11thJan2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

11thJan2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

11thJan2026 ఈ సంచికలో…

1 ముఖపత్ర కథనం

2 మనసు-మాట (శీర్షిక)

3 కబుర్లు (శీర్షిక)

4.అద్దంలోని ముఖం(కథ)

5.సన్నిహితం… శీర్షిక)

6.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

7.వినరో భాగ్యము – శీర్షిక

11thJan2026

1 ముఖపత్ర కథనం

క‌న‌క‌వ‌ర్షిణికి కాసుల వ‌ర్షం..

కోరిక‌లు తీర్చే క‌ల్ప‌వ‌ల్లికి ముడుపుల మ‌ణిహారం..
దుర్గ‌మ్మ హుండీ కానుక‌ల లెక్కింపు మ‌హాకార్యం..
భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో, సేవా నిర‌తితో సిబ్బంది లెక్కిస్తున్న వైనం..
సేవ‌కుల‌కూ లభించిన అవ‌కాశం..
బంగారుత‌ల్లికి ప‌సిడి వెలుగులు..
చ‌ల్ల‌ని త‌ల్లికి వెండి ధ‌గ‌ధ‌గ‌లు…
కామిత ప్ర‌దాయినికి విదేశీ క‌రెన్సీ క‌ట్ట‌లు..

ప‌విత్ర కృష్ణాన‌దీ తీరంలో ఇంద్ర‌కీలాద్రిపై భ‌క్తుల కోరిక‌లు తీర్చే క‌ల్ప‌వ‌ల్లిగా క‌న‌క‌దుర్గ‌మ్మ కొలువై ఉంది. దుర్గ‌తుల‌ను పార‌ద్రోలి స‌ద్గ‌తుల‌ను ప్ర‌సాదించే చ‌ల్ల‌నిత‌ల్లిగా ల‌క్ష‌లాది మంది ఆరాధ్య దేవ‌త‌గా భాసిల్లుతోంది. ఈతి బాధ‌లను తొల‌గించే కామిత‌ప్ర‌దాయినిగా క‌రుణా క‌టాక్షాల‌ను ప్ర‌సాదిస్తోంది. క‌ష్టాల క‌డ‌లిలో కొట్టుమిట్టాడుతున్న భ‌క్తుల‌కు ఆమె అభ‌య ప్ర‌దాయినిగా నిలుస్తోంది. క‌న‌క వ‌ర్షం కురిపించే క‌న‌క‌దుర్గ‌మ్మ భ‌క్తుల పాలిట కొంగుబంగారంగా వెలుగొందుతోంది. ఇంద్ర గిరుల‌పై స్వ‌యంభువుగా వెలిసిన జ‌గ‌న్మాత విజ‌య‌వాటికా పురాదీశ్వ‌రిగా పూజ‌లందుకొంటోంది. అమ్మ‌వారికి భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌ల లెక్కింపును కూడా ఇక్క‌డ మ‌హా కార్యంగా పరమ పవిత్రంగా అధికార యంత్రాంగం నిర్వ‌హిస్తోంది.

మ‌హిమాన్విత క్షేత్రం…

ఇంద్ర‌కీలాద్రిపై కొలువుదీరిన క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యానికి వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉంది. క‌న‌క‌దుర్గ‌మ్మ ఈ క్షేత్రంపై స్వ‌యంభువుగా వెలిసి భ‌క్తుల కోరిక‌లు నెర‌వేర్చే క‌ల్ప‌వ‌ల్లిగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు. స్థ‌ల పురాణం ప్ర‌కారం కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి ఘోర తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షం కాగా, ఆమెను తన హృదయస్థానంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండమని కోరాడు. అప్పుడు అమ్మవారు. కృతయుగంలో రాక్షస సంహారం ముగించిన తర్వాత నేను నీపై స్వయంభువుగా వెలుస్తాను” అని వరమిచ్చారు. కీలుడు పర్వతముగా మారినందువల్ల ఆ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చిన‌ట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

స్వ‌యంభువుగా క‌న‌క‌దుర్గ‌మ్మ‌..

లోకకంటకుడైన మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి దేవతలందరూ తమ శక్తులను ధారపోసి అమ్మవారిని సృష్టించిన‌ట్లు మ‌రో క‌థ‌నం ప్ర‌చారంలో ఉంది. జ‌గ‌న్మాత మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతిని చేకూర్చింది. సంహారం అనంత‌రం అమ్మ‌వారు ఇంద్ర‌కీలాద్రిపై ఎనిమిది చేతులతో, ఆయుధాలను ధరించి, సింహవాహినిగా వెలిసింది. ప‌సిడి ఛాయతో క‌న‌క‌దుర్గ‌మ్మ మెరిసిపోతూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తుండ‌డంతో అమ్మ‌ను క‌న‌క‌దుర్గ‌మ్మ‌గా భ‌క్తులు పిలుస్తార‌న్న క‌థ‌నం కూడా ప్రాచుర్యంలో ఉంది. అలాగే మాధ‌వ‌వ‌ర్మ అనే రాజు కుమారుడు ర‌థం న‌డుపుతుండ‌గా దాని కింద ప‌డి ఓ బాలుడు మృతి చెందుతాడు. ఈ ఘ‌ట‌న‌పై బాలుడి త‌ల్లి రాజుకు ఫిర్యాదు చేయ‌గా ధ‌ర్మ ప‌రిపాల‌న ద‌క్షుడైన మాధ‌వ‌వ‌ర్మ త‌న కుమారుడికి మ‌ర‌ణ‌శిక్ష విధిస్తాడు.

అత‌డి స‌త్య‌నిష్ట‌కు మెచ్చి క‌న‌క‌దుర్గ‌మ్మ మృతి చెందిన బాలుడితోపాటు, రాజు కుమారుడిని బ‌తికించి క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తోంది. అప్ప‌టినుంచి అమ్మవారు క‌న‌క‌దుర్గ‌మ్మ‌గా భ‌క్తుల కొంగుబంగారంగా వెలుగొందుతోంది. అలాగే ద్వాప‌ర‌యుగంలో అర్జునుడు శివుడి కోసం త‌పస్సు చేసి ఆయ‌న‌తో యుద్ధం చేసి పాశుప‌తాస్త్రాన్ని సంపాదించాడు. అర్జునుడు విజ‌యం సాధించిన ప్రాంతం కావ‌డంతో ఈ న‌గ‌రానికి విజ‌య‌వాడ‌గా పేరు వ‌చ్చింద‌ని పురాణ క‌థ‌ల ద్వారా తెలుస్తోంది. ఒక‌ప్పుడు అమ్మ‌వారు చాలా ఉగ్ర‌రూపంలో ఉండేవారు. జ‌గ‌ద్గురు ఆదిశంక‌రాచార్యులు ఈ క్షేత్రాన్ని సంద‌ర్శించి అమ్మ‌వారి ఉగ్ర‌రూపాన్ని శాంతింప‌జేయ‌డానికి ఇక్క‌డ శ్రీ‌చ‌క్రాన్ని ప్ర‌తిష్ఠింప‌జేయ‌డంతో అప్ప‌టినుంచి అమ్మ‌వారు ప్ర‌స‌న్న రూపిణిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నారు.

చ‌ల్ల‌ని త‌ల్లికి ముడుపుల మ‌ణిహారం…

ఇంద్ర‌కీలాద్రిపై స్వ‌యంభువుగా వెలిసిన క‌న‌క‌దుర్గ‌మ్మ భ‌క్తుల కోరిక‌లు తీర్చే క‌ల్ప‌వ‌ల్లిగా వెలుగొందుతోంది. అమ్మ క‌రుణా క‌టాక్షాలు పొందిన భ‌క్తులు ముడుపులు క‌ట్టి మొక్కుబ‌డులు చెల్లించుకుంటారు. శ‌ర‌ణాగ‌తి భావానికి ప్ర‌తిరూపంగా కానుక‌ల‌ను హుండీల్లో వేసి ఆధ్యాత్మికానుభూతిని పొందుతారు. ప్ర‌తి కానుక వెన‌క ఓ క‌న్నీటి క‌థ ఉంటుంది. పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం తల్లిదండ్రుల కన్నీళ్ల ప్రార్థనలు, విద్యార్థి విజ‌యం కోసం సంక్ప‌లాల చిట్టీలు, నిరుద్యోగి యువ‌కుడి ఉద్యోగం కోసం అమ్మ‌కు అర్జీ, త‌ల్లి ఆరోగ్యం చేకూర్చాలంటే కుమార్తె విన్న‌పం ఇలా రూపం ఏదైనా భ‌క్త జ‌న హృద‌యాంత‌రాల‌లో దాగి ఉన్న అనేక భావోద్వేగాల ప్ర‌తిరూపంగా ముడుపులు ఉంటాయి.

