1100 people | ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు

1100 people | ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు

  • నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
  • ఓటర్ల మనసు గెలిచి ఎన్నికల్లో విజయం సాధించాలి
  • సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్

1100 people | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఈ నెల 11వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సుమారు 1100 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు ఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. జిల్లా ప్రజలంతా ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలో 199 వార్డులకు గాను 153 కేంద్రాల్లో 453 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. వీటిలో 59 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించామని పేర్కొన్నారు.

పోలింగ్ రోజు ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశామని, బందోబస్తు నిర్వహణ నుంచి ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బందికి భద్రత కల్పించే ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, జిల్లా పోలీస్ కార్యాలయం నుంచే నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో కొనసాగుతుందన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు..

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి, అభ్యర్థిత్వం కూడా రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫలితాలు వెలువడే వరకు ‘సైలెన్స్ డే’గా అమలు చేస్తామని, ఈ సమయంలో స్థానికేతరులు కాలనీలు, వార్డుల్లో సంచరించరాదని సూచించారు. ఓటర్ల మనసు గెలిచి ఎన్నికల్లో గెలవాలని, డబ్బు, మద్యం, బహుమతులు, ఉచితాల ద్వారా ప్రలోభాలకు గురిచేయొద్దని తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడినవారు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి ముందస్తుగా 123 కేసులు నమోదు చేసి, 208 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికలను ప్రభావితం చేసే అక్రమ మద్యం రవాణాపై 30 కేసులు నమోదు చేసి, రూ.1.57 లక్షల విలువైన 249 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Leave a Reply