యువ‌త‌కు ఎందుకింత వ్యామోహం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ప్ర‌పంచం మొత్తం సోష‌ల్ మీడియా (Social media) చుట్టూ తిరుగుతోంది. ఫేస్ బుక్ (Facebook), ఇన్ స్టా(Instagram), యూట్యూబ్‌(YouTube)ల‌లో ఒక్కరోజు వీడియోలు చూడకపోతే బ‌త‌క‌మేమ‌న్న‌ట్లు యువ‌త వ్య‌వ‌హ‌రిస్తోంది. సోష‌ల్ మీడియా యాప్‌లలో ఏ ఒక్క‌దానిపైన నిషేధం విధించినా ప్ర‌పంచం ఏదో మునిగిపోయిన‌ట్లు ఆందోళ‌న చెందుతున్నారు. గ‌తంలో ఈ యాప్‌లు లేకున్నా రోజులు గ‌డిచిపోయాయి క‌దా.. ఇప్పుడెందుకు సోష‌ల్ మీడియా యాప్‌ల మీద ఇంత వ్యామోహం. వాటికెందుకు ఇంత‌లా వ్య‌స‌న‌ప‌రులుగా మారిపోయారో అర్ధం కావ‌డం లేదు. ఒక్క యాప్ నిషేధిస్తే దానికి ప్ర‌త్యామ్నాయంగా ఎన్నో వ‌స్తున్నాయి.

గ‌తంలో భారత్‌(India)లో టిక్ టాక్‌(TikTok)ను బ్యాన్ చేశారు. అయినా భార‌త్‌లో ఎవ‌రూ రోడ్డెక్కి ఆందోళ‌న చేసిన ధాఖ‌లాలు లేవు. దానికి ప్రత్యామ్నాయం ప్రజలు వెదుక్కున్నారు. టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్లంతా ఇప్పుడు ఇన్ స్టాలో రీల్స్ చేస్తున్నారు. ఇలా యాప్‌లు మాయ‌మైనా వాటికి ప్ర‌త్యామ్నాయంగా ఏదో ఒక‌టి వ‌స్తూనే ఉంటాయి. అలాగ‌ని టిక్‌టాక్ కోసం భార‌తీయులెవ‌రూ రోడ్డెక్కి ధ‌ర్నాలు చేయ‌లేదు. మ‌రి నేపాల్‌(Nepal)లో మాత్రం యాప్‌ల‌పై నిషేధం విధిస్తే ఎందుకు ఈ అల్ల‌ర్లు చేస్తున్నారు. యాప్‌ల‌పై నిషేధం విధించార‌ని రోడ్డెక్కి నిర‌స‌న‌లు చేస్తున్నారు. ఎందుకు ఇంత‌లా హింసకు పాల్ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా యాప్‌(App)ల కోస‌మే ఇదంతా చేస్తున్నారంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. దీని వెనుక ఏదో రాజ‌కీయం కోణం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియా యాప్‌ల‌పై నిర‌స‌న‌లు తెలుపుతున్న జెన్ జెడ్ (Gen Z) కూడా ఇదే విష‌యాన్ని స్పష్టం చేసింది. ఈ అల్ల‌ర్ల‌కు మాకు సంబంధం లేదంటుంది.. మ‌రి ఇంత దారుణ‌మైన అల్ల‌ర్ల‌కు కార‌ణం ఎవ‌రు..? దీని వెనుక ఉన్నది ఎవ‌రు..?

గత 30 ఏళ్లుగా నేపాల్‌లో రాజకీయ నాయకులు దోపిడీపై యువ‌త ఉద్య‌మానికి తెర‌లేపిన‌ట్లు తెలుస్తోంది. లీడ‌ర్లు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపించాలని డిమాండ్ మొద‌లైంది. రాజ్యాంగాన్ని తిరగరాసి పాలనలో సంస్కరణలు చేపట్టాలని యువత కోరుకుంటోంది. ఉద్యమ నిర్వాహకులు సైన్యం ముందు కీలక డిమాండ్లు ఉంచారు. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించాలని, వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించి రాష్ట్ర గౌరవం, గుర్తింపు ఇవ్వాలని, నిరుద్యోగం, వలస, సామాజిక అన్యాయంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, కొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రాజ్యాంగాన్నే మార్చేయాలని అడుగుతున్నవారు.. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు.? సోషల్ మీడియా బ్యాన్ తర్వాతే వారంతా ఎందుకు రోడ్లపైకి వచ్చారు. ఒకవేళ సోషల్ మీడియాని ప్రభుత్వం నిషేధించకపోయి ఉండి ఉంటే.. వీరిలోని చైతన్యం ఎక్కడికి పోయేది అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. నేపాల్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఉంది. ప్రజాస్వామ్యాన్ని మించిన ప్రభుత్వ పాలనను నేపాల్ యువత కోరుకుంటోంది. నేపాల్ లో 1948లో గవర్నమెంట్‌ ఆఫ్‌ నేపాల్‌ యాక్ట్‌ ద్వారా తొలిసారి రాజ్యాంగం ఏర్పడింది. 2007లో ఇంటీరియమ్‌ కానిస్టిట్యూషన్‌ ఆఫ్‌ నేపాల్‌ ద్వారా రాజరిక వ్యవస్థను పూర్తిగా తొలగించారు. 2015 సెప్టెంబర్ 20న పూర్తిస్థాయి రాజ్యాంగం నేపాల్ లో అమల్లోకి వచ్చింది. దీని ద్వారా నేపాల్‌ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌ గా మారింది. అంటే పదేళ్లలోనే ఆ రాజ్యాంగంపై ప్రజలకు విసుగొచ్చిందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Leave a Reply