పవిత్రంగా హుండీ కానుక‌లు…

ఇంద్ర‌కీలాద్రిపై కొలువై ఉన్న క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో భ‌క్తులు ఎంతో భ‌క్తితో కానుక‌ల‌ను హుండీల్లో వేయ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంది. 1947 నుంచి శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామి వార్ల దేవ‌స్థానంలో భ‌క్తులు హుండీల్లో వేసిన కానుక‌ల లెక్కింపు కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. క‌న‌క‌దుర్గ‌మ్మ కానుక‌ల లెక్కింపు భ‌క్తి, శ‌ర‌ణాగ‌తి,కృపా క‌టాక్షాల అమృత ఘ‌ట్టంగా ఆవిష్కృత‌మ‌వుతోంది. హుండీల్లో కేవ‌లం నాణేలు, క‌రెన్సీ నోట్లే కాకుండా అనేక హృద‌యాల క‌థ‌లు దాగి ఉంటాయి. శ‌ర‌ణాగ‌తి భావానికి ప్ర‌తిరూపంగా భ‌క్తుల లేఖ‌లు అనేకం హుండీల్లో ద‌ర్శ‌న‌మిస్తాయి.

ప‌విత్రం…పార‌ద‌ర్శ‌కం..

అమ్మ‌వారి ప్ర‌ధాన ఆల‌యంతోపాటు ఉపాల‌యాల్లో దేవ‌స్థానం అనేక హుండీల‌ను ఏర్పాటుచేసింది. ఈ హుండీల్లో భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల లెక్కింపు కార్య‌క్ర‌మం ఎంతో ప‌విత్రంగా, పార‌ద‌ర్శ‌కంగా దేవ‌స్థానం చేప‌డుతోంది.
ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది భక్తి వినయంతో లెక్కింపులో పాల్గొంటారు. ప్రతి దశలో నిబంధనలను పాటిస్తూ, సంపూర్ణ పారదర్శకతతో ఈ ప్రక్రియ కొనసాగింది. లెక్కింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖంలోనూ అమ్మవారి సేవలో ఉన్నామనే తృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.

లెక్కింపు ఇలా…

క‌న‌క‌దుర్గ‌మ్మ ప్ర‌ధాన ఆల‌యం, న‌ట‌రాజ‌స్వామి ఆల‌యం, నాగ పుట్ట‌, మ‌ల్లేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ఆల‌యం, కామ‌ధేను అమ్మ‌వారి ఆల‌యం, ఆంజ‌నేయ‌స్వామి గుడి ఇలా ప‌లు ప్రాంతాల్లో శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి వార్ల దేవ‌స్థానం హుండీల‌ను ఏర్పాటుచేసింది. ఈ హుండీల్లో భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌ను ప్ర‌తి 15 రోజుల‌కొక‌సారి లెక్కింపు ప్ర‌క్రియ చేప‌డుతారు. ర‌ద్దీ అధికంగా ఉండే శుక్ర‌, ఆదివారాలు మిన‌హాయించి ఇత‌ర రోజుల్లో ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంది. ముందుగా దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌, రీజ‌న‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ అనుమ‌తి తీసుకొని వారి సూచ‌న‌ల ప్ర‌కారం లెక్కింపు తేదీల‌ను నిర్ణ‌యిస్తారు. ముఖ్యంగా లెక్కింపు ప్ర‌క్రియలో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పాల్గొంటారు. లెక్కింపులో కేవ‌లం పురుషుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు. వీరికి అద‌నంగా సేవ‌కుల సేవ‌ల‌ను కూడా వినియోగించుకుంటోంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌నే ఆస‌క్తి ఉన్న సేవ‌కులు ముందుగా రిజిస్ట్ర‌ర్ కావాల్సి ఉంటుంది. వీరికి ప్ర‌త్యేకంగా ఒక ఐడీ కార్డును దేవ‌స్థానం మంజూరు చేస్తోంది. ఈ ప్ర‌క్రియ అంతా ఆన్‌లైన్ వేదిక‌గా జ‌రుగుతుంది. దేవ‌స్థానం సిబ్బంది, సేవ‌కుల‌తోపాటు అద‌న‌పు సిబ్బంది కూడా లెక్కింపులో పాల్గొంటారు. ఎస్‌ఫీఎప్ సిబ్బంది ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తారు. ఈ లెక్కింపులో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సుమారు 80 మంది పాల్గొంటారు.

కానుక‌ల త‌ర‌లింపు..

భక్తులు అమ్మవారికి సమర్పించే కానుకల హుండీ కానుక‌ల లెక్కింపు రోజు ముందుగా ప్ర‌ధాన ఆల‌యం, ఉపాల‌యాల్లో ఉన్న హుండీల వ‌ద్ద‌కు ఉన్న‌తాధికారులు చేరుకొని సీలును తొల‌గిస్తారు. గోనె సంచుల్లో హుండీలో భ‌క్తులు స‌మ‌ర్పించిన చిల్ల‌ర నాణేలు, క‌రెన్సీ నోట్లు, విదేశీ క‌రెన్సీల‌తో పాటు ముడుపులను మూట‌క‌ట్టి కానుక‌ల‌ను లెక్కించే మ‌హా మండ‌పం ఆరో అంత‌స్తులోకి భారీ పోలీసు బందోబ‌స్తు న‌డుమ త‌ర‌లిస్తారు. వాటిని చిల్ల‌ర వేరు చేసే యంత్రాల్లో గోనె సంచుల మూట‌ల్లో క‌రెన్సీ, నోట్లు, చిల్ల‌ర‌ను పోస్తారు. ఆ యంత్రం సాయంతో చిల్ల‌ర నాణేల‌న్నీ విడిగా కింద ప‌డిపోగా క‌రెన్సీ నోట్లు, విదేశీ క‌రెన్సీ పైన ఉండిపోతాయి. చిల్ల‌ర నాణేల‌ను కొంత‌మంది, నోట్ల‌ను మ‌రికొంత మంది వేరు వేరుగా లెక్కిస్తుంటారు. తిరిగి నోట్లను మూట‌లో క‌ట్టి నోట్ల లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది ముందు రాశులుగా పోస్తారు. అక్క‌డ ఒక్కో మూటకు వ‌చ్చిన నోట్ల‌ను విలువ‌ల‌ను బ‌ట్టి వేరు చేసే ప్ర‌క్రియ చేప‌డుతారు. త‌ర్వాత 10 రూపాయ‌ల నోట్లు ఎన్ని వ‌చ్చాయి? 20, 50, 100, 200, 500 ఇలా విభ‌జించి వేటిక‌వి క‌ట్ట‌లు క‌డ‌తారు. అనంత‌రం నోట్ల కౌంటింగ్ యంత్రాల సాయంతో వాటిని గ‌ణ‌న చేప‌డతారు. అలాగే చిల్ల‌ర నాణేలు కూడా రూపాయి, రెండు రూపాయ‌లు, ఐదు రూపాయ‌లు, ప‌ది, 20 రూపాయ‌ల బిళ్ల‌ల‌తో డాల‌ర్లు, పౌండ్లు ఇలా విదేశీ నాణేల‌ను విడిగా లెక్కిస్తారు.

భారీగానే బంగారం, వెండి ఆభ‌ర‌ణ‌లు…

త‌మ కోరిక‌ల‌ను నెర‌వేర్చాల‌ని చ‌ల్ల‌ని త‌ల్లి చ‌ల్లగా చూడాల‌ని కోరుతూ ప‌లువురు భ‌క్తులు అమ్మ‌వారికి ముడుపులు కూడా హుండీల్లో స‌మ‌ర్పిస్తారు. బంగారు ముక్కుపుడ‌క‌, బొట్టు, తాళిబొట్లు, హారాలు, న‌ల్ల పూస‌లతో పాటు వెండి ఆభ‌ర‌ణాల‌ను హుండీల్లో వేస్తారు. మ‌రికొంద‌రు బంగారం బిస్కెట్లు, ముక్క‌లుగానూ స‌మ‌ర్పిస్తారు. ఇలా వ‌చ్చిన బంగారం, వెండి వ‌స్తువులు, గ్రాముల ముక్క‌ల‌ను లెక్కింపు జ‌రిగే ప్ర‌దేశంలో ఉండే గోల్డ్ స్మిత్ యంత్రం సాయంతో బంగారు నాణ్య‌త‌, బ‌రువు తెలుసుకొని దాని ధ‌ర నిర్ణ‌యిస్తారు. వెండి వ‌స్తువుల‌కు ఇదే ప్రాతిప‌దిక‌న చేప‌డ‌తారు.

