1st Feb 2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
1st Feb 2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్రభ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు..
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
1st Feb 2026 ఈ సంచికలో…
1 వారణాసి..జక్కన్న ప్లానింగే వేరు!
2 మనసు-మాట(శీర్షిక)
3 కబుర్లు(శీర్షిక)
4.సన్నిహితం(శీర్షిక)
5.మెదడుకు మేత-సామెత(శీర్షిక)
6.సుబాణీయం(శీర్షిక)
7.తెలుగు మీడియం ముద్దు-ఆంగ్ల మీడియం వద్దు!
8.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)
-____________________-____________________-____________________

1 ముఖపత్ర కథనం
1st Feb 2026 | వారణాసి.. జక్కన్న ప్లానింగే వేరు!
1st Feb 2026 | దటీజ్ రాజమౌళి.. ప్లానింగ్ అంటే ఇదే
ప్రమోషన్లలో రూటు మార్చిన జక్కన్న
సైలెంట్ అప్‌డేట్స్‌తో షాక్ ఇచ్చిన రాజమౌళి
వారణాసి రిలీజ్ డేట్ వెనుక మాస్టర్ ప్లాన్
సెలవులను క్యాష్ చేసుకునేలా జక్కన్న స్ట్రాటజీ
పాన్ వరల్డ్ లెవల్‌లో వారణాసి బజ్
చరిత్ర సృష్టించే దిశగా జక్కన్న మూవీ

1st Feb 2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వారణాసి.. జక్కన్న ప్లానింగే వేరు..
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబోలో మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ భారీ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక.. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. జక్కన్న తన సినిమాలను ఎంతలా ప్రమోట్ చేస్తుంటారో.. ఎంతలా జనాల్లో తీసుకెళుతుంటారో తెలిసిందే. అయితే.. వారణాసి సినిమా రిలీజ్ డేట్ విషయంలో జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదు. వేరే లెవల్లో ఉంది. ఇంతకీ.. రాజమౌళి స్ట్రాజటీ ఏంటి..?
1st Feb 2026 | దటీజ్ రాజమౌళి..
రాజమౌళి సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కథ గురించి క్లియర్ గా చెప్పి.. ఆతర్వాత షూటింగ్ స్టార్ట్ చేసేవారు. అయితే.. ఈసారి ప్లానింగ్ మార్చారు. ఏమాత్రం మీడియా మీట్ పెట్టకుండా సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆతర్వాత గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి.. టైటిల్ అనౌన్స్ చేసి.. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించారు. దీంతీ ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ ఈవెంట్ కవరేజ్ కోసం విదేశాల నుంచి జర్నలిస్టులను కూడా హైదరాబాద్ రప్పించి అంతర్జాతీయ మీడియాలో కూడా ఈ సినిమా గురించి చర్చించుకునేలా చేశారు. దటీజ్ రాజమౌళి అనిపించారు. దీనిని బట్టి జక్కన్న ప్లానింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

1st Feb 2026 | రూటు మార్చిన రాజమౌళి..
ఇప్పుడు ఏ పెద్ద సినిమా నుంచి చిన్న అప్ డేట్ ఇవ్వాలన్నా.. ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. అప్ డేట్ రాబోతుందని ముందుగా ఊరించి ఆతర్వాత.. చెప్పిన టైమ్ కి అప్ డేట్ ఇవ్వకుండా విసిగించి.. ఆతర్వాత అప్ డేట్ ఇస్తుంటారు. అయితే.. జక్కన్న రూటు మార్చాడు. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసినట్టుగానే.. అప్ డేట్స్ కూడా సైలెంట్ గా ఇచ్చేస్తున్నారు. ఊహించని విధంగా వారణాసి శృతిహాసన్ పాడిన సాంగ్ రిలీజ్ చేశారు. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఇస్తున్నట్టుగా ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా.. సైలెంట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. జక్కన్న ప్లానింగ్ ఏంటో.. ఆయన స్ట్రాటజీ ఏంటో తెలియక అభిమానులే కాదు.. సినీ జనాలు సైతం షాక్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఇదేం ప్రమోషనల్ స్ట్రాటజీ రా నాయనా అంటూ సర్ ఫ్రైజ్ అవుతున్నారు.

1st Feb 2026 | రిలీజ్ డేట్ స్ట్రాటజీ ఇదే..
వారణాసి ఏప్రిల్ 7న రిలీజ్ అని ప్రకటించడానికి కారణం ఏంటంటే.. ఆ రోజున ఉగాది సెలవు రోజు. కాకపోతే బుధవారం. సినిమాలు ఎప్పుడూ కూడా గురువారం లేదా శుక్రవారం రిలీజ్ అవుతాయి. బుధవారం రిలీజ్ చేయడం చాలా అరుదు. బుధవారం రిలీజ్ అంటే.. మంగళవారం నుంచే ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి. 10వ తేదీ రెండో శనివారం సెలవు, ఆదివారం సెలవు. ఇక సెకండ్ వీక్ లో 14న అంబేద్కర్ జయంతి సెలవు, 15న శ్రీరామ నవమి సెలవు, ఇలా వారణాసి రిలీజ్ తర్వాత ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ సెలవులు బాగా కలిసొస్తాయి. అందుకనే ఈ డేట్ లాక్ చేసి అనౌన్స్ చేసారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇందులో వీఎఫ్ఎక్స్ వర్క్ కాస్త ఎక్కువుగానే ఉందట. అందుచేత అవన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. జక్కన్న చెప్పినట్టుగా ఏప్రిల్ 7న వారణాసి థియేటర్స్ లోకి వస్తుంది. మొత్తానికి జక్కన్న తనదైన స్ట్రాటజీతో.. పక్కా ప్లానింగ్ తో వారణాసి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో చరిత్ర సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి.. ఏం జరగనుందో..?
