ఒకరి పరిస్థితి విషమం.. మరొకరికి తీవ్ర గాయాలు..
పేలుడు జరిగిన భవనం, పక్కన రేకుల ఇల్లు ధ్వంసం..
మరో రెండు గృహాలకు పాక్షిక నష్టం
ప్రమాదానికి కారణాలపై అనేక అనుమానాలు
రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్
ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభం
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 3 (ఆంధ్రప్రభ): మండల పరిధిలోని కొత్త జూపూడి కాలనీలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. పక్కనే ఉన్న ఒక రేకుల ఇల్లు పూర్తిగా దెబ్భతినగా, మరో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సేకరించిన సమాచారం ప్రకారం కొత్త జూపూడి కాలనీలో నివసిస్తున్న రెంటపల్లి కోటమ్మ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది.
ఆ సమయంలో ఆమె ఇంట్లోనే ఉంది. వెల్డింగ్ మేస్త్రి మహేష్, మరో కార్మికుడు గోపి తీవ్రంగా గాయపడ్డారు. గోపి పరిస్థితి విషమంగా ఉంది. తొలుత గ్యాస్ సిలిండర్ పేలినట్లు స్థానికులు చెప్పారు. అయితే ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు ఉన్నాయని, అదే సమయంలో వెల్డింగ్ పని చేస్తుండగా ఈ భారీ పేలుడు సంభవించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా దీపావళి మందుగుండు సామగ్రి ఏమైనా తయారు చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ భారీ పేలుడు ప్రభావంతో జూపూడి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఏడీసీపీ జి.రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎ.చంద్రశేఖర్, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు పరిశీలించి విచారణ చేపట్టారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. పేలుడు ఎందువల్ల జరిగిందో ఇంకా ప్రాథమిక నిర్ధారణకు రాలేదు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, క్లూస్ టీమ్ చేరుకున్నాయి.