విన్న‌పాలు విన‌వ‌మ్మా..దుర్గ‌మ్మా…

హుండీ కానుక‌ల లెక్కింపులో న‌గ‌దు, బంగారం, వెండితో పాటు భ‌క్తులు త‌మ కోరిక‌లు నెర‌వేర్చాల‌ని అమ్మ‌వారికి విన‌తులు ఇస్తూ లేఖ‌లు రాస్తారు. నా కుమారుడికి త్వ‌ర‌గా ఉద్యోగం వ‌చ్చేలా చూడ‌మ‌ని ఓ త‌ల్లి ప్రాథేయ‌ప‌డ‌గా, మ‌రో తండ్రి సొంత గూడు నిర్మించుకునేలా చూడ‌మ్మ అంటూ వేడుకుంటూ లేఖ రాస్తాడు. వృద్ధ త‌ల్లిదండ్రులకు సంపూర్ణ ఆరోగ్యం ప్ర‌సాదించ‌మ‌ని మ‌రొకకు విన్న‌విస్తారు. ఒకొక్క లేఖ‌లో వేల వేల హృద‌య వేద‌న‌లు ఆవిష్కృత‌మ‌వుతాయి. హుండీలో విన‌తి ఇస్తే స్వ‌యంగా ఆ అమ్మ‌వారికే ఇచ్చామ‌న్న భావ‌న‌తో ప‌లువురు హుండీల్లో లేఖ‌లు వేయ‌డం జ‌రుగుతోంది.

..భారీ భ‌ద్ర‌త‌ నడుమ..

హుండీల్లో ల‌భించిన బంగారు, వెండి వ‌స్తువుల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో భ‌ద్ర‌ప‌రుస్తారు. లెక్కింపు జ‌రుగుతున్నంత సేపు సీసీ కెమెరాలు, పోలీసుల బందోబ‌స్తుతో భారీ భ‌ద్ర‌త న‌డుమ ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. సీసీ కెమెరాల‌ను క‌మాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా దేవ‌దాయ శాఖ ఆర్జేసీ స్వ‌యంగా ప‌రిశీలిస్తారు. హుండీల్లో వ‌చ్చిన న‌గ‌దును లెక్కించిన త‌ర్వాత అక్క‌డ‌కు వ‌చ్చే బ్యాంకు అధికారుల‌కు అప్ప‌గిస్తారు. అలాగే పాత 500, 1000, 2000 నోట్ల‌ను వేరే ద‌గ్గ‌ర భ‌ద్ర ప‌రుస్తారు. రోజుకు 14 నుంచి 16 ల‌క్ష‌లు
క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యానికి నిత్యం 40 నుంచి 50 వేల మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. హుండీల్లో భ‌క్తులు రోజుకు 14 నుండి 16 లక్షల రూపాయలు కానుకలు వేస్తుంటార‌ని అధికారిక లెక్క‌ల ద్వారా స్ప‌ష్టమ‌వుతోంది. గ‌తేడాది ఏప్రిల్ నుంచి డిసెంబ‌రు వ‌ర‌కు హుండీ కానుక‌ల ద్వారా దేవ‌స్థానానికి రూ. 58,28,11,990 న‌గ‌దు ల‌భించింది. విదేశీ క‌రెన్సీ రూ. 10,40,879 గా ఉంది. కాగా 4.705 కేజీల బంగారం, వెండి 109.710 కేజీలను భ‌క్తులు స‌మ‌ర్పించారు

సతీష్ కుమార్ బొబ్బా

ఆంధ్రప్రభ బ్యూరో ఇంచార్జి, ఎన్టీఆర్ జిల్లా

_-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-_

2 మనసు-మాట శీర్షిక

చరిత మనసు మాట: నాకు పెళ్ళై 20 సంవత్సరాలయ్యింది. సంవత్సరం క్రితం ఆన్లైన్లో రాజేష్ తో పరిచయం ఏర్పడింది. ఆయనతో ఏదైనా మాట్లాడితే, చక్కగా వినేవారు మరియు నా అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేవారు. మా పరిచయం నెమ్మదిగా రోజూ సెక్స్ చాట్స్ మరియు ఫోటోలు పంపించుకునే వరకు వెళ్ళింది. శారీరికంగా కూడా చాలా సార్లు కలిసాము. నా ఫోను పిల్లలకి గాని నా భర్తకి గాని దొరకకుండా జాగ్రత్త పడేదాన్ని. మా వారికి నా మీద అనుమానం రావటంతో మా సంబంధం బయటపడింది. నా భర్త రాజేష్ని బెదిరించారు. మా వారు నేను ఏమి తక్కువ చేశాను నీకు అని ప్రశ్నిస్తూనే వున్నారు. మా మధ్య మానసిక సాన్నిహిత్యం తగ్గిందని చెప్పాలని ఉన్న చెప్పలేకపోతున్న.

ఆనంద్ మనసు మాట: నాకు పెళ్ళై 10 సంవత్సరాలయ్యింది. నా సహోద్యోగి అయిన మౌనికతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. తనతో ఎన్ని గంటలు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపించేది. మేము శారీరికంగా ఎప్పుడు కలవలేదు. మానసికంగా మా జీవితంలో జరుగుతున్నవన్నీ పంచుకొనేవాళ్ళము. ఆఫీస్లో ఆఫీస్ తర్వాత కూడ చాట్/కాల్స్ చేసుకొనేవాళ్ళము మరియు రీల్స్/మీమ్స్ షేర్ చేసుకొనేవాళ్ళము. ఒకరోజు ఈ చాట్స్ చూసి నా భార్య మాకు అక్రమ సంబంధం వుందని అనుమానించింది. మేము శారీరకంగా ఎప్పుడూ కలవలేదని చెప్పినా ఆ చాట్స్ పదే పదే చదువుకుని మీరు మానసికంగా నాకు ద్రోహం చేసారు అని నిందిస్తుంది. మా ఈ తగువులు వలన పిల్లలు కూడా బాధపడుతున్నారు

సైకాలజిస్ట్ మాట: సాన్నిహిత్యం(Intimacy) అనేది ఒక వ్యక్తి తన భాగస్వామితో లేదా ప్రియమైన వ్యక్తితో కలిగి ఉండే భావోద్వేగ సంబంధం, నమ్మకం, మరియు స్నేహం.
విభిన్న సాన్నిహిత్యాలు:

  1. భావోద్వేగ సాన్నిహిత్యం (Emotional Intimacy): భావాలు, భావోద్వేగాలు పంచుకోవడం.
  2. శారీరక సాన్నిహిత్యం (Physical Intimacy): శారీరక స్పర్శ, సాన్నిహిత్యం.
  3. మానసిక సాన్నిహిత్యం (Intellectual Intimacy): ఆలోచనలు, విచారాలు పంచుకోవడం.
  4. ఆధ్యాత్మిక సాన్నిహిత్యం (Spiritual Intimacy): ఆధ్యాత్మిక విషయాలు పంచుకోవడం.
  5. లైంగిక సాన్నిహిత్యం (Sexual Intimacy): లైంగిక సంబంధం.
  6. సామాజిక సాన్నిహిత్యం (Social Intimacy): సామాజిక సంబంధాలు పంచుకోవడం.
  7. సంభాషణ సాన్నిహిత్యం (Communicative Intimacy): సంభాషణలు ద్వారా పరస్పర గౌరవం, నమ్మకం, ప్రేమ, ఆనందం,అర్థంచేసుకోవడం, మెచ్చుకోవడం వంటివి వ్యక్త పరుచుకోవడం.
    సాన్నిహిత్యం సంబంధాన్ని బలపరుస్తుంది మరియు జీవితాన్ని సుఖంగా మారుస్తుంది.

ఇన్ఫిడెలిటి/ వివాహేతర సంబంధాలున్నప్పుడు బంధాలలో నమ్మకం, గౌరవం, ఆత్మ విశ్వాసం తగ్గుతాయి, ఆందోళన పెరుగుతుంది. భాగస్వాములిద్దరూ కూడా నిజాయితీతో నమ్మకం పునరుద్దరించుకునే సంభాషణలు కొనసాగించాలి మరియు మార్పులు చేసుకొని బంధాన్ని పునర్నిర్మించుకోవాలి. దీనికి కపుల్ కౌన్సిలింగ్ అవసరమవుతుంది. కౌన్సిలింగ్ ద్వారా సాన్నిహిత్య లోపాలు, పరస్పర భావొద్వేగ అవగాహనా లోపాలను సవరించుకోవడం ద్వారా బంధాన్ని పున్నర్నిర్మించుకొని విశ్వాశాన్ని తిరిగి సంపాదించుకొనే ప్రయత్నం జరుగుతుంది. అయితే కౌన్సిలింగ్ ఎప్పుడు పని చేస్తుందంటే ఇరుపక్షాలు వివాహంలో కొనసాగాలనుకున్నప్పుడు మాత్రమే. వివహేతర సంబంధాలకు వ్యక్తిత్వ కారణాలు మరియు సాన్నిహిత్య లోపాలూ కారణమవుతాయి. వ్యక్తిత్వ కారణాలున్నప్పుడు వివాహేతర సంబంధాలు మళ్ళీ మళ్ళీ బయటపడుతాయి. అప్పుడు బంధం నుంచి నిషక్రమించాలి. సాన్నిహిత్య మరియు భావొద్వేగ లోపాలునప్పుడు ఇరుపక్షాలు సిద్ధముంటే కౌన్సిలింగ్ ద్వారా వాటిని సవరించుకోవచ్చు.

