వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి: నారా లోకేష్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి

నర్సరావుపేట, ఆంధ్రప్రభ: వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు సమర్థంగా తిప్పికొట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ పిలుపునిచ్చారు. నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఇప్పటి నుంచే సమష్టిగా పనిచేయాలని లోకేష్‌ సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.

కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉంది

పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు, పదవులు దక్కుతాయని నారా లోకేష్‌ స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. అదే సమయంలో చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.

సమన్వయంతో పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

ఈ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, పార్టీ నేతలు జానీ సైదా, నల్లపాటి రామచంద్రప్రసాద్‌, బీటీ నాయుడు, కోవెలమూడి నాని తదితరులు పాల్గొన్నారు.