,
_-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-_
2 మనసు-మాట శీర్షిక

(గొప్యత కోసం క్లయింట్ డీటెయిల్స్ మార్చబడ్డాయి.) త్రిప్తి మనసు మాట : నా పేరు త్రిప్తి. నా వయసు 28 సంవత్సరాలు. నాకు ఆదిత్యతో పెళ్లయ్యి 3 సంవత్సరాలయ్యింది. నేను పెళ్లయిన దగ్గిర నించి బాధలో లేను అలాగని ఆదిత్యతో ఆనందంగా వున్నానని కూడా చెప్పలేను. ఎదో తెలీని వెలితి(emptyness) లేదా వాయిడ్ లాగా ఉంటుంది. గత 6 నెలలుగా దేని మీద శ్రద్ద ఉండట్లేదు, ఏమి చెయ్యాలనిపించట్లేదు, ఉదయం లెగవాలనిపించట్లేదు. నా మీద నాకు శ్రద్ద పూర్తిగా తగ్గిపోయింది. ఎదో ఆలోచించుకుంటూ ఉండిపోతున్నాను, ఏమి ఆలోచిస్తున్నానో కూడా చెప్పలేకపోతున్న. కారణం తెలియట్లేదు కానీ ఇట్టే ఏడ్చేస్తున్నాను. ఇంట్లోంచి బయటకు వెళ్లడం మానేసాను, నా రూమ్ లోనే ఎక్కువ ఉండిపోతున్నాను.నా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నన్ను కొన్నిసార్లు ప్రశంసిస్తూ, నా అంత మంచి కూతురు ఎవరికీ వుండరు అంటూ పొగిడేసేవారు మరికొన్నిసార్లు లోపాలను ఎత్తి చూపుతూ నేను వారికి ఎప్పుడు భారమే నా వలన వారు చాలా దుఃఖం అనుభవిస్తున్నారని చెప్పే వారు. ఇప్పుడు నా భర్త ఆదిత్య నుంచి కూడా నాకు ఈ ఇబ్బంది ఎదురవుతుంది. కొన్నిసార్లు నాకు ప్రేమను చూపిస్తూ, మరికొన్నిసార్లు భావోద్వేగంగా దూరంగా ఉంటారు. కొన్ని సార్లు నా గురించి పొగిడేస్తారు ఇంకొన్నిసార్లు నన్ను చాలా చులకన చేసి మాట్లాడతారు. నేను పనిచేసే కార్యాలయంలో, నా బాస్ తరచుగా నా ప్రాజెక్ట్‌లను ప్రశాంసిస్తారు కానీ అప్పుడప్పుడు సహోద్యోగుల ముందు చిన్న తప్పులను కూడా ఎత్తి చూపుతారు, హేళనగా మాట్లాడతారు.వీరందిరిలో ఉన్న ఈ ద్వంద ప్రవర్తన నన్ను తిరస్కరణకు గురిచేస్తుంది. ఎదో తెలీని వెలితి (emptyness) అనుభవిస్తున్నాను. ఇది నివారించడానికి ఇతరులకు ఏమి అవసరమో అని ఊహించడానికి ప్రయత్నిస్తూ, గాలిలో నడుస్తున్నట్లు భావిస్తున్నాను. వీరందరి ప్రామాణీకరణ(validation) కోసం వెతుకుతూ అలసిపోయాను. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. ఇంక నేను ఏ బంధంలో ఇమడలేను, వీలందరికి దూరమవ్వాలనిపిస్తుంది.

సైకాలజిస్ట్ మాట : త్రిప్తి, మీ మనసులోని మాటలు చదివాక మీకు ఎంత బాధగా ఉందో అర్ధమవుతోంది. మీ చిన్నప్పటి అనుభవాలు, ఇప్పుడు ఆదిత్యతో మీరు అనుభవిస్తున్నది, పనిలో ఉన్న సంబంధాలు మరియు మీరు ఎదురుకుంటున్న ఇబ్బందులు – ఇవన్ని మీ మానసిక పరిస్థితిని ప్రభావితం చేస్తున్నాయి.
మీరు ఎద్దురుకుంటున్న సమస్యలు:
- ద్వంద ప్రవర్తన: తల్లిదండ్రులు, ఆదిత్య, బాస్ – వీరందరి నుంచి మిశ్రమ సందేశాలందుతున్నాయి. దీని వలన మీకు ఇతురల ప్రామాణికరణ(validation) సంపాదించడం అలవాటయ్యింది.
- తిరస్కరణ భయం : మీరు బాహ్య బంధాలలో తిరస్కరణకు గురవ్వడం వలన మీలోని తిరస్కరణ భయం పెరిగింది. ఈ తిరస్కరణ భయం నుంచి కోలుకొనే క్రమంలో మిమ్మల్ని మీరు అనుక్షణం తిరస్కరించుకుంటున్నారు. దీని వలన మీరు స్వీయ సందేహానికి (self-doubt) గురవుతున్నారు.
- స్వీయ-విలువ: మీలో ఏర్పడిన స్వీయ సందేహం(self-doubt) మీకున్న విలువను అనుక్షణం ప్రశ్నించుకునేలా చేస్తున్నది. మీ స్వీయ-విలువను నిర్ధారించుకోవడానికి ఇతరులకి మీ పైనున్న అభిప్రాయం పై ఆధారపడడం అలవాటు చేసుకున్నారు. దీని వలన తీవ్ర వెలితిని, నిరాశని అనుభవిస్తున్నారు.
త్రిప్తి, మీరు అనుభవిస్తున్న మానసిక పరిస్థితిని డిప్రెషన్ అని అంటారు. మీ చిన్నప్పటి అనుభవాలు మీ నమ్మకాల్ని/ఆలోచనల్ని, భావాలని మరియు మీ ప్రవర్తనను రూపొందించాయి. వీటి వలనే మీరు డిప్రెషన్ కి లోనవుతున్నారు. మీరు నిస్సహాయత (helplessness), నిరాశ (hopelessness), స్వీయ -విలువ లోపం(worthlessness) అన్నవి అనుభవిస్తున్నారు. ఇవే మీ డిప్రెషన్ కి కారణాలు. ఇవి అదిగమించాలంటే మీ జీవితం మీ నియంత్రణలో వుంది, మార్పు తేవడం మీ చేతిలో ఉందన్న నమ్మకం మీలో ఏర్పడాలి. దీనికోసం మీకు సైకాలజిస్టులు ఇచ్చే కౌన్సిలింగ్ తో పాటు సైకియాట్రిస్టులు ఇచ్చే మందులు కూడా అవసరం.
