100 Million | నిల్వలు ఎన్ని..? ఎన్ని రోజులకు..??

100 Million | నిల్వలు ఎన్ని..? ఎన్ని రోజులకు..??
100 Million | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అయితే ఈయుద్ధం కొనసాగితే భారత్ పై ఆ ప్రభావం కనబడుతుంది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 100 మిలియన్ బ్యారెల్ల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. వీటిలో వ్యాపార నిల్వలు, సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న సరుకు, అలాగే విశాఖపట్నం, మంగళూరు, పాడూరు ప్రాంతాల్లో ఉన్న వ్యూహాత్మక భూగర్భ నిల్వలు (Strategic Petroleum Reserves) ఉన్నాయి. ఇవి కలిపి చూస్తే దేశ అవసరాలకు సుమారు 40 నుంచి 45 రోజుల పాటు సరిపడేంత ముడి చమురు నిల్వలు ఉన్నట్టు అంచనా.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి తుది ఇంధన ఉత్పత్తుల నిల్వలను కూడా కలిపితే దేశానికి సుమారు 6 నుంచి 8 వారాలు (40–50 రోజులు) సరిపడే ఇంధన భద్రత ఉన్నట్టు కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇరాన్ యుద్ధం మరింత కాలం కొనసాగి, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మార్గం పూర్తిగా మూతపడితే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 40–50 శాతం ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఈ మార్గంలో అంతరాయం కొన్ని వారాలకంటే ఎక్కువ కాలం కొనసాగితే నిల్వలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
అయితే తక్షణ ఇంధన కొరత ఏర్పడే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే వ్యూహాత్మక నిల్వలు వినియోగించడంతో పాటు, ఇతర దేశాల నుంచి ప్రత్యామ్నాయ దిగుమతులు పెంచే చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఒకరకంగా చెప్పాలంటే…తక్కువ కాలానికైతే ఇంధన భద్రత ఉంది, కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ధరల పెరుగుదల, సరఫరా ఒత్తిడి వంటి ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది.