చరితకి సూచనలు: చరిత మీరు వివాహంలో వుంటూ ఇంకొకరితో మానసిక, శారీరిక సాన్నిహిత్యం ఏర్పర్చుకోవడం వలన సంఘర్షణకు గురవుతున్నారు. అనుక్షణం అబద్దాలు చెప్పడము, సంబంధం బయటపడుతుందేమో అన్న భయం వలన నిజాయితీ అన్న విలువను కోల్పోయారు, దోషిగా నిల్చున్నారు. ఇది విలువలు నష్టపోవడం వలన వచ్చిన భావోద్వేగం. మీకు గౌరవం ఇచ్చే ఏ వ్యక్తి మీ విలువలు రాజి పడేలా మిమల్ని ప్రవర్తించమనరు. మీ విలువలను గౌరవించినప్పుడే మిమ్మల్ని గౌరవించనట్టు. మీ దృక్పథం బట్టీ మీ వివాహంలో సంభాషణ, మానసిక, భావొద్వేగ సాన్నిహిత్యాలు లోపించాయి అని అర్థమవుతుంది. వీటి గురించి మీ వారితో మాట్లాడండి, చర్చించుకోండి. మీకు ఎం కావాలన్నది ఖచ్చితంగా చెప్పండి, పరస్పర ప్రవర్తనా విధానాలలో మార్పు చేసుకోవడం వలన బంధం బలపడ్తుంది. అలాగే మీరు ఏర్పర్చుకున్న వివాహేతర సంబంధం వలన ఆయన అనుభవించిన భావోద్వేగాలను వినండి మరియు స్వీకరించండి. సాన్నిహిత్యం పునర్నిర్మించుకొనే ప్రయత్నం మీ ఇద్దరు కలిసి చెయ్యండి.

సాన్నిహిత్యం తిరిగి నిర్మించుకోవడానికి మరియు నమ్మకం సంపాదించుకోవడానికి సమయం పడ్తుంది అన్నది గ్రహించి ఓర్పుతో వ్యవహరించండి. ఒకవేళ సాన్నిహిత్యం ఏర్పడదనిపిస్తే వివాహంలో కొనసాగకండి. వివాహేతర సంబంధం మీకు, మీ భర్తకు, మీ బంధానికి మరియు మీ పిల్లల ఏడుగదలకు మంచిది కాదు. దాని వలన కలిగే సంఘర్షణ మరియు భావోద్వేగాల వలన మీ అందరి మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది మరియు బంధాలు విచ్చిన్నం అవుతాయి. ప్రేమ అన్నది బాధ్యత అన్నది గుర్తించండి. మీ ప్రవర్తన, ఆలోచనలు, భావాలు మరియు నిర్ణయాల వలన కలిగే ఫలితాల బాధ్యత మీదే అన్నది గ్రహించండి. ఈ గ్రహింపు వలన మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది. ఆలా జరిగినప్పుడు అవుతళివాళ్ళ నుంచి గౌరవం కోరుకోరు అది సంపాదించుకుంటారు.

ఆనంద్ కి సూచనలు: మీ భార్య మీరు మౌనికతో పెంచుకున్న భావోద్వేగ సాన్నిహిత్యం వలన కలత చెందుతున్నారు. అధ్యాయనాలు ఏమి చెప్తున్నాయంటే వివాహేతర బంధాల వలన స్త్రీలు మరియు పురుషులు వివిధ కారణాలు వలన క్రుంగిపోతారు. స్త్రీలు తమ భర్తలు పరాయి ఆడవారితో మానసికం మరియు భావోద్వేగ సానిహిత్యాన్ని పెంచుకోవడం వలన కలత చెందుతారు. పురుషులు తమ భార్యలు పరాయి వ్యక్తులతో శారీరిక సాన్నిహిత్యాన్ని ఏర్పర్చుకున్నపుడు కలత చెందుతారు. మీ భార్య దృక్పథం అర్థం చేసుకోండి. ఆమెతో మానసిక మరియు భావోద్వేగ సాన్నిహిత్యం ఏర్పర్చుకొనే ప్రయత్నం చెయ్యండి. మౌనికతో ఎలా ఉంటే తనకు ఓకే అన్నది తనని అడగండి. తను వొద్దు అంటే మీ వివాహాన్ని కాపాడుకోండి, స్నేహాన్ని దూరం పెట్టండి. మీ భార్యకు తనలో ఏ లోపం వలన మీరు మౌనికకు దగ్గరవుతున్నారన్న అబద్రతా భావం మీ ప్రవర్తన వలన కలుగుతుందన్నది గ్రహించండి. నిజాయితీ, నమ్మకం, గౌరవం, స్నేహం మీ వివాహంలో పునర్నిర్మించుకోండి. ఇవి బంధంలో ఉండాలంటే మీ భార్య నించి ఎలాంటి సహకారం మరియు ప్రవర్తనా మార్పులు కావాలి అలాగే తనకనుగుణముగా మీరు ఎలా మారడానికి సిద్ధంగా వున్నారన్నది ఖచ్చితంగా చర్చించుకొని వాటిని అమలుపరుచుకోండి.

ది మైండ్ వాయిస్: చరిత మరియు ఆనంద్ ఈ మాటలు మీ మనసులో పదే పదే చెప్పుకోండి: వివాహేతర సంబంధాలు వలన నమ్మకం దెబ్బతింటుంది. బంధంలో సాన్నిహిత్య లోపాలను గమనించి ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం వలన బంధం బలపడ్తుంది

(గమనిక: గొప్యత కోసం క్లయింట్ డీటెయిల్స్ మార్చబడ్డాయి)


3 కబుర్లు (శీర్షిక)

DEC 2025

అబ్రకదబ్ర

అబ్రకదబ్ర..అబ్రకదబ్ర… అబ్రకదబ్ర కథ!

ABRACADABRA

BRACADABR

RACADAB

      ACADA

        CAD

          A

‘అబ్రకదబ్ర’ మనతెలుగువాళ్లకు బాగా పరిచయం అయిన పదం. నాకు తెలిసినంత వరకు ఈ పదాన్ని ఆధునిక తెలుగుసమాజానికిపరిచయంం చేసింది ప్రముఖరచయితశ్రీ యండమూరి వీరేంద్రనాథ్.. తులసీదళంలో !

ఈ అబ్రకదబ్ర పదం తరచుమెజీషియన్స్ ఇంద్రజాలంచేసే సందర్భంలోవస్తువులు మాయం చేయడానికి, చేసిన వాటిని తిరిగి కంటి ముందుకు తెప్పించడానికిఉచ్ఛరిస్తుంటారు. కాబట్టి ఇదేదో కనికట్టు విద్యకు సంబందించిన పదంగా మనం భావించడంసహజం. కానీ అబ్రకదబ్ర పదం పాశ్చాత్యుల సంస్కృతిలోని ‘ABRACADABRA’!కనికట్టు కోసంగా కాకుండా.. వైద్య చికిత్సలోభాగంగా ఈ పదాన్ని ఓ మంత్రంలా వాడే ఆచారం పడమటి వైపు సంస్కృతుల్లో ఉంది. క్రీస్తుశకం మూడో శతాబ్దంలో రోమును పాలించిన సెవిరస్ చక్రవర్తి బ్రిటన్ రాజు మీదయుద్ధానికి వెళ్లినప్పుడు తన వెంట జబ్బులు నయం చేసే మంత్రగాడు క్వింటస్ సెరినస్అనే క్వాక్ ను తీసుకువెళ్లినట్లుచారిత్రకఆధారాలున్నాయి. ఆ మంత్రగాడు అబ్రకదబ్ర మంత్రం ద్వారా రాజుకు సుస్తీ చేస్తేతొమ్మిది రోజుల్లోతగ్గించినట్లు ఒక కథనంప్రచారంలో ఉంది.

మన భారతదేశంలో ‘హ్రాం.. హ్రీం.. హ్రూం.. ఫట్’ పదాలను పదే పదే ఉచ్ఛరిస్తూవేపమండలతో రోగుల  మీద దండప్రయోగం చేసే దృశ్యాలు ఇప్పటికీకనిపిస్తుంటాయి కదా! అదే విధానంలో కాకపోయినా ‘అబ్రకదబ్ర’ అనే పదంతోనే రోగ చికిత్సచేయడం మధ్యప్రాచ్యపు సంస్కృతిలో గుర్తింపు పొందటానికిఒక విచిత్రమైన కారణం కద్దు.