త్రిప్తి, సైకాలజికల్ కౌన్సిలింగ్ ద్వారా డిప్రెషన్ ఎలా క్యూర్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఐతే చెపుతాను మీరు మరియు మా ఆంధ్ర ప్రభ పాఠకులు కూడా ఇవి చదవండి శ్రద్దగా:
భావ వ్యక్తీకరణ మెరుగుపర్చడం: మీ మానసిక సమస్యలు ఎదుర్కోవడానికి కావాల్సిన సానుకూల భావ వ్యక్తీకరణకు కావాల్సిన భాషా నైపుణ్యాన్ని నేర్పిస్తారు.
• సంబంధాలు *మెరుగుపరచడం : మీ తో మీకున్న బంధాన్ని బలపరచడం ద్వారా మిగిలిన వారితో మీ బంధం బలపర్చుకోవడానికి కావాల్సిన ప్రతిభని నేర్పిస్తారు.
మీ డిప్రెషన్ లక్షణాలు తగ్గించి, స్వీయ-విలువ పెంపోందిచడం ద్వారా, మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారు.
ఐతే ఇవన్నీ ఒక్క సెషన్లో అవ్వవు మానసిక నిపుణులు చేపినన్ని సెషన్లు తీసుకోవాలని గుర్తించుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణమే మీ దగ్గిరలో ఉన్న మానసిక నిపుణుల్ని కలవండి కౌన్సిలింగ్ ద్వారా మీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పునర్నిర్మించుకోండి త్రిప్తి. మీ బాధను అర్థం చేసుకొని మీకు కావాల్సిన పరిష్కారము చూపించాను అని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఇట్లు మీ గాయత్రి
————————————————————————————————–
3 కబుర్లు (శీర్షిక)

అహం ‘భావం’ వద్దు!
ఒకానొక వ్యక్తికి ప్రపంచంమొత్తం మీద అత్యంత ధనికుడిగా గుర్తింపు పొందాలని ఆశ. రాత్రింబవళ్ళు మరో ధ్యాసంటూ లేకుండా గడించి చివరకు కోరుకొన్నట్లే ‘అత్యంత ఐశ్వర్యవంతుడి’ గా గుర్తింపు సాధించాడు. కాని సంపాదన యావలో పడి సంతోషం కొల్పోయాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సంతోషం దరి చేరలేకపోయాడు.
కోల్పోయిన సంతోషం కోసం అతను ఒక సాధువును ఆశ్రయించాడు. తానెంత ధనవంతుడో చూపించాలన్న అహంభావంతో అట్టహాసంగా ఉత్తమ జాతి గుర్రం మీద సాధువు దగ్గరకు వెళ్ళాడు. రత్న రాసులు నింపిన ఓ పట్టు మూటను సాధువు ముందు పెట్టి తన సమస్య చెప్పుకొన్నాడు.
ధనవంతుడు వెళ్ళబోసిన గోడు అంతా సావధానంగా విన్నాడు సాధువు. హఠాత్తుగా తన ముందున్న రత్నరాసుల మూటను లంకించుకొని దౌడు తీసాడు. ధనవంతుడు ఒక్కసారిగా దిమ్మెరపోయాడు. వెంటనే తేరుకుని సాధువు వెంటబడ్డాడు. ఉత్తమ జాతి గుర్ర మీద ఎక్కీ ఫలితం లేకపోయింది. సాధువు కోసం తిరిగి తిరిగి అలసిపోయి నిస్త్రాణగా చివరికి బైలుదేరిన చోటికే వచ్చి కూలబడ్డాడు. కాని అప్పటికే సాధువు తన రత్నరాసుల మూటను ప్రక్కన పెట్టుకొని కనిపించాడు.
ధనవంతుడు అమాంతం ఆ సంచీని వూడలాక్కొని పరమానందంగా గుండెకు హత్తుకొన్నాడు. ధనవంతుడి మొహం వంక చూసి చిరునవ్వుతో అన్నాడు సాధువు, “చూసావా నాయనా! నీవు పోగొట్టుకున్న సంపద తిరిగి దొరికినందుకే ఆనందం నీకు దక్కింది. గడించే యావలో పడ్డందు వల్లే ఇప్పటి దాక నువ్వు ఆనందాకి దూరమయ్యావు. సంపాదించింది పోగొట్టుకున్న తరువాతే ఆనందం నీ దరికి చేరింది. ‘నాది.. నాది’ అనుకున్నంత కాలం ఆనందానికి దూరం కాక తప్పదు. ఆనందం పొందాలంటే సంపాదించింది మొత్తం నీ ‘సొంతానికే’ అనుకోకూడదు. గడించిన దానితో కొంత ఆ పన్నులను ఆదుకుంటే ‘ఆనందం’ దానంతట అదే నీ సొంతం అవుతుంది”
బుద్ధుడు ప్రబోధించిన ‘అనాత్మ’ (no-self) సిద్ధాంత సారం కూడా ఇదే. అహం(నాది అనే భావన) వదిల్చుకుంటేనే నీవు నిజమైన ‘నీవు’ అవుతావు. నిజమైన నీవు అంటే అందరిలోనూ ‘నీవు’ ఉండటం అన్నమాట. అలా ఉండాలంటే స్వార్థం లేకుండా ఉన్నంతలో కొంత పదిమంది అర్హులకు పంచాలి. సపాదించటం తప్ప పంచటం అనే మాటే జనం మర్చిపోయినందు వల్లే నేటి ప్రపంచంలో ఇంత అల్లకల్లోలం!
