బైకర్లకు కృష్ణా పోలీసులు వినూత్న శిక్ష

( ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి)
మచిలీపట్నం పురవీధుల్లో కొంతమంది యువత మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ ఎదుటి వారికి సైతం ప్రాణహాని కలిగించే ప్రవర్తిస్తున్నారు. అంతేకాక అధిక శబ్దాలతో సైలెన్సర్లు మార్చుతూ అత్యధిక శబ్దాలను వినియోగిస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడుతూ రహదారులపై బీకర వాతావరణన్ని సృష్టిస్తున్నారు. బైకుల ఆటలకు చెక్ పెట్టేందుకు కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం సమాయత్తం అయ్యింది.
గత కొన్ని రోజులుగా బందరు పట్టణంలో ట్రాఫిక్ సీఐ నున్న రాజు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బైకుల వాస్తవ సైలెన్సర్లు తీసివేసి ఆధునీకరించిన సైలెన్సర్లతో అధిక శబ్దాలతో సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు గురి చేస్తున్న 100 వాహనాల సైలెన్సర్లను తొలగించారు. వీటిని మళ్లీ వినియోగించకుండా రోడ్డు రోలర్ సహాయంతో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు , బందరు డీఎస్పీ సిహెచ్ రాజు సమక్షంలో ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టామన్నారు. వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ఆర్టీవో నిబంధనల ప్రకారం సైలెన్సర్ ఉంటుంది, కొంతమంది వ్యక్తులు శబ్దం పెరిగే సైలెన్సర్లను మార్చి శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను తొలగించి అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను మార్చినట్లయితే వాహనదారుడు తో పాటు మార్పు చేసిన మెకానిక్ పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

🔹చట్టం ఏమి చెబుతుందంటే..

ఒక వాహనం నిర్ణీత డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ద కాలుష్యం సృష్టిస్తే అది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం.
🔹నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనంపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసుల పాటు రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేయవచ్చు.
🔹సంబంధిత వాహన చోదకుడికి రూ.1500 జరిమానాతో పాటు కేసు నమోదు చేయవచ్చు. రెండోసారి శబ్ద కాలుష్యానికి కారణమైతే రూ.3 వేల వరకు జరిమానా విధిస్తారు.

Leave a Reply