10th century | దేవేరి కామాక్షి, బ్రహ్మ, విష్ణువులతో….

10th century | దేవేరి కామాక్షి, బ్రహ్మ, విష్ణువులతో…

  • నంది నోటి నుంచి నీరు రావడం ఇక్కడ ప్రత్యేకత
  • మూడు గోపురాలతో వెలసిన 10వ శతాబ్దం నాటి ఆలయం
  • దక్షిణ కాశీగా ప్రసిద్ధి, రాహు కేతు పూజల నిలయం
  • రేపటి నుంచి వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

10th century | చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక చరిత్రలో అరుదైన శైవ పుణ్యభూమిగా వెలుగొందుతున్న పవిత్ర క్షేత్రం శ్రీ మొగిలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ తన సతీమణి కామాక్షితో మొగిలేశ్వర స్వామిగా స్వయంభుగా వెలిశారు. బ్రహ్మ, విష్ణువులు కూడా ఈ క్షేత్రంలో వెలయడముతో ఈ క్షేత్రానికి పవిత్రత రెట్టింపు అయింది. బంగారుపాలెం మండలంలో చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపై, ప్రకృతి సోయగాల నడుమ ప్రశాంతంగా వెలసిన మొగిలి గ్రామం ఈ శైవ పుణ్యభూమికి నిలయం. శతాబ్దాల చరిత్ర, పురాణ గాథల పవిత్రత, నేటి భక్తి ప్రవాహం ఈ మూడు కలిసిన దివ్యక్షేత్రం ఇది. భక్తులు దీనిని దక్షిణ కైలాసంగా భావిస్తారు.

మొగిలి చెట్టు కింద స్వయంగా వెలసిన స్వయంభూ శివలింగమే ఈ క్షేత్ర మహిమకు మూలం. దేవుడు భక్తుడి పేరుతో పూజలందుకోవడం అరుదైన విశేషం. ఇక్కడ శివుడు మొగిలప్ప భక్తుని సేవకు గుర్తుగా మొగిలేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ కోనేరులో నంది దాట్ల నుంచి ధారగారి నీళ్లు కారణం విశేషం. ఇక్కడ శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. రాహు కేతు పూజలకు, పెళ్లిళ్లకు ప్రధాన కేంద్రంగా వెలుగొందుతోంది.

10th century |

పూర్వం ఈ ప్రాంతం మొగలి పొదలతో నిండిపోయి అడవిలా ఉండేదని స్థానికుల వాదన. బోయ దంపతులకు అడవిలో జన్మించిన శిశువే మొగిలప్ప. పశువుల కాపరిగా జీవనం సాగించిన అతడు ఒక రోజు చెరువు ఒడ్డున మొగలి పొదలు నరికే సమయంలో గొడ్డలి రాయికి తగిలింది. గ్రామస్థులతో కలిసి తవ్వగా శివలింగం ప్రత్యక్షమైంది. ఆ రోజు నుంచి మొగిలప్ప ప్రతిరోజూ పూజలు ప్రారంభించాడు.

10th century |

భక్తుడి అచంచల సేవాభావాన్ని గౌరవించిన శివుడు ఆ భక్తుని పేరుతోనే వెలుగొందాడనే విశ్వాసం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ గాథ భక్తి శక్తిని ప్రతిబింబిస్తుంది. ఆలయ నిర్మాణం చోళుల కళా వైభవాన్ని ప్రతిఫలిస్తుంది. శాసనాల ఆధారంగా 10వ శతాబ్దం నాటికే ఈ క్షేత్రం వెలసినట్లు పండితులు భావిస్తారు. మూడు గోపురాలు, తూర్పుముఖ ప్రధాన ద్వారం, బలమైన ప్రాకార గోడలు, రాతి స్తంభాలపై చెక్కిన దేవతా శిల్పాలు ప్రాచీన దక్షిణ భారత ఆలయ నిర్మాణ సంప్రదాయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వెళ్లేటప్పుడు ఒకే సారి త్రిమూర్తుల దర్శనం లభించడం ఈ ఆలయానికి అత్యంత విశిష్టత. కుడివైపున దక్షిణామూర్తి, వెనుకవైపున మహావిష్ణువు, ఎడమవైపున బ్రహ్మదేవుడు దర్శనమిస్తారు. సృష్టి, స్థితి, లయ తత్వాలు ఒకే ప్రదక్షిణలో అనుభూతి చెందే నిర్మాణ శైలి అరుదైనది.