ABRACADABRA పదకొండుఅక్షరాల పదం. దానినిఓ చిన్న చీటీ మీద అలాగే రాసి రెండో పంక్తిలో మొదటి అక్షరం, చివరి అక్షరం తొలగించి రాస్తారు. ఆ తరువాతి వరుసలో కూడా పై 9 అక్షరాలలోని మొదటి, చివటి అక్షరాలను లుప్తం చేసి రాస్తారు. ఆ తరువాతా పంక్తి తరువాతపంక్తి అదే క్ర్రమంలో రెండేసి అక్షరాలు తగ్గించి రాసుకుంటూ చివరి పంక్తిలో ఏకాక్షరం A  మిగిలేవరకు రాసి.. ఆకాగితాన్నిచుట్టిన తాయెత్తును జబ్బు మనిషి మెడలో కడతారు. తొమ్మిదో రోజున ఆ చీటీని రోగితల వెనకకు తిప్పకుండాభుజం మీదనుంచి తూర్పు దిశగా ప్రవహించే నదులలో పారవేయాలి. నదులు లేని పక్షంలో ఏచెరువుల్లోనో, దొరువుల్లోనో, బావుల్లోనో వేయడంవల్ల రోగి అస్వస్థ పీడ నుంచి భైటపడతాడని ఒక నమ్మకం. అక్షరాలు తగ్గుతూ వచ్చిన పదాలపంక్తి ఒక బోర్లించిన త్రికోణం రూపంలో కనిపిస్తుంది. పాశ్చాత్య సంప్రదాయంలోత్రికోణానికి ఎన్నో కోణాలలో ప్రయోజనం ఆపాదించారు. ఇక్కడా పదం పొడుగు పంక్తి పంక్తికీ తగ్గుతున్న విధంగానే రోగి అస్వస్థతా అదే నిష్పత్తిలో తగ్గుతూ వచ్చి చివరికి రోగప్రమాదం నుంచి బైటపడతాడని ఒక విశ్వాసం. ‘ఏమో! గుర్రం ఎగరా వచ్చూ’ అంటాం కదా! అట్లాంటిదే ఇదీనూ!

_____________________________________

4.అద్దంలోని ముఖం(కథ)


రైల్వేస్టేషన్ ఎప్పటిలాగే గందరగోళంగా ఉంది. ఎక్కడ చూసినా జనం కూర్చునీ, నించునీ తిరుగుతూనూ హడావుడిగా ఉన్నారు. ట్రైను రావడానికి ఇంకా అరగంట దాకా టైముంది. రైల్వే మైకులో రకరకాల ప్రకటనలు వస్తూ ఉన్నాయి. అర్థం పర్థం లేని ఆ ప్రకటనలు వింటూ కూర్చున్నాను. వైజాగ్ లో ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం కంటే హైదరాబాదులో మంచి జాబ్ వచ్చింది. అక్కడికే బయలుదేరాను. అక్కడ మా పెదనాన్నగారింటికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి రూమ్ వెతుక్కోవాలి. మొదటి సారి హైదరాబాద్ వెళుతున్నాను. హుషారుగా ఉంది.

“సార్! నమస్తే…పడుకుండిపోతే ట్రైను మిస్సయింది. నా బ్యాగు, పర్సు ఎవరో కొట్టేశారు. ఉదయం నుంచీ ఏమీ తినలేదు. ఒక పది రూపాయలు సహాయం చేస్తారా!” పాఠం చెప్పినట్టు గడా గడా చెప్పుకు పోతున్నాడు. సాదా సీదాపాంటూ, షర్టూ వేసుకున్న యువకుడు. అతని వయసు ముప్ఫై దాకా ఉండవచ్చు. తన కథ అందరూ నమ్మాలని డ్రెస్సు మాత్రం శ్రద్ధగా శుభ్రంగా ఉండేటట్టు చూసుకున్నట్టు ఉన్నది. మిగతా అంతా మామూలే. చిక్కులు చిక్కులు పడి పిచ్చి పిచ్చిగా ఉన్న జుట్టూ, స్నానం పానం లేని ఒళ్ళూ, మట్టి కొట్టుకు పోయిన పాదాలు. చూస్తే చాలా రోజులుగా ఇదే వృత్తిలో ఉన్న బిచ్చగాడని నాకు అనిపించింది. అతని మాటలను మధ్యలోనే ఆపి కరకుగా “లేవు..వెళ్ళు..” అన్నాను.

నాలాంటి వాళ్లను రోజూ చూస్తున్న అనుభవం అయ్యి ఉండవచ్చు అతనిది. “సార్! అబద్ధం కాదు. నేను మోసగాణ్ణి కాదు. నిజం సార్.” నా నుండి ఎలాగోలా ఒక పది రాబట్టాలని ప్రయత్నం చేశాడు. ఇది కూడా ఒక సైకలాజికల్ ట్రిక్కే. పది మంది జనం ఉన్న చోట ఎలాగోలా ఒక్కరి దగ్గర పది రూపాయలు లాగితే వరసగా పది మంది దగ్గరా పది పదులు వస్తాయి. ఈ చిట్కా తెలిసిన వాళ్ళు మొదటి కస్టమర్ని అంత త్వరగా వదిలి పెట్టరు. నాకు ఒళ్ళు మండింది. “లేవని చెప్తే వినపడదా? అవతలికి వెళ్ళు..” గట్టిగా కసిరాను.

అతడు ఒక్క క్షణం నా వైపు చూశాడు. ఆ కళ్లలోని దీనత్వం నన్ను కదిలించింది. ఒక్క క్షణం…ఒకే క్షణం…అతడికి ఎంతో కొంత ఇద్దామని అనిపించింది. ఎంత ఇద్దామని ఆలోచిస్తూ పైకప్పు కేసి చూశాను. మళ్ళీ తల వంచి, నిశ్చయించుకుని జేబులోకి చెయ్యి పోనిచ్చాను. పర్సు బయటకు తీసి ఓపెన్ చేసి డబ్బులు తీస్తూ “ఇదిగో…” అనబోయాను. అతడు అల్లంత దూరంలో ఇంకెవరినో అడుక్కుంటున్నాడు.

చికాకుగా అనిపించింది. “అలా ఎందుకు అనిపించాలి? నా డబ్బులు నా దగ్గరే ఉన్నాయి కదా! నిజానికి నేను సంతోష పడాలి కదా” మనసులో అనిపించింది. “కాదు…డబ్బులు ఇవ్వనందువల్ల నా అహం అసంతృప్తిగా ఉంది. పైగా వాడి తిరస్కారాన్ని సహించ లేక పోయాను.” మనసులోని ఇంకో గొంతు అన్నది. “పోనీలే…ఇలాంటి వాళ్లకు బోలెడంత ఆదాయమంట. న్యూస్ లో చూడటం లేదూ..వాడెవడో బిచ్చగాడి దగ్గర లక్షల కొద్దీ దాచిన సొమ్ము దొరికిందట.” ఇంకో మూలనుంచి ఇంకొక వాయిస్ వినిపించసాగింది.

అంతరాత్మ అని అనుకుంటూ ఉంటాం గాని నిజానికి మనసులో ఎన్నో అంతరాత్మలు ఉంటాయి. అన్నీ ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒంటరిగా ఏ పనీ లేకుండా కూర్చున్నప్పుడు చాలా మందికి ఇది అనుభవమే. ఇన్ని గొంతులూ లోలోపల మాట్లాడుకుంటూ ఉంటే మనసులోని ఇంకో పార్శ్వం మైకులో వచ్చే ప్రకటనల లోని అసంబద్ధత గురించి ఆలోచిస్తోంది. వీటన్నిటికీ పైన నా ట్రైను తాలూకు అనౌన్సుమెంటు ఎప్పుడు వస్తుందోనని మనసులోని ఇంకో భాగం అలర్ట్ గా ఉంది. “ఆహా! ఈ మనసు ఎంత శక్తి గలదో కదా! ” అనుకుంటున్నాను.

అంతలో “బావా! పదిరూపాయలు ఇవ్వు…” రెండు చేతులాచప్పట్లు, కావాలని ఒళ్ళు తగిలేటట్టు మీదకు వంగిన ఆడా మగా కాని ఆకారం. కోపంగా చూడబోయాను. ఇందాకటి వాడి కోసం తీసి చేతిలో పట్టుకున్న పది రూపాయల నోటుని లాఘవంగా చేజిక్కించుకుని మెటికలు విరుస్తూ ప్రక్కకు వెళ్ళిపోయిందామె. కోపం నషాళానికి అంటింది నిస్సహాయంగా “ఛీ! దొంగ ముం…” కసితీరా తిట్టుకున్నాను. ఏమీ చెయ్యలేను మరి. ఇది ఒక రకమైన ఘరానా అడుక్కోవడం. దీంట్లో మన ఇష్టంతో పని ఉండదు. వాళ్ళు వస్తే ఎంతో కొంత సమర్పించుకోవాలి. డబ్బులు ఇవ్వక పోతే చదువుకునే కుర్రవాళ్ళ దగ్గర ఉన్న ఖరీదైన ఇయర్ ఫోన్స్ లాంటివి బలవంతంగా లాక్కుని ట్రైన్ లోంచి బయటకు విసిరేయడం నా కళ్లారా చూశాను.

నా లాంటి ఉద్యోగం చేసుకునే యువకుల దగ్గర ఏం కొట్టేస్తారో అని భయపడి డబ్బులు ఇలా ఇష్టం లేకపోయినా ధారపొయ్యాలి. ఇష్టం లేకపోయినా అని ఎందుకంటున్నానంటే ఇక్కడ దానం చేస్తే చల్లారే అహం ప్రసక్తి లేదు. మోసపోయి దెబ్బతిన్న బాధే ఉంటుంది. ఆలోచనల్లో ఉండగానే ట్రైను అనౌన్స్ మెంటు వినిపించింది. హడావుడిగా ఆ ప్లాట్ ఫారానికి పరుగు పెట్టి నా బోగీకి చేరుకున్నాను. ఏ సీ టూ టైర్ లో లోయర్ బెర్తు వచ్చింది. రైల్వే వాళ్ళు ఇచ్చిన దుప్పటిని బెర్తు మీద పరుచుకుని తలగడకు కవర్ వేసి పక్కను నీట్ గా సర్దుకున్నాను.

