భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐలో స్వల్పకాలిక కోర్సులు

భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐలో స్వల్పకాలిక కోర్సులు

– మార్చి 23 నుంచి రెండో బ్యాచ్

  • యువత ,విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
  • ఐటీఐ, ఏటిసి ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్

భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన స్వల్పకాలిక నైపుణ్య కోర్సులకు విశేష స్పందన లభిస్తున్నదని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ భూపాలపల్లి ప్రిన్సిపాల్ ఎల్. జుమ్లా నాయక్ తెలిపారు. భూపాలపల్లిలో కూడా ఈ కోర్సులు విజయవంతంగా కొనసాగుతున్నాయని, రెండో బ్యాచ్ మార్చి 23, 2026 నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని 65 ఏటీసీలలో 30 కేంద్రాల్లో ఈ పార్ట్‌టైమ్ (12 రోజుల) కోర్సులు అమలు అవుతున్నాయని తెలిపారు.

భూపాలపల్లి కేంద్రంలోనీ ఐటీఐ , ఏటీసీ లో ఆరు కోర్సుల్లో మొత్తం 120 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి కోర్సుకు 20 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు నేరుగా ప్రవేశం పొందవచ్చని స్పష్టం చేశారు. ఈ స్వల్పకాలిక కోర్సుల్లో బేసిక్ సిఎన్ సి లెట్ మిషన్ ఆపరేషన్ అండ్ ప్రోగ్రామింగ్, మిల్లింగ్ మిషన్ ఆపరేషన్ అండ్ ప్రోగ్రామింగ్, జూనియర్ ప్రొడక్ట్ డిజైనర్ (క్యాడ్ 2డి, 3డి), జూనియర్ రోబోట్ ఆపరేటర్ & ప్రోగ్రామర్, ఆర్క్ వెల్డింగ్, ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ అవగాహన, ఈవీ బేసిక్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

పదవ తరగతి, ఐటీఐలో శిక్షణ పొందుతున్నవారు, ఐటీఐ ఉత్తీర్ణులు, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు సహా వివిధ విద్యార్హతల అభ్యర్థులు ఈ కోర్సులకు అర్హులని తెలిపారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా చేరవచ్చని చెప్పారు. వేసవి సెలవులను వినియోగించుకుని ఈ శిక్షణ పొందితే భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సూచించారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేయబడుతుందని, ఇది ఉద్యోగావకాశాలకు దోహదపడుతుందని ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్ పేర్కొన్నారు.

Leave a Reply