1.50 lakh | ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు…

1.50 lakh | ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు…
- మహా శివరాత్రి రోజు సుమారు 1. 50 లక్షల మంది పైన భక్తులు వస్తారని అంచనా…
- భక్తులకు సౌకర్యాలతో పాటు పటిష్ట బందోబస్తు…
- జిల్లా ఎస్ పి…
1.50 lakh | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు జరుగుచున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేయడంతో పాటు పటిష్ట భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ సునీల్ షేరన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిన్నటి దినం బుధవారం సుమారు 63,596 మంది భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు చేసుకోవటం జరిగిందన్నారు.
వీరిలో 14,803 మంది శివ స్వామి భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్పర్శ దర్శనం చేసుకున్నారు. సుమారు 40,149 మంది దర్శనం చేసుకోగా వారిలో 11,515 మంది శివ స్వామి భక్తులు ఉన్నారు. నిన్నటి దినం కైలాస ద్వారం నుండి సుమారుగా 26 వెల మందికి పైగా భక్తులు కాలినడకన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి రావడం జరిగిందన్నారు. వారందరికీ అసౌకర్యం లేకుండా వైద్య సేవలతో పాటు ఆహారము నీళ్లు మొదలగు సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు.
శివరాత్రి పర్వదినం రోజున అనగా 15 వ తేదీన సుమారు 1.50 లక్షల మంది కన్నా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందని వారికి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలగకుండా సరిపడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాతాళ గంగా స్నానఘట్టాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదాలు జరగకుండా బోట్లను గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అధిక సంఖ్యలో వచ్చి భక్తుల వాహనాలు ట్రాఫిక్ అంతరాయం లేకుండా బస్సులకు, కార్లకు రింగ్ రోడ్డు వద్ద ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దర్శనం కోసం భక్తులు ఇతరులకు ఇబ్బంది లేకుండా తమ వాహనాలను పోలీసు వారి సూచనలతో పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే నిలుపుకోవాలని రోడ్డుకు ఇరువైపులా ఎట్టిపరిస్థితులలో వాహనాలు నిలుపరాదని విజ్ఞప్తి చేశారు.
