18th Division | సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం…

18th Division | సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం…
18th Division | కృష్ణలంక, ఆంధ్ర ప్రభ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ గృహకల్ప పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారికి రూ. 2,50,000 ఆర్థిక సహాయం అందజేసి పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు.బుధవారం ఉదయం రాణిగారితోట 18వ డివిజన్ లో ఎన్టీఆర్ గృహం లబ్ధిదారులు మెడి బోయిన భాగ్యలక్ష్మి-వెంకటేశ్వర్లు గృహా శంకుస్థాపన కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్ పాల్గొని పనులు ప్రారంభించారు.
ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రతి పేద కుటుంబానికి గౌరవ ప్రదమైన సొంతింటి నిర్మాణానికి బలమైన ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సమర్థవంతమైన పాలన వల్ల గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగవంతమయ్యాయని తెలిపారు. పేదల గృహ స్వప్నాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇంటి స్థలం ఇప్పటికే కలిగి ఉండి, ఇల్లు కట్టుకోవాలనే సంకల్పంతో ఉన్న ప్రతి అర్హుడికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎంతమంది అర్హులు ముందుకు వస్తే అంతమందికి ఇళ్ల మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పేదల సంక్షేమం విషయంలో ఎలాంటి పరిమితులు విధించకుండా, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.ఈ కార్యక్రమం లో 18వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు కొక్కిరి తిరుపతయ్యా, బలగానీ శ్రీను, గోగుల ఏసు, వేముల దుర్గ రావు,దుర్గ, గండ్ర రాజు, డివిజన్ కు చెందిన టిడిపి నాయకులు కార్యకర్తకులు తదితరులు పాల్గొన్నారు.