———————————————————————-
4.సన్నిహితం… శీర్షిక

ఇంతకంటే బాగా
ఏదైనా పని మనకు వంట బట్టాక , దాన్ని అదే పద్ధతి లో చేసుకుంటూ పోతుంటాం మనం. అంటే మన వృత్తికి సంబంధించినవి అన్న మాట. టీచింగ్ , రైటింగ్ , ఎడిటింగ్, ఇలా. ఆ పనులని ఇంకా బాగా ఎలా చెయ్యవచ్చు , సమయాన్ని , డబ్బును ఎలా ఆదా చెయ్యవచ్చు అన్న దాని గురించి ఆలోచించము . ఎందుకంటే అలా మార్పు కోసం ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుందని , అసలు పని అవదు అని భయపడతాం . కానీ కొంచెం పక్కకు జరిగి ఆలోచిస్తే ఆ పని అంతకంటే బాగా చెయ్యవచ్చు అని తెలుసుకోం.
దీన్ని చిన్న ఉదాహరణతో మీకు వివరిస్తాను.
నేను కథలు వ్రాయడం సుమారు 1995 లో ప్రారంభించాను . మొదటగా కాగితం మీద రఫ్ గా కథ వ్రాసేవాడిని.కథ మొత్తం పూర్తయ్యాక చదివి కరెక్షన్స్ చేసుకొనే వాడిని.ఆ తర్వాత దాన్ని ఫెయిర్ చేసి పత్రికలకు పంపేవాడిని. మళ్ళీ కథను మార్చాలి అంటే మొత్తం తిరగ వ్రాయవలసి వచ్చేది. అందుకనే ఒక కథను సుమారు నెలరోజులు వ్రాసేవాడిని.అది పబ్లిష్ అయ్యేసరికి ఇంకో రెండు నెలలు. అలా సంవత్సరానికి నాలుగు కథలకు మించి వ్రాయలేకపోయే వాడిని.
అలా సాగుతున్న తరుణంలో…2008 లో ఒక రచయిత మిత్రుడిని కలవడం జరిగింది. అతను తన కంప్యూటర్ లో టైప్ చేసిన నవలను నాకు చూపించి చదవమని చెప్పాడు.
నేను చదివాక అతన్ని అడిగాను ఎలా టైప్ చేస్తున్నావు అని.అతను నాకు అన్నీ వివరించాడు. నిత్యం కంప్యూటర్ తోనే పనిచేసే నేను , ఇలా తెలుగు లో టైప్ చేసి కథ ,నవల వ్రాయవచ్చు అని ఎప్పుడూ తెలుసుకోలేదు , ప్రయత్నించలేదు. తర్వాత ఈ పద్ధతి మొదలు పెట్టాను. చాలా వేగంగా కథలు వ్రాయడం జరిగింది. ఎడిటింగ్ కూడా ఈజీ అయింది. కొత్త ఆలోచనలు వస్తే మధ్యలో కలపటం ఇవన్నీ ఈజీ అయ్యాయి. నా కథల సంఖ్య పెరిగింది.
ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
అలా ప్రతి ఒక్కరు తమ ఫీల్డ్ లో , తమ వర్క్ ను ఇంకా ఎఫీషియంట్ గా ఎలా చెయ్యవచ్చు అని నిరంతరం ఆలోచిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కదా ఫ్రెండ్స్ !!!!
5.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

లోగోట్టు పెరమాళ్ళకెరుక
‘ అసలు రహస్యం దేవుడికే తెలుసు ‘ అనే అర్థంలో ఈ సామెతను వాడతారు. ‘ పెరుమాళ్ళు ‘ అనేది తమిళ పదం. ‘ పెరుమాళ్ ‘. దాన్ని తెలుగులోకి ఇలా మార్చారు. ‘ తిరు ‘ అన్న పదం కూడా తమిళమే. మనం గౌరవ వాచకంగా పేరు ముందు శ్రీ చేర్చినట్టు తమిళ్ లో ‘ తిరు ‘ చేరుస్తారు. శ్రీమహావిష్ణువు అవతారమైన రంగనాథుని ‘ పెరుమాళ్ ‘ అంటారు వైష్ణవ సంప్రదాయంలో.
రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటారు. ఎవరిది కరెక్టో ఆ పెరుమాళ్లకు తప్ప ఎవరికీ తెలియదు. ‘ బొగ్గు గనుల కుంభకోణంలో ఫలానా మంత్రికి ప్రమేయం ఉందం’ టారు. ఫోన్ టాపింగ్ లో ‘ అడ్డంగా ‘ దొరికిపోయారు. ఎగస్ పార్టీ వాళ్ళు అంటారు ఏలిన వారు. ఎవరి పేపర్లు వారికుంటాయి. ఎవరి సోషల్ మీడియా వారుకుంటుంది. ఒక పెద్ద లీడర్ తన సమీప బంధువును చంపించాడని, తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ చేశారని వీళ్లు, అదేమీ లేదని, కోర్టే ఆ మేరకు తేల్చిందని వాళ్లు. వాళ్లు వాళ్లు బాగానే ఉంటారు. వెర్రి వెంగళప్పలం మనమే. ఓటర్ మహాశయులం. అసలు గుట్టు ఆ భగవంతునికే తెలుసు. కానీ ఆయన నోరు విప్పి చెప్పడు కదా ! ఆయనకంటూ ఒక న్యూస్ పేపర్ ఉందా, యూట్యూబ్ ఛానల్ అయినా ఉందా పాపం?
డెలికసి అనేది ఒకటుంటుంది. దాని కోసం అసలు విషయాలను దాచి పెడుతుంటారు చాలా మంది. కొడుకు కోడలు నిరాదరణ చూపిస్తున్నా, వాళ్ళు బంగారు కొండలని కలరింగ్ ఇస్తారు. నేను ఇంత గొప్ప రచయిత/రచయిత్రి కావడం వెనుక నా జీవిత భాగస్వామి పాత్ర చాలా ఉందంటారు. ఉందో లేదో పెరుమాళ్ళ కెరక.