జేబుల్లోని పర్సు, పెన్ను, స్పెట్సు, వాచీ, ఐ డి కార్డ్స్ ఉన్న పౌచ్ ఇవన్నీ తీసి లాప్ టాప్ బ్యాగ్ లో పెట్టేసి దానిని నా తల కింద పెట్టుకున్నాను.డిన్నర్ సార్…అంటూ అమ్మకానికి వచ్చిన వాడి దగ్గర చపాతీ కొనుక్కొని భోజనం అయ్యిందనిపించాను. కొద్దిసేపు ఫోన్ లో అవీ ఇవీ చూసుకునేటప్పటికి తొమ్మిదైంది. ట్రైన్ లో రాత్రి తొమ్మిదైంది అంటే అర్థరాత్రి అయిపోయిందన్నమాటే. చాలామంది ఎనిమిదికే పక్కలు వేసేస్తారు. నేనూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను.


“లేవండి సార్! సికింద్రాబాద్ వచ్చి చాలా సేపయ్యింది. ఇదే లాస్ట్ స్టేషను. అందరూ దిగిపోయారు.” దుప్పట్లు కలెక్ట్ చేసుకునే వాడి అరుపుతో మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి లేచాను. ఇంకా బద్ధకంగా ఉంది. రాత్రి ఏ సీ ఎక్కువైనట్టు ఉంది. ఇంకా చలిగానే ఉంది. నేను లేచి ఖాళీ చేస్తే ఆ దుప్పట్లు పట్టుకు పోదామని, నన్ను లేపిన వాడు అసహనంగా నాకేసి చూస్తున్నాడు. గబుక్కున లేచి ఎదుటి బెర్తు మీద కూర్చున్నాను. ఒక్క విసురుతో వాడు నేను బెర్తు మీద పరచిన దుప్పటిని లాగాడు. వాడి విసురుకు నాకు కోపం వచ్చింది.

“ఆగు..అక్కడ లాప్ టాప్ బ్యాగ్ ఉంది.” అరిచాను. వాడు వాడి మొహం లోని తిరస్కారం నాకు కనిపించకుండా అటు వైపు తిరిగి నిలబడి..”తీస్కపో సార్..నేనేమంటున్న?” అన్నాడు. నేను పిల్లో తీసి చూశాను. గుండె గుభేలుమంది. “పిల్లో కింద పెట్టిన నా లాప్ టాప్ బ్యాగ్ ఏదీ?” హడావుడిగా వెతికాను.

బెర్తు మీద రైల్వే వాళ్లిచ్చిన దుప్పట్లు తప్ప వేరే ఏమీలేవు. “భగవంతుడా..ఏంటిది! చేతి వాచీతో సహా అన్నీ అందులోనే పెట్టేశానే? ఇప్పుడేమిటి దారి?” తలుచుకుంటుంటే ఒళ్ళంతావణుకొచ్చేసింది. హడావుడిగా కిందా మీదా వెతకడం మొదలు పెట్టాను. “ఏమైంది సార్! తీస్కపోవాల్నా?” ఇన్డిఫరెంట్ గా వాడి ప్రశ్న. ఒళ్ళు మండిపోయింది. “తీసుకు పో! ఇక్కడ నా బ్యాగు కనిపించడం లేదు. నీ దుప్పటి నువ్వు తీసుకుపో!” కోపంగా అన్నాను. “దానికి నేనేం చేయాల సార్! మంచిగ ఎతుకుండ్రి. కావల్నంటే గియ్యన్నిసూడు.” కొంచెం సానుభూతిగా అన్నాడు. వాడి దుప్పట్లన్నీ వెతికాను. ఓపిగ్గా వాడూ చూశాడు. ప్రయోజనం లేకపోయింది. ఎవడో నా బ్యాగ్ కొట్టేశాడని కన్ ఫర్మ్ అయిపోయింది. చేసేదేముంది? నెమ్మదిగా ట్రైన్ దిగాను.
“చాయ్! చాయ్! గరం చాయ్!” పక్కనుంచి అరుచుకుంటూ పోతున్నాడు. టీ తాగాలని బలంగా అనిపించింది. జేబులో పర్సు లేదు. ఫోన్ పే చేయడానికి ఫోన్ లేదు. బ్రష్ చేసుకోవడానికి బ్రష్ గాని, పేస్ట్ గానీ లేవు. తల దువ్వుకుందామంటే జేబులో పాకెట్ దువ్వెన కూడా తీసి బ్యాగ్ లో పెట్టేశాను.

ట్రైన్ ఇంకా ఆగి ఉంది. లోపలికి వెళ్ళి ఆఖరుగా ఒకసారి నాలుగు బెర్తులకీ కిందా పైనా వెతికాను. మొత్తం అంతా ఖాళీగా ఉంది. నిరాశగా వెనక్కు వెళుతూ వెళుతూ ఒక్కసారి ట్రైన్ లోని అద్దంలో నా ముఖం చూసుకున్నాను. నల్లగా, జిడ్డుగా, అసహ్యంగా ఉంది. నా ఉంగరాల జుట్టు రేగిపోయి చిక్కులు పడి ఎన్నాళ్ల క్రితమో దువ్వుకున్నట్టు ఉంది. నిద్రలో అటూ ఇటూ దొర్లిదొర్లి బట్టలు పూర్తిగా నలిగి పోయి ఉన్నాయి. షర్టు ప్యూర్ కాటనేమో మరీ అసహ్యంగా నలిగిపోయి ఉంది. కిందకి చూసుకున్నాను. పాదాలకి రైల్వే ప్లాట్ ఫారం తాలూకు మట్టి అంటుకొని అసహ్యంగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి అద్దంలో నా ముఖం చూసుకున్నాను.

ఈ ముఖాన్ని ఎక్కడో వేరే చోట చూసినట్టనిపించింది. “అవును..నిన్న సాయంకాలం వైజాగులో నన్ను పది రూపాయలు అడిగిన బిచ్చగాడి ముఖం కదూ ఇది..” ఛెళ్ళున చెంప మీద చరిచినట్టయింది. గతుక్కుమన్నాను. అంతలో ట్రైన్ కొద్దిగా కదిలినట్టు అనిపించింది. గబగబా దిగిపోయాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా పెదనాన్న గారి అబ్బాయి వస్తానని అన్నాడు. ఇంకా రాలేదు. ఈ లోపులో బ్రష్ చేసుకుంటే బాగుంటుంది. కానీ బ్రష్ గాని, పేస్టు గాని లేదు. సోప్ లేదు. టీ తాగడానికి డబ్బులు లేవు.

మా తమ్ముడికి ఫోన్ చెయ్యడానికి ఫోన్ లేదు. బయటకు వెళ్లాలంటే గేటు దగ్గర టీ సీ కి చూపించడానికి టిక్కెట్ లేదు. నిన్నటి ఆ బిచ్చగాడి పరిస్థితికీ నా పరిస్థితికీ ఏమీ తేడా కనిపించలేదు. ఆకలి మండుతోంది. నీరసం వస్తోంది. మావాడు ఇంకా రావడం లేదు. బెంచీ మీద నీరసంగా వెనక్కి వాలి కూర్చున్నాను. అంతటి ట్రైన్ల, జనాల గోలలోనూ మాగన్నుగా నిద్ర పట్టింది.
“ఏయ్ లే! పొద్దున్నే ఎంత తాగావ్! లే అక్కణ్ణుంచి! ఆ మూలకి పోయి కూర్చో. ప్రతీ తాగుబోతు ముష్టెదవకీ బెంచీలు కావాల!” నా వైపు అసహ్యంగా చూస్తూ ఒక పెద్దాయన తిడుతున్నాడు.

బుర్ర తిరిగిపోయింది. “ఏయ్! ఏమనుకుంటున్నావు? నేనెలా కనిపిస్తున్నాను?” కోపంగా అరిచాను.
“లెగరా అక్కణ్ణుంచి..మళ్ళీ వెధవ పౌరుషాలొకటీ!” అంటూనే అతడు..”హలో కానిస్టేబుల్ గారూ! ఒక సారి వీడ్ని చూడండి. బెంచీ మీద దర్జాగా నిద్ర పోతున్నాడు.” అటుగా వెళుతున్న పోలీసుని పిలిచాడు. మరుక్షణం లాఠీ నా ఒంటి మీద నాట్యం చేసింది. “లెగుబే…నీ..” వాడి నోట్లోంచి బూతు మాట దొర్లింది. అవమానంతో సిగ్గుతో, బాధతో నేనెవరో ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో అక్కడనుంచి లేచాను. ముసలాడు దర్జాగా అక్కడ కూర్చున్నాడు.