10th century | నంది విగ్రహం నుంచి ఏడాది పొడవునా నీళ్లు

10th century |

ఈ క్షేత్రంలో అత్యంత ఆశ్చర్యకర ఘట్టం పుష్కరిణి. నంది విగ్రహ నోటి నుంచి ఏడాది పొడవునా నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎండాకాలంలోనూ ఆ ప్రవాహం ఆగదు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియని రహస్యం భక్తుల్లో మరింత భక్తి భావాన్ని కలిగిస్తుంది. ఈ తీర్థస్నానం సంతానప్రాప్తి, ఆరోగ్యం, కుటుంబ శాంతి ఇస్తుందని విశ్వాసం. మహిళలు, పిల్లలు విశేష భక్తితో ఈ నీటితో స్నానం చేసి స్వామిని దర్శిస్తారు. ఇది క్షేత్ర పవిత్రతకు జీవ సాక్ష్యం.

10th century |

ఇక్కడ రాహు కేతు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. జాతక దోషాలు, సర్పదోషాలు, వివాహ ఆలస్యాలు తొలగాలని భక్తులు విశ్వాసంతో ఈ పూజల్లో పాల్గొంటారు. అనేక కుటుంబాలు ఇక్కడ శాంతి పూజలు చేయించుకొని ఉపశమనం పొందినట్లు చెబుతారు. ఈ ఆలయం వివాహాలకు కూడా ప్రసిద్ధి. శివసన్నిధిలో కలిసే దాంపత్య బంధం శాశ్వత సౌభాగ్యాన్ని ఇస్తుందనే నమ్మకంతో అనేక జంటలు మొగిలేశ్వరుని సాక్షిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం తరచూ మంగళవాద్యాలు, మంత్రోచ్చారణలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. వివాహాల ద్వారా ఈ క్షేత్రం కుటుంబ సౌఖ్యానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది.

10th century | శివుడు పాతాళ గంగను పైకి రప్పించిన పుణ్యభూమి

త్రిశూల తీర్థం ఈ క్షేత్రానికి మరింత పురాణ గౌరవాన్ని అందిస్తుంది. ద్వాపరయుగంలో కరవు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు శివుణ్ణి ప్రార్థించగా పరమేశ్వరుడు త్రిశూలంతో భూమిని గుచ్చి పాతాళ గంగను పైకి రప్పించాడనే గాథ ప్రచారంలో ఉంది. ఆ జలధారే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చిందని చెబుతారు. ఆలయానికి సమీపంలో ఉన్న విభూతి కొండ కూడా విశేషం.

యాగ భస్మం రాశిగా పోసిన ప్రదేశమిదని కథనం. ఈ విభూతితో స్వామికి అభిషేకాలు చేయడం సంప్రదాయం. ఆలయ పైకప్పుపై కనిపించే బంగారు బల్లి, రాహువు శిల్పాలు భక్తుల్ని ఆకర్షిస్తాయి. వీటిని తాకితే దోషాలు తొలగుతాయని విశ్వాసం. ప్రధాన గర్భాలయానికి ఉత్తరంగా కామాక్షి అమ్మవారి సన్నిధి ఉంది. కోరికలు నెరవేర్చే తల్లిగా భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తారు. శైవ–శాక్త సంప్రదాయాల సమన్వయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

10th century | అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు

మహాశివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రం భక్తి తరంగాలతో కళకళలాడుతుంది. పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలు, రథోత్సవం, జాగరణ, భజనలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. రాత్రంతా ఓం నమఃశివాయ నాదం మార్మోగుతుంది. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోతాయి.

చిత్తూరు నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం సౌకర్యవంతంగా ఉంది. బస్సులు, ప్రైవేటు వాహనాలు సులభంగా చేరుకుంటాయి. ప్రశాంత వాతావరణం, ప్రాచీన శిల్ప వైభవం, నంది నోటి తీర్థ అద్భుతం, రాహుకేతు దోష నివారణ పూజలు, వివాహాల పవిత్రత ఈ సమ్మేళనం మొగిలేశ్వర క్షేత్రాన్ని దక్షిణ భారతంలోని అరుదైన శైవ పుణ్యస్థలంగా నిలబెడుతోంది. ఇక్కడ అడుగుపెడితే మనసులో భక్తి పరవశం కలుగుతుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల అనుభవం చెబుతోంది. శివ శివ శంకర నామస్మరణతో మొగిలి దర్శనం ప్రతి భక్తుడి జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపుగా నిలుస్తోంది.

click here to read more : 2 chandra |మనోకారకుడు చంద్రభగవానుడు: చంద్ర దోష ప్రభావాలు, పరిహారాలు & తింగళూర్ క్షేత్ర మహిమ

click here to read more :

Leave a Reply