- రామయంపేటలో 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు
- నీట మునిగిన బీసీ కాలనీ
- తెగిన జాతీయ రహదారి ఎన్ హెచ్ 765
- రామాయంపేట – సిద్దిపేట మధ్య కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
ఉమ్మడి మెదక్ ప్రతినిధి : కుంభవృష్టి వర్షం మెదక్ జిల్లాను కుదిపేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైంది. రామాయంపేట – సిద్దిపేట జాతీయ రహదారి ఎన్ హెచ్ 765 డీజీ కోనాపూర్ వద్ద రోడ్డు తెగిపోయింది.
దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రామయంపేట్ నుంచి కామారెడ్డి వెళ్లే రోడ్డులో వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కోమటిపల్లి తండా, దామరచెరువు తండాల్లో తీవ్ర యుద్ధం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దొంగల ధర్మారం నార్లాపూర్ మధ్య ఉద్రుతంగా వరద ప్రవహించడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.
వరద నీటిలో చిక్కుకున్న డిగ్రీ విద్యార్థినులు
రామయంపేట్ లో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని డిగ్రీ విద్యార్థినులు హాస్టల్లో చెప్పుకున్నారు. సుమారు 350 మంది విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మధ్యాహ్న భోజనం రాకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల వన దుర్గాదేవి ఆలయం వద్ద మంజీరా నది పోటెత్తింది. దీంతో వరద ప్రవాహం పెరగడంతో అమ్మవారి ఆలయాన్ని పూజారులు మూసివేశారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో భారీ వర్షాలకు గ్రామానికి చెందిన రైతు లద్ద బాబు పౌల్ట్రీ ఫామ్ లోకి వరదనీరు చేరడంతో సుమారు పదివేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో రైతు బోరున విలపించాడు. భారీ వర్షానికి సుమారు 20 లక్షల ఆస్తి నష్టం వాటిలిందని, ప్రభుత్వం స్పందించి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

సిద్ధిపేట జిల్లాలో
సిద్దిపేట జిల్లాలో మిరుదొడ్డి మండలంలోని అల్వాల- లింగుపల్లి గ్రామాల మధ్య కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భూంపల్లి అక్బర్ పేట్ మండల పరిధిలో ప్రవహించే కూడవెల్లి వాగు కుదురుతంగా ప్రవహించడంతో పర్యాటకులు చూసేందుకు అక్కడికి చేరుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల పరిధిలోని మోయ తుమ్మెద వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సింగూరుకు వరద పోటు..
సంగారెడ్డి జిల్లాలో మంజీరా డ్యామ్ కు వరద నీరు పోటెత్తుతుంది. జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సింగూర్ కు వరద పోటెత్తింది. 39492 క్యూసెక్కుల నీరు జలాశయంలో వచ్చి చేరుతోంది. కాగా సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 21,451 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జిల్లాలోని నారింజ, నల్లవాగు, బోగులంపల్లి వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
రాయికోడ్ మండలంలోని కుస్నూర్, యూసుఫ్ పూర్, నాగ్వార్ ఇటికేపల్లి తదితర గ్రామాల్లో వంతెనలపై నుండి వరద ఉధృతితో వాగులు పొంగిపొర్లుతున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ చైతన్య కిరణ్ సిబ్బంది తో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా పోలీసు అధికారులు ప్రజలను ప్రభుత్వం చేస్తున్నారు.