పైనున్న గడియారం వంక చూశాను. ఎనిమిదింపావు అయ్యింది. విశాఖ పట్నం నాందేడ్ ఎక్స్ ప్రెస్ అదే ప్లాట్ ఫారం మీదికి వస్తున్నట్టు అనౌన్స్ అవుతోంది. “ఏమయ్యాడు వీడు? మా తమ్ముడు ఇంకా రాడేం? నేను ఆరింటికి కదా వచ్చింది? వచ్చి కూడా దాదాపు రెండున్నర గంటలు అవుతోంది!” ఆలోచనలో పడ్డాను. బండి లోపలికి వచ్చింది. నాలో సరికొత్త ఆలోచన వచ్చింది. గుంపులుగా బయటకు వెళుతున్న జనంతో పాటు గేటు దాటి బయటకు వచ్చేసి “అమ్మయ్య!” అనుకున్నాను. దాదాపు ముష్టి వాడి గెటప్ లో ఉన్న నన్ను ఎవరూ టిక్కెట్టు అడగరన్న ఆలోచన నాకు రాలేదెందుకో మరి.

బయటకు వచ్చి స్వేచ్ఛగా గాలి పీలుస్తూ నిలబడ్డాను. కొద్ది దూరంలో ఒక గొంతు వినబడింది. “అన్నయ్యా నువ్వేనా! ఏమిటి ఇలా ఉన్నావు! నా బండి మధ్యలో పంక్చర్ పడి ఆగి పోయిందన్నయ్యా! అందుకే లేటు!” ప్రశ్నలూ, సంజాయిషీలూ చెపుతూ పదడుగుల దూరంలో వేగంగా నా వైపు నడుస్తూ తమ్ముడు విష్ణు. ఆ సమయంలో నా కళ్ళకి విష్ణుమూర్తి లాగానే కనిపించాడు. ఆనందంతో, దుఃఖంతో కళ్ళ నిండా నీళ్ళొచ్చేశాయి. “ఏంటన్నయ్యా! ఏమైంది?” కంగారు పడిపోయాడు. సమాధానం చెప్పలేక ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా ఆడించాను. వాడికి అర్థం అయ్యుండదు కానీ “ఇక్కడే ఉండన్నయ్యా! బండి స్టాండులో పెట్టాను. తీసుకొస్తాను.” అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు. రిలీఫ్ గా పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాను. పక్కన మాటలు వినిపించాయి.

“నిన్న నా లగేజ్ పోయి వైజాగ్ లో చాలా ఇబ్బంది పడ్డాను రా విజయ్! ఎవరికి ఫోన్ చేద్దామన్నా ఫోన్ కూడా పోయింది. ఎవరింటికి వెళ్లాలన్నా డబ్బుల్లేవు. ఎవరో పాపం ఒకాయన సహాయం చేస్తే ఇదుగో నాందేడ్ ఎక్స్ ప్రెస్ కి వచ్చి ఆయన ఫోన్ లోనే నీకు ఫోన్ చేశాను.”
ఇతడిదీ నా కథేనన్న మాట అనుకుంటూ అటు పక్క చూసి నిర్ఘాంతపోయాను. అతడు నిన్న నన్ను పది రూపాయలడిగిన వ్యక్తే. హఠాత్తుగా అతడు నా వైపు చూశాడు. “అయితే కొంతమంది పెద్ద మనుషులు నన్ను ముష్టి వాడనుకొని చీదరించుకున్నార్రా!” మట్టి గొట్టుకుపోయిన నా పాదాల వైపు అసహ్యంతో చూస్తూ అన్నాడతను. సిగ్గుతో తలవంచుకున్నాను నేను.


5.సన్నిహితం… శీర్షిక

DEC 2025

మెచ్చుకొని చూడు

పాటలు పాడటం నా హాబీ .చిన్నప్పటి నుండీ ఎంతో ఇష్టంగా సినిమా పాటలు పాడే వాడిని . స్కూల్ రోజుల్లో నేను పాడుతుంటే అందరూ మెచ్చుకుని చప్పట్లు కొట్టేవారు .
సంతోషంగా ఫీల్ అయ్యేవాడిని . క్రమంగా పెద్దయ్యాక పాటలు పాడటం తగ్గించి చదువు , తర్వాత ఉద్యోగ సంపాదన లో పడిపోయాను . కొన్నాళ్ళకు ఆ భగవంతుడి దయ వల్ల జాబ్ వచ్చింది . కొంతకాలానికి జాబ్ లో కుదురుకున్నాక నా హాబీ మళ్ళీ పురి విప్పింది . పాటలు పాడట మొదలు పెట్టాను .
ఈ లోగా నాకు పెళ్లయింది . పిల్లడు పుట్టాడు . వాడు పెరిగి పెద్దయి స్కూల్ కి వెళ్తున్నాడు . నా పాటల ప్రహసనం సాగుతోంది .
ఒక రోజు మా ఆఫీసు ఏన్యువల్ డే జరిగింది . అంతా సంబరంలా ఉంది వాతావరణం . ఆడిటోరియం లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి . నేను కూడా ఆ ప్రోగ్రాం లో మంచి పాట పాడాను . నిజానికి ఎంతో బాగా అచ్చం బాలు గారి లాగే పాడాను . కానీ పాట పూర్తయ్యాక ఎవ్వరూ చప్పట్లు కొట్టి అభినందించలేదు . చివుక్కుమంది నా మనసు . మళ్ళీ పాడకూడదు అని నిర్ణయించుకున్నాను .

ఆ సాయంత్రం చిరాగ్గా ఇంటికి వచ్చాను . మా అబ్బాయి ” డాడీ నేను ఈ బొమ్మ గీసాను చూడు ” అని ఎదురొచ్చాడు .
” హే .. పోరా .. నువ్వొకడివి ” అని అరిచాను . వాడు మమ్మీ అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు .
కాసేపటి తర్వాత నా ఫోన్ రింగ్ అయింది . నా కొలీగ్ కాల్ చేసాడు . సూపర్ గా పాడావు బాస్ అని అభినందించాడు . ఆ తర్వాత ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి . అందరూ అభినందిస్తున్నారు . నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది . ఖుషీ గా ఫీల్ అయి మా అబ్బాయి దగ్గరకు వెళ్ళాను . వాడు మొహం ముడుచుకుని కూర్చున్నాడు .
” సారీ నాన్నా .. నీ డ్రాయింగ్ ఎంత బాగుందో తెలుసా .. సూపర్ ” అని మెచ్చుకున్నాను . వాడి మొహం వికసించింది ఇప్పుడు .
” థాంక్యూ డాడీ ” అని నవ్వాడు .
బయట వాళ్ళనుండి మెచ్చుకోలు ఆశిస్తాం మనం . అలాగే మన పిల్లలు కూడా మన నుండి ఆశిస్తారు అని తెలుసుకోవాలి . ఆ ఏముందిలే అని నిర్లక్ష్యం చెయ్యరాదు . అంతే కదా ఫ్రెండ్స్ !!!!


6.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

కలిమి లేములు కావడి కుండలు


మన జీవితంలో కష్టాలను, సుఖాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని ఈ సామెత వివరిస్తూంది. కలిమి-లేమి అనేవి అచ్చ తెనుగు పదాలు. సంపద, దరిద్రం అని వాటికర్థం. మనకు తెలుగు కంటే సంస్కృతమే బాగా అర్థమవుతుందేమిటో మరి. నన్నయ్య భారతంలో ఎనభై శాతం తత్సమాలు(సంస్కృత జన్యాలు) ఉంటాయి. అవన్నీ మనకు పరిచితంగా ఉంటాయి. కాని తిక్కన భారతంలో అన్నీ అచ్చ తెనుగు పదాలు ఉంటాయి. అవి మనకు అర్థం కావు. సామెతనొదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాను. దీన్ని డైగ్రేషన్ అంటారు. పాత కాలంలో కావళ్ళని ఉండేవి.


ఇటూ అటూ గంపల్లాంటివి, ఒక బలమైన కర్ర అంచులకు తాళ్ళతో వేలాడదీసి, వాటిలో సామాన్లు వేసుకుని, మోసుకుని వెళ్ళేవారు. రెండు వైపులా సమతౌల్యం(ఈక్విలిబ్రియం) ఉంటేనే కావడి మోయడం సులువుగా ఉంటుంది. పైగా, అవి రెండూ ఊగుతుంటాయి. మోసే వాడికే తెలుస్తుంది కావడి బరువు. అని మరో సామెత.! నిజమే కదండీ!