గుట్టు అనేది అచ్చ తెలుగు పదం. తులనాడులోని సాంప్రదాయిక ఇండ్లను గొట్టులంటారు. ఇలాంటివి మన గోదావరి జిల్లాల్లో కూడా ఉంటాయి. గుంపులు గుంపులు బంధు జనం ఉన్న సినిమాల్లో వీటిని చూపిస్తుంటారు. మనకు ‘ రహస్యం ‘ అంతు పట్టనిది అని అర్థం. గుట్టుకు వ్యతిరేకం రట్టు అంటారు కానీ, దాన్ని రైమింగ్ కోసం వాడారనిపిస్తుంది నాకు. సంసారం గుట్టు, వ్యాధి రట్టు అన్న నానుడి ఉంది కదా! ఈ మధ్య అది రివర్స్ అయ్యి రోగాలు వస్తే ఎవరికి చెప్పడం లేదు. హాస్పిటల్లో చేరి ఐసీయూ లో ఉన్నా, అదేం పెద్ద రోగం కాదన్నట్టు బిల్డప్ ఇస్తారు. ఆ మధ్య మా దగ్గర బంధువు ఒకాయనకు క్యాన్సర్ వస్తే ఎవరికి చెప్పకండి అని చాలా మంది దగ్గర మాట తీసుకున్నాడు. అలా అది వైరల్ అయింది.
‘గుట్టుగా జరిపించేశారు’. ‘గుట్టు రట్టయింది’ లాంటి ప్రయోగాలు మనకు బోలెడు. ‘ఇంటి గుట్టు’ అన్న సినిమా చాలా సంవత్సరాల క్రితమే తీశారు(1958) ఎన్టీఆర్ సావిత్రి హీరో హీరోయిన్లు. చక్కని సినిమా. వేదాంతం రాఘవయ్య గారు దర్శకులు. ఇదే పేరిట ఒక జీడిపాకం టీవీ సీరియల్ కూడా ఉన్నట్టు గుర్తు.
లోగుర్తు పెరమాళ్ళకెరుక అని ఏకంగా సినిమానే. ఉంది కె.ఎస్. ఆర్. దాస్ గారికి దర్శకుడిగా ఇది తొలి సినిమా ఇది. సూపర్ ఫట్. శోభన్ బాబు-రాజశ్రీ.
భగవంతుడు అయిన శ్రీమన్నారాయణ మనందరిలో కొలువై ఉన్నాడు ఎలా ఉన్నాడో ఆయనే భగవద్గీతలో చెప్పుకున్నాడు.
” అహం వైశ్వానరో భూత్వా ప్రాణినం దేహమాశయః “
మనలో ఆత్మ రూపంలో అగ్నిలా వెలుగుతుంటాడు పరమాత్మ. మనం దేన్నీ ఎంతగా దాచాలని చూసినా ఆయనకు తెలుస్తుంది ఏదో ఒకనాడు మన గుట్టునయనా బయట పెట్టేస్తాడు. పెరుమాళ్ళు అని తెలుగు సినిమా నటుడుండేవాడు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నమ్మకస్తుడైన పనివాడి పాత్ర ఆయనకే ఇచ్చేవారు. జయంతి పబ్లికేషన్ అధినేత మువ్వల పెరమాళ్ళు గారు ఉత్తమ సాహిత్యాన్ని సమాజానికి అందించిన మహనీయుడు ఆయన.
అసలు దాపరికం ఎందుకు? మనలో ఏదో గిల్టీనేస్ ఉంటేనే దాపరికం దాపరిస్తుంది. రాజకీయాల్లో దాపరికాన్ని ఒక సిద్ధాంతంగా పేర్కొన్నాడు ఫ్రాన్సిస్ బేకన్. మరీ అవసరమైతే తప్ప దాపరికం కూడదన్నాడాయన. ఇంటిగుట్టు బయట పెట్టి లంకకు చేటు తెచ్చినవాడు విభీషణుడు. ఇంటికి గుట్టు, మడికి గట్టు అన్నారు వేమన. అయితే దీన్ని వేదాంతంగా చెప్పాడు
ఆ.వె. ఆశల తెగ గోసి అనలంబు చల్లార్చి
గోచి బిగియగట్టి కోపమడచి
గుట్టు విరువాడు గురువుకు గురువురా
అంటే తన గుట్టును కాపాడుకునేవాడని ఆయన పొగిడాడు ! ఎంత దాచినా, అన్నీ తెలిసినవాడు, అదేనండి పెరమాళ్ళుగారు ఒకరున్నారు అనేది మనం మరువ కూడదు.
సో, ఇంకో సామెతతో వచ్చేవారం.
6.సుభానీయం (శీర్షిక)

మందగిస్తున్న మానవుని మధనం
బద్దకం దారి పడుతున్న మనిషి ఆలోచన
అలసట లేమితో దూసుకుపోతున్న యంత్రం
ఈ మధ్య కాలంలో యంత్రాలు మాట్లాడుతున్నాయి, రాస్తున్నాయి, ఆలోచిస్తున్నాయి. మనుషులు మాత్రం విని నమ్ముతున్నారు, చదివి షేర్ చేస్తున్నారు, ఆలోచనని వాయిదా వేస్తున్నారు. ఏఐ వచ్చిన క్రమంలో ఉద్యోగాలు పోతాయన్న భయం ఉంది. కానీ పోతున్నది ఉద్యోగాలా.. లేక ఆలోచించే అలవాటా అన్నది ఎవ్వరూ అడగడంలేదు.
ఒక బటన్ నొక్కితే సమాధానం వస్తుండటంతో ప్రశ్న వేయాల్సిన బాధ్యతను మనిషి మరిచిపోతున్నాడు. యంత్రం చెప్పింది నిజమా కాదా అన్న సందేహం కంటే, అది మనకు నచ్చిందా లేదా అన్నదే ప్రమాణంగా మారింది. ఇప్పుడు వార్త చదవడం కాదు.. హెడ్ లైన్ చూసి తీర్పు చెప్పడం అలవాటైంది. వ్యాసం చదివే ఓపిక లేదు, కామెంట్ పెట్టే ఉత్సాహం మాత్రం మించిపోయింది.

