కాల్వబుగ్గ దేవాలయంలో వరుస దొంగతనాలు…

కాల్వబుగ్గ దేవాలయంలో వరుస దొంగతనాలు…
దేవాదాయశాఖ నిర్లక్ష్యం, పాలకమండలి వైఫల్యం: విశ్వ హిందూ పరిషత్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కాల్వబుగ్గలోని ప్రసిద్ధ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలకు దేవాదాయశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరితో పాటు దేవాలయ పాలకమండలి వైఫల్యమే కారణమని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నంది రెడ్డి సాయి రెడ్డి ఆరోపించారు. గత వారం రోజుల్లోనే దాదాపు 20 కేజీల వెండి వస్తువులు దొంగతనం కావడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించిందన్నారు.
ఇదే దేవాలయంలో ఎనిమిది నెలల క్రితం ఐదు హుండీలు ఎత్తుకెళ్లి లక్షల రూపాయలు అపహరించిన ఘటన ఇంకా మరవకముందే, మరోసారి స్వామివారి ధార పాత్ర, నాగాభరణం, భ్రమరాంబ అమ్మవారి పాదాల వద్ద ఉన్న సింహం విగ్రహం దోపిడీకి గురవడం భక్తులను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ జిల్లా నాయకులతో కలిసి నంది రెడ్డి సాయి రెడ్డి దేవస్థానాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. దేవాదాయశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతో పాటు, పాలకమండలి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
దాదాపు పది రోజులు గడిచినా దొంగతనాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం, ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయకపోవడం పాలకమండలి నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం, దేవాదాయశాఖ, పోలీస్ శాఖలు సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకుని దొంగలను అరెస్ట్ చేయాలని, దోచుకెళ్లిన ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని కోరారు.
దేవాలయంలో తగిన సిబ్బంది నియామకం చేయడం, సీసీ కెమెరాల సంఖ్య పెంచడం అత్యవసరమని పేర్కొన్నారు. దాదాపు 200 ఎకరాల ఆస్తులు, లక్షల్లో ఆదాయం ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు జరగకపోవడం శోచనీయమని విమర్శించారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా అధికారులు, పాలకమండలి స్పందించకపోవడం ఆందోళనకరమని, తక్షణ చర్యలు తీసుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తూముకుంట ప్రతాపరెడ్డి, జిల్లా నాయకులు గోవిందరాజులు, రాంబాబు, కరణం సుధాకర్, శివకోటి చంద్రశేఖర్, ఓర్వకల్లు మండల అధ్యక్షుడు ఎద్దుల రాజారెడ్డి, బజరంగ్ దళ్ నాయకులు శివ సాయినాథ్, గుజరాతీ సురేష్, కోట్ల తిమ్మారెడ్డి, ఉదయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