“కలిమింబొంకక, లేమింగ్రుంకగన్ యున్నవాడే స్థితప్రజ్ఞుడని” మన పెద్దలు చెప్పారు. గీతలో కిట్టయ్యగారు “దుఖేష్వనుద్విగ్నమనా: సుఖేషువిగతస్పృహ:” అని చెప్పారు. దు:ఖంలో ఉద్వేగం లేకుండా, సుఖంలో దాని స్పృహ లేకుండా ఉండాలి. ఎంతో కష్టం!
శ్రవణ కుమారుడని ఒక ముని కుమారుడుండేవాడు. ఆ పిల్లవాడు కావిడిలో తన ముసలి తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని మోసుకుంటూ వెళ్ళేవాడు. ఈ కథంటే గాంధీ గారికి చాలా ఇష్టం. ఇప్పుడలాంటి కొడుకులెవరున్నారు?
నూతుల నుండి, వాగుల నుండి నీళ్ళు తెప్పించుకోవడానికి కూడా కావడులే ఉండేవి. కుండలు లేదా బిందెలు రెండు వైపులా నీళ్ళతో నింపి తీసుకుని వెళ్ళేవారు. ఇంటింటికీ ఇలా నీళ్ళు సరఫరా చేయడమే వృత్తిగా కొందరుండేవారు తెలుసాండీ? సత్యం శంకరమంచి గారి తమ అమరావతి కథల్లో ‘అన్నపూర్ణ కావిడి’ అనే గొప్ప కథ ఉంది. సాధువు ఒకాయన చింతపండు పులుసుతో బాగా తోమిన, తళతళా మెరుస్తున్న ఇత్తడి బిందెల కావడితో, ఇల్లిల్లూ తిరిగి భిక్షం స్వీకరించేవాడు. యాచనలో ఇది ఉన్నత స్థాయి అన్నమాట. ఆ సాధువు పేరు శరభయ్య. ఆహారం పట్ల గౌరవం, పేదరికంలోని ఉన్నత వ్యక్తిత్వం. సత్యం గారు ఈ కథలో అద్భుతంగా చిత్రీకరించారు.


కలిమిని లేమిని బ్యాలెన్స్ చేసుకోవడం అంత వీజీ కాదండీ. దానికి బోలెడు ప్లానింగు, బొచ్చెడు ముందుచూపు కావాలి. అప్పుడే అవి కావడి కుండల్లా, భరించడానికి అనువుగా ఉంటాయి. ఉన్నప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టేసి, చివరి దశలో నానా కష్టాలు పడిన వాళ్ళను మనం సినిమా రంగంలో ఎక్కువగా చూస్తాం. 70 సంవత్సరాల క్రిందటే సినిమాకు లక్ష పారితోషికం తీసుకొన్న హీరో చిత్తూరు నాగయ్య గారు. ఐదారు కార్లు దర్జాగా మెయింటెయిన్ చేసిన నటుడు రాజనాల గారు. అద్భుత నటిగా దశాబ్దాల పాటు వెండి తెరనేలిన అభినేత్రి సావిత్రి గారు. వీరంతా చివరి దశలో దరిద్రాన్ని అనుభవించినవారే. శోభన్ బాబు లాంటి వారు మాత్రం ముందుచూపుతో భూములు కొని తరతరాలకు సరిపడినంత ఇచ్చిపోయారు. ఈకాలం నటులు జాగ్రత్తగా వ్యాపారాలు నడుపుతూ డిమాండ్ తగ్గేటప్పటికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా హ్యాప్పీగా ఉంటున్నారు. సినిమా వారికే కాదు, అన్నిరంగాల వారికీ ఇది వర్తిస్తుంది.


“నైదర్ ఎ బారోవర్, నార్ ఎ లెండర్ బి” అన్నాడు షేక్స్ పియర్ మహాశయుడు. అప్పు తీసుకోవద్దు. ఇవ్వవద్దు అని దీనర్థం. ఈ సామెత కావడి కుండలను, బ్యాలెన్స్ చేస్తుంది. బాగా మొగమాటానికి పోయి లోన్ కు ష్యూరిటీ ఇచ్చిసర్వనాశనమైన వాళ్ళు లేరా చెప్పండి. ఆర్.కె.నారాయణ్ గారు “ది ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్ లు” అనే గొప్ప నవల వ్రాశారు. అందులో మార్గయ్య అనే చిరు వడ్డీ వ్యాపారి ఉంటాడు. అత్యాశకు పోయి, ఉన్నది పోగొట్టుకుంటాడు. “బాలు” అని ఆయన కొడుకు. “సుపుత్రా కొంప పీకరా” అన్నట్లు వాడు గుణనిధి లాంటివాడు. కొడుకుల వల్ల కలిమి లేముల కావడి అప్ సెట్ అయి కుదేలయిన లెజెండరీ ఫిగర్స్ కావలసినంత మంది.


“కావడి కొయ్యేనోయ్, కుండలు మన్నేనోయ్, కనుగొంటే సత్యమింతేనోయ్! ఈ వింతేనోయ్!” అని దేవదాసు నోట అనిపించారరు సముద్రాల రాఘవాచార్య గారు. వేదాంతాన్నంతా ఆ పాటలో నింపారు. ఈ పాట వ్రాయడంలో ఎం.ఎస్. విశ్వనాథన్ గారు సాయం చేశారంటారు. కావడి కొయ్యేనట, కుండలు మన్నేనట. అదే సత్యమట. దానికీ కలిమీ-లేములకూ సంబంధమేమిటో మరి. నాకైతే అర్థం కాలేదు. అర్థం కానిదే కదా వేదాంతం? దేవదాసు సినిమాకు దర్శకుడే వేదాంతం రాఘవయ్య గారైతేను. మన ఆదాయాన్ని ఖర్చును జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. మరీ అదేదో జంధ్యాల సినిమాలో కోట లాగా పిసినారితనం అక్కర లేదు. కన్స్యూమరిజం పెరిగి పోయి ఈ.ఎం.ఐ. ల సంస్కృతి జీవితంలో భాగమై కలిమి లేముల కావడి అప్ సెట్ కాకుండా చూసుకోవాలి! కాదంటారా?

ఇంకో సామెతతో వచ్చేవారం…


7.వినరో భాగ్యము – శీర్షిక

DEC 2025

శ్రీవారి సంపదకు రక్ష  శంఖనిధి పద్మనిధి 

తిరుమల ఆలయ ప్రాంగణంలో జగద్రక్షకుడైన తిరుమలేశుని సంపదను కాపాడి రక్షించడానికి రెండు ప్రత్యేక శక్తులను పూర్వికులు ఏర్పాటు చేశారు. అవే తిరుమలేశుని ఆలయ ముఖద్వారం ఇరువైపులా రెండు మూడు అడుగుల ఎత్తులో కనిపించే పంచలోహ విగ్రహాలు. వాటిని శంఖనిధి , పద్మనిధి శక్తులని పిలుస్తారు. ఇందులో ఉత్తరంవైపు ఉన్న విగ్రహం చేతుల్లో శంఖాలు, దక్షిణం వైపు ఉన్న విగ్రహం చేతుల్లో పద్మాలు ఉంటాయి. తిరుమల క్షేత్ర పాలకుడైన మహాదేవుని అనుచరగణంగా ఈ శక్తులు పనిచేస్తాయని, తిరుమలేశుని సంపదను దోచుకునేవారికి తగిన శిక్షలు వేస్తాయని భక్తుల విశ్వాసం. 

సాధారణంగా ఇటువంటి రక్షక శక్తులను దేవాలయాల మూడవ ప్రాకారాల ముందు ఏర్పాటు చేయడం సంప్రదాయం. అందుకు తగినట్టుగానే తిరుమల ఆలయంలోని గర్భాలయం నుంచి బయటివైపునకు ఉన్న  విమాన ప్రదక్షిణ ప్రాకారం ,సంపంగి ప్రాకారాలకు ముందున్న మూడవ మహద్వార గోపుర ప్రాకార మార్గ ప్రవేశానికి  ముందు శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఉంటాయి     ఈ విగ్రహాల వద్ద రెండంగుళాల ఎత్తుకలిగి ముకుళిత హస్తాలతో నిలుచున్న రెండు విగ్రహాలు ఉన్నాయి. అవి తిరుమలేశుని ఆలయ విస్తరణకు విశేష కృషి చేసిన విజయనగర రోజుల్లో ఒకరైన అచ్యుతరాయలు ప్రతిరూపాలని శాసనాధారాలు చెబుతుంటాయి. ఆయన హయాంలోనే మహాద్వారం వద్ద శంఖనిధి పద్మనిధి శక్తులను ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తోంది.

అయితే ఇటీవలి కాలంలో ఎవరో ఆ విగ్రహాలను విరగగొట్టి తీసుకువెళ్లిన చిహ్నాలు మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంటాయి. తిరుమలేశుని గర్భాలయం ముందున్న జయవిజయుల విగ్రహాలు నోటిపై వేలుంచుకుని నిశ్చబ్దంగా స్వామిని దర్శించుకోమని హెచ్చరిస్తే, మహాద్వారం వద్ద ఉన్న శంఖనిధి, పద్మనిధి శక్తులు ఆలయ సంపదను పరిరక్షిస్తుంటాయని స్థలపురాణం తెలియచేస్తుంది


ఓం నమో వెంకటేశాయ

మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

Leave a Reply