ఏఐ మనిషిలా మారుతోందని భయపడుతున్నాం. కానీ మనిషే యంత్రంలా మారుతున్నాడన్న విషయం పట్టించుకోవట్లేదు. తప్పు జరిగితే యంత్రాన్ని నిందిస్తాం. సరైన పని జరిగితే మాత్రం మన తెలివిని ముద్దాడుకుంటాం. ఏదో దేశంలో బాంబు పడితే న్యూస్. మన చుట్టూ ఆలోచన చచ్చిపోతే అది నార్మల్. ఏఐకి భావోద్వేగాలు లేవంటారు. మనకు మాత్రం అవి సెలెక్టివ్గా ఉన్నాయి. మన అభిప్రాయానికి అనుకూలంగా ఉంటే సున్నిత మనసు. వ్యతిరేకంగా ఉంటే దేశద్రోహం.
యంత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పదంటారు. కానీ నిజాన్ని దాచే మనుషుల్ని మాత్రం అది బాగా అనుకరిస్తోంది. చివరికి ఏఐ మన పని తీసుకుంటుందా అన్న భయం కంటే, మన ఆలోచనల్ని మనమే అప్పగించుకుంటున్నామా అన్న ప్రశ్న పెద్దది. ఎందుకంటే యంత్రం తయారైంది మన కోసం. కానీ మనిషి మాత్రం ఇప్పుడు యంత్రం సౌలభ్యం కోసం తయారవుతున్నాడు.
============================================================================
7. తెలుగు మీడియం ముద్దు — ఆంగ్ల మీడియం వద్దు!
ఏది వితండ వాదం? ఏది ప్రజామోదం?! పేద ప్రజల వైపు నిలబడిన ప్రజా నాయకుడు ఎవరు?ఇటీవల మాతృ భాష తెలుగులో మొత్తం విద్యాభ్యాసం జరిగితే బాగుంటుంది అని ఒక చిన్న పుస్తకం, కొన్ని వ్యాసాలు చదివాను! అభిప్రాయాలు బాగున్నాయి. తెలుగు ఒక ఎమోషన్. “తెలుగు దేలయన్న దేశంబు తెలుగు…దేశ భాషలందు తెలుగు లెస్స!” మన భాష, మన యాస, మన కవిత్రయం, పోతన, శ్రీనాధుడు, ధూర్జటి, గురజాడ, శ్రీశ్రీ, కాళోజీ…, మన సాహిత్యం, మన ఔన్నత్యం, మన సంస్కృతి….! నిజం. ఎన్నో మాటలు అభిప్రాయాలు ఎంతో బాధ్యతతో, సమాజం మీద ప్రేమతో, ముఖ్యంగా పిల్లల మీద ఆపేక్షతో రాశారు, ఇంకా రాస్తున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. నిజం వెనుక నిజాలు ఒక్కసారి చూద్దాం!
కొన్ని అభిప్రాయాలు వెనుక శాస్త్రీయత గురించి చర్చ జరగాలి,
ప్రత్యేకంగా కలోనియల్ రూల్ (Colonial Rule) లో సుమారు 250 సంవత్సరాలు గడిపిన దేశం మనది.
ఫ్రెంచ్ & మొఘల్ లు వారు కూడా పరాయి వారే! (ఆ కాలం కూడా లెక్కేస్తే ఇంకా ఎక్కువ).
కానీ ఆంగ్ల ప్రభావం మన దేశంలో ఎక్కవ. (In majority States)
అలాగే బ్రిటన్ ఎన్నో దేశాలను పాలించింది!
మాతృభాష గురించి చెప్పిన అభిప్రాయాలు 98 శాతం కరెక్ట్!
మాతృ భాషలో Higher education వరకూ చదువుకునే environment ఒక దేశంలో పూర్తి స్థాయిలో ఉంటే ఎంతో అదృష్టం!
అలాగే పూర్తి ఉపాధి అవకాశాలు కూడా చదివిన అందరికీ (!) కలగాలి! (కానీ సాధ్యమా?!)
ఈ ఊహ చూడండి,
ఒక తెలుగువాడు ఐదు లేదా పది సంవత్సరాలు తెలుగు తల్లితండ్రులు దగ్గర ఉండి,
ఆరో ఏడు నుండి లేదా పదకొండో ఏడు నుండి తమిళ మీడియంలో లేదా ఫ్రెంచ్ మీడియంలో (అప్పటి వరకు ఒక్కసారి కూడా వినని భాషలో) చదువుకోవడం మొదలు పెడితే…అది షాక్! అత్యంత ప్రమాదం! తప్పు.
కానీ ఆంగ్లం మాత్రం మన దేశంలో ప్రత్యేక పరిస్థితిలో ఉంది. ప్రజల జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మమేకం అయ్యి ఉంది.
నేటి సోషల్ మీడియా యుగంలో మరెంతో అంతర్భాగం అయ్యి ఉంది! టీవీ, ఇంటర్నెట్…
బెండపూడి విద్యార్థులు ట్రైనింగ్ ఇచ్చినా కూడా అంత Accent తో అలా మాట్లాడడం ఒక అద్భుతం. అది ఒక ప్రసంగమే అయ్యి ఉండవచ్చు.
అయినా కూడా. English తో అవసరం అనుకుంటే exposure అంత తేలిగ్గా దొరుకుతోంది!
అప్పటి జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధగా దీనిని భావించాలి. మంచిని మంచిగా చూడాలి!
ఆగ్లం అర్థం చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు!
తెలుగు గొప్పదనం, నుడికారం, భాషతో వచ్చే సంస్కారం, సంస్కృతి…., నిజమే…చాలా నష్టం జరిగే అవకాశాలు కొంత ఉండవచ్చు.
కానీ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి జరగక పోవడానికి భాషతో పాటు ఇంకా వంద కారణాలు ఉన్నాయి!
దీనికి మొత్తం సమాజం బాధ్యత వహించాలి! ఒక్క విద్యా లోకమే అంటే కుదరదు!
కానీ మధ్య తరగతి, ఎగువ మధ తరగతి కుటుంబాలు, ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబాలు ..( Middle, above middle class families, elite communities) మన దేశంలో…., ఇంగ్లీష్ తో మమేకం అయిపోయి ఉన్నాయి!
