాం. తొక్కిసలాటలు, ఇతర దుర్ఘటనల్లో తమ వారిని కోల్పోయి తీవ్రంగా ప్రభావితమైన కుటుంబాలకు 2026 సంవత్సరం ఓదార్పును, మనోధైర్యంతో పాటు కొత్త ఆశలను అందించాలని కోరుకుదాం. నూతన సంవత్సరం 2026 అందరికీ ఆశించిన దానికంటే అత్యుత్తమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..
2025 Rewind 2025 Rewind 2025 Rewind 2025 Rewind 2025 Rewind 2025 Rewind 2025 Rewind 2025 Rewind 2025 Rewind 2025 Rewind