ఎన్నో ఆంగ్ల పదాలు తెలుగు భాషతో కలిసిపోయాయి! ఎన్నో ఆదాన ప్రధానాలు జరిగాయి!
తెలుగు భాషను రక్షించాల్సిన బాధ్యత కేవలం పేద విద్యార్థులు మీదే ఉంది అనే వాదం అత్యంత హేయమైనది! లేదా పేద కుటుంబాల మీదే ఉంది అనే రాజకీయ (Practical ground argument ) వాదన మహా పాపం. నీచం!
ఈ విషయంలో ఎంతో మంచి చేద్దాం అనుకున్న అప్పటి ఆంధ్ర ప్రదేశ్ జగన్ ప్రభుత్వం ఈ విషయం సరిగ్గా ప్రజలకు వివరించడంలో వెనుక పడి రాజకీయంగా నష్టపోయింది!
నేను చదివిన వ్యాసాలు అలా అనలేదు లెండి! కానీ అంతర్గతంగా ఏదో రాజకీయ వాసన!!
ఒక్క విషయం ఆలోచించండి,
కనీసం Gujarat లో లేదా మహారాష్ట్ర లో ఒక్క Corporate school లో మరాఠీ మీడియం, గుజరాతీ మీడియం చూపించండి! IB & Cambridge curriculums లో కూడా తెలుగు మీడియం కావాలి అని మీరు అడుగుతున్నారా?!
—
జర్మనీ, జపాన్, నార్వే , ఫిన్లాండ్…దేశాల పరిస్థితి వేరు.
కలోనియల్ రూల్ కి తక్కువ ప్రభావం అయిన దేశాలతో మన దేశ పరిస్థితులు పోల్చవొద్దు!
—
మార్క్సిజం డైరెక్ట్ గా కులాల పద్మ వ్యూహం లో చిక్కుకున్న మన దేశ ప్రత్యేక పరిస్థితులకు యధాతథంగా ఎలా నప్పద్దో, ఇమడదో ….ఇదే అంతే!
—
జర్మనీ, జపాన్ దేశాల్లో ఉపాధి అవకాశాలు వెంటనే ఆ దేశ విద్యార్థులకు దొరుకుతున్నాయి.
మన దగ్గర Non-sense. నిజమైన జ్ఞానం లేకపోయినా…, కేవలం High-fi English మాట్లాడడం వల్ల నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు జీతంలో ఉన్నవారు నాకు తెలుసు!
ఎంతో జ్ఞానం ఉండి, ఆంగ్లంలో ప్రావీణ్యత లేకపోవడం వల్ల ఆత్మ విశ్వాసం కోల్పోతున్న వారు, ఆత్మ న్యూనతా భావంతో కుంగిపోతున్నవారు ఎందరో!
ఆంగ్లం రాకపోతే వారిని తక్కువ కులం వారిగా కూడా కొందరు గుర్తిస్తున్నారు అని నాతో ఎవరో అన్నారు! వాస్తవాలు మీరు కనుక్కోండి!
బ్రతుకు భయం, సామాజిక పరిస్థితులు ఆంగ్లం వైపు ప్రజలను నడిపిస్తున్నాయి!
గవర్నమెంట్ స్కూల్ ఉచితం, అన్నం ఉచితం, బట్టలు ఉచితం! షూస్ అన్నీ ఫ్రీ! కానీ పిల్లలు రారు! ఒక్క ఎమ్.ఎల్. ఏ. కొడుకు, మంత్రి కొడుకు, కలెక్టర్ కొడుకు ప్రభుత్వ బడిలో చేరడు.
తెలుగు భాషను, సంస్కృతిని రక్షించాల్సిన బాధ్యతను వారు తీసుకోరు!
అక్కడ అన్నీ ఉచితం…
అయినా లక్షలు అప్పు చేసి, ఉన్నా లేకపోయినా మన దేశంలో ప్రజలు ఎందుకు Private Schools కు పంపుతున్నారు! ???
సామాజిక, ఆర్థిక, మానసిక, వాస్తవ…పరిస్థితులు ఎన్నో అర్థం చేసుకోవాలి!
ఒక ఎమోషన్ తో గాలిలో అభిప్రాయాలు చెప్పడం చాలా తేలిక.
అమ్మ, మాతృభాష, రైతు కష్టం, పేదవాళ్ళు…., ఈ మాటలు చుట్టూ సినిమా కథలు, ఉపన్యాసాలు, వ్యాసాలు…. నిజం అనిపిస్తాయి! దానికి రాజకీయ లాభాలు కూడా ఉంటే అంతా కలగాపులగం!
నాకు తెలుగు భాష ఎంతో ఇష్టం! ప్రేమ! ఆరాధన! ఆ సాహిత్యం నా రక్తంలో ఉంది!
అయినా వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాలి! రాజకీయాలకు అతీతంగా ఆంగ్ల విద్య అవసరం గుర్తించాలి, ముఖ్యంగా పేద ప్రజలకు! అలాగే గొప్ప తెలుగు కూడా నేర్పాలి!
స్వాతంత్రం వచ్చాకా, కేవలం ఆంగ్ల భాష రాకపోవడం వల్ల ఎన్నో కులాలు, పేదలు, దళితులు మన దేశంలో నష్టపోయారు!
తిండి, ఆత్మ గౌరవం, బ్రతుకు భరోసా చూపించని మాతృ భాష మాకు ఎందుకు అని పేద ప్రజలు ప్రశ్నిస్తున్నారు! వారికి ప్రాక్టికల్ సమాధానం చెప్పాలి! పరిష్కారం చూపించాలి!
సంస్కృతిని, భాషను, ఔన్నత్యాన్ని రక్షించాల్సిన బాధ్యత కేవలం పేద విద్యార్థులు, పేద కుటుంబాల పైనే ఉందా?
ఒక్క Corporate School లో కనీసం ఒక్క Corporate school లో తెలుగు మీడియంలో మాత్రమే మేము బోధిస్తాము, ఆగ్లం ఒక Subject గా ఉంటుంది! అని తెలుగు మీడియం స్కూల్స్ మొదలు పెట్టమనండి!
పోనీ ఉన్న కార్పొరేట్ స్కూల్స్ లో ఒక్కదానిలో అన్నా పూర్తి తెలుగు మీడియం లో విద్యా బోధన మొదలు పెట్టేలా ఒప్పించండి! ప్రస్తుత ప్రభుత్వాలను ఆ రకంగా చర్యలు తీసుకోమనండి!
ఎందరు తల్లిదండ్రుల నుంచి ఎంత స్పందన ఉంటుందో చూపించ మనండి!
పోనీ ఈ వ్యాసాలు రాసే, మాట్లాడే వాళ్ళని ఒక వంద కోట్లు పెట్టీ ఒక స్కూల్ ఇలా తెలుగు మీడియంలో మొదలు పెట్ట మనండి!
ఇంత పేద దేశంలో, ఇంత నిరుద్యోగ సమస్య, దోపిడీ, అవినీతి, ద్వంద్వ నీతి ఉన్న, దేశంలో, (దేహంలో…. కూడా)…ఒక మాఫియా సామ్రాజ్యం, ప్రభుత్వం వెనుక, ప్రభుత్వం వెనుక చీకటి శక్తులు ఉండి…., నడుస్తున్న కాలంలో…
మంచి మాటలు ఎవరు వింటారు. మంచి మాటలు కూడా అన్ని దిశలకు తిరిగి, విహంగ వీక్షణం చేసి, అన్నీ ఆలోచించి, Pros & Cons…., మేం మంచి మాటలమే అని శీల పరీక్షకు, అగ్ని పరీక్షకు సీతలా నిలబడి…, అప్పుడు ప్రజల ముందుకు రావాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితుల్లో మనం ఉన్నాము.
చెప్పేవారే కానీ వినేవారు లేరు. “యత్ర యోగేశ్వర: కృష్ణో….”
నేటి పరిస్థితుల్లో సత్య దూరం!
నీతులు చెప్పడమే, పాటించరు!
అన్నీ ఉన్నప్పుడే.”…తామేవ విదధామ్యహం”
ఉన్నత విద్యను పరిశ్రమలతో అనుసంధానం చేయడం చాలా గొప్ప పద్ధతి. దీని మీద 25 సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. నేను కూడా ఒక యోగా గురువుగా, జర్నలిస్టుగా, ఒక రచయితగా, టీచర్ గా భాగం వహించాను! ఇంకా వహిస్తాను!
నాలాంటి ఎందరో సైనికుల్లా పని చేస్తారు!
ఇంకా ఎంతో చర్చ జరగాలి! Brainstorm.
తెలుగు మాతృ భాషగా ఉండాలి అని మంచి అభిప్రాయాలు వెలిబుచ్చే అందరికీ కృతజ్ఞతలు. కానీ …ఆగ్లం అత్యంత అవసరం! అది కూడా అర్ధం చేసుకుందాం!
సర్వేజనాసుఖినోభవంతు! ఓం శాంతి!
శ్రీనివాస రాజు పెన్మెత్స
9550 981 531(థియేటర్ పి.హెచ్.డి. రిసెర్చ్ స్కాలర్)
________________________________________________________________
8.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

తిరుమలేశుని అర్చకత్వ చరిత్ర
వినరో భాగ్యము వైకుంఠ వైభవము
తిరుమలేశుని అర్చకత్వ చరిత్ర
అలిగి వైకుంఠం వీడిన లక్ష్మి కోసం భూలోకం చేరుకున్న శ్రీమహావిష్ణువు వరాహ క్షేత్రంలోని వెంకటాచలంపై వేల సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలిసినట్టు వేంకటాచల మహాత్య్మ పురాణం పేర్కొంటోంది.
తొలుత వైఖానస ఆగమనానికి మూలపురుషుడైన భృగు మహర్షి వంశీకుడైన గోపీనాధాచార్యులు అనే వ్యక్తికీ కలలో కనిపించి పుట్టలో ఉన్న తిరుమలేశుని మూలమూర్తి గురించి స్వామి చెప్పినట్టు కూడా పురాణం తెలియచేస్తోంది.
తొండమాన్ చక్రవర్తి నిర్మించిన గర్భాలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్య పూజా కైంకర్యాల నిర్వహణతో దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం గోపీనాధ దీక్షితులు తిరుమలేశుని తొలి అర్చకులయ్యారని స్థలపురాణాలు తెలియచేస్తున్నాయి.
ఆ గోపీనాథ దీక్షితుల వారసత్వానికి చెందిన వారే నేటికీ స్వామి వారి అర్చకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆ వంశపారంపర్య అర్హతను పైడిపల్లి, గొల్లపల్లి, పెద్దింటి, తిరుమతమ్మ అనే నాలుగు కుటుంబాలకు చెందిన వారే అర్చక మిరాశీ దారులుగా కొనసాగుతున్నారు.
11వ శతాబ్దంలో తిరుమల క్షేత్ర విధివిధానాలను నిర్ధేశించిన వైష్ణవ మతాచార్యులు పూజ్య రామానుజులు కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాంచరాత్ర ఆగమనానికి చెందిన వారిని కాకుండా అనువంశికంగా వస్తున్న వైఖానస ఆగమానికి చెందినవారికే అర్చకత్వం ఉండాలని నిర్ధేశించారు. అయితే స్వామి వారి ఆలయంలో నిత్య సేవా కైంకర్యాలను పర్యవేక్షణ బాధ్యతలను చూసేందుకు పాంచరాత్ర ఆగమనానికి చెందిన జీయర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
తరతరాలుగా స్వామి నిత్యసేవాకైంకర్యాలను వైఖానస ఆగమనానికి చెందిన నాలుగు కుటుంబాల వంశీకులే నిర్వహిస్తుండగా, పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం జీయర్ మఠం నిర్వహిస్తూ వస్తోంది
ఓం నమో వేంకటేశాయ
